చండీఘడ్ : పంజాబ్ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆప్ సర్కారు అవినీతి నిరోధానికి చర్యలు ప్రారంభించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కొత్తగా ప్రారంభించిన అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ అధికారులు మొట్టమొదటి కేసును నమోదు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని ఒక క్లర్క్‌ని అరెస్టు చేశారు. జలంధర్ నగరంలోని తహసీల్దార్-1 కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా క్లర్క్ ఉద్యోగం ఇచ్చేందుకు రూ.4.80 లక్షలు లంచం తీసుకున్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు.దీనిపై అవినీతి క్లర్కుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు.
బాధితుడు తహసీల్దారు కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న మీనా బ్యాంకు ఖాతాకు రూ.4.80 లక్షలను బదిలీ చేశారు. క్లర్కును తనిఖీల అనంతరం అదుపులోకి తీసుకున్నారు. విజిలెన్స్ అధికారుల పరిశీలనలో ఫిర్యాదు నిజమని తేలడంతో విజిలెన్స్ అధికారులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.ఏడాది క్రితం భోగ్పూర్లో జరిగిన ఓ పెళ్లిలో క్లర్క్‌ను ఫిర్యాదుదారుడు కలిశాడు. తన కుమార్తెకు లూథియానాలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చిన క్లర్కు బాధిత వ్యక్తి నుంచి డబ్బు తీసుకుందని విజిలెన్స్ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి
అవినీతి నిరోధక చట్టం 1988లోని సంబంధిత సెక్షన్ల కింద క్లర్క్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.రెండు నెలల గర్భిణి అయిన క్లర్క్‌కు సివిల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల అనుమతి తర్వాత అదుపులోకి తీసుకున్నారు.అవినీతికి పాల్పడిన మీనాను సస్పెండ్ చేసినట్లు విజిలెన్స్ అధికారులు చెప్పారు.