ఆప్ అభ్యర్థిని ప్రజలే నిర్ణయించాలి: కేజ్రీ
ప్రజలను కోరిన అరవింద్ కేజ్రీవాల్
అభిప్రాయాలు తెలపాలని విజ్ఞప్తి
చండీగఢ్, జనవరి 13: పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అధికారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకే కట్టబెట్టింది.వచ్చే నెల 14న జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరఫున సీఎం అభ్యర్థిని ప్రకటించే విషయంలో వినూత్న పోకడలకు శ్రీకారం చుట్టింది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు కావాలో చెప్పాలని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రజల ను కోరారు. తాను మాత్రం ఎంపీ భగవంత్ మాన్‌వైపే మొగ్గు చూపుతానన్నారు. ‘ప్రజలే తమ సీఎం అభ్యర్థిని ఎంచుకుంటారు (జనతా చునేగీ అప్నా సీఎం)’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం 7074870748 నంబరును కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు తమ అభిప్రాయాలను ఈ ఫోన్ నం బరుకు మెసేజ్, వాయిస్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్‌ల రూపంలో తెలపాలని కేజ్రీవాల్ వెల్లడించారు.
ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అభిప్రాయాలు తెలపాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరుండాలో చెప్పాలని ఓటర్లను ఓ రాజకీయ పార్టీ కోరడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి అన్నా రు. కాగా, కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌లో ఈసీ నిబంధనలు మార్చి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేందుకు ఈసీ సిద్ధమైందని ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా విమర్శలు గుప్పించారు.