‘అసలైన’ రైతులు ఢిల్లీ నుంచి వచ్చేయండి : పంజాబ్ సీఎం

ABN , First Publish Date - 2021-01-27T01:36:00+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న

‘అసలైన’ రైతులు ఢిల్లీ నుంచి వచ్చేయండి : పంజాబ్ సీఎం

చండీగఢ్ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ‘అసలైన’ రైతులు ఢిల్లీ నుంచి తిరిగి రావాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కోరారు. మంగళవారం జరిగిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో తిరిగి ఢిల్లీ సరిహద్దులకు రావాలని ఓ ట్వీట్‌ ద్వారా కోరారు. ఢిల్లీలో మంగళవారం కనిపించిన దృశ్యాలు దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించారు. కొన్ని శక్తులు హింసకు పాల్పడటం ఆమోదయోగ్యం కాదన్నారు. దీనివల్ల శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఏర్పడిన సద్భావం తొలగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు నేతలు తమంతట తాము ట్రాక్టర్ ర్యాలీని సస్పెండ్ చేశారని, ఈ సంఘటనలతో తమకు సంబంధం లేదని ప్రకటించారని పేర్కొన్నారు. 


ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ దినకర్ గుప్తాను ఆదేశించారు. ట్రాక్టర్ ర్యాలీ కోసం ఢిల్లీ పోలీసులు-రైతు సంఘాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించిన కొందరు వ్యక్తుల వల్ల ఈ హింస జరిగినట్లు కనిపిస్తోందని, ఇది చాలా ఆందోళనకరమని పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-27T01:36:00+05:30 IST