- జేమ్స్ చిత్రానికి భరోసా
బెంగళూరు: పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తానని తానే స్వయంగా చలనచిత్రమండలి ప్రముఖులతో మాట్లాడతానని సీఎం బసవరాజ బొమ్మై ప్రకటించారు. నగరంలో గురువారం హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్‌కుమార్ సతీసమేతంగా ముఖ్యమంత్రి బొమ్మైను ఆయన నివాసంలో కలిశారు. కశ్మీర్ ఫైల్స్కోసం జేమ్స్ చిత్ర ప్రదర్శనకు అడ్డంకులు సృష్టిస్తుండటం, భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ఈ భేటీ కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది. జేమ్స్కోసం కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని కొన్ని థియేటర్ల నుంచి తొలగిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు కొందరు అడ్డుకుంటున్నారంటూ కథనాలు వచ్చిన సంగతి విదితమే. ఈ కథనాలను సీఎం ఖండించారు. చివరికి సినిమాలను కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు ఏ సినిమా కోసమైనా సరే జేమ్స్ చిత్రప్రదర్శనను నిలిపేస్తే సహించే ప్రశ్నేలేదని కర్ణాటక రక్షణావేదిక ప్రవీణ్ శెట్టి వర్గం హెచ్చరించింది. జేమ్స్‌కు మద్దతుగా నగరంలో ప్రవీణ్ శెట్టి సారథ్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మెజిస్టిక్లోని కొన్ని థియేటర్ల వద్ద అతికించిన ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా పోస్టర్లను కన్నడ సంఘాల కార్యకర్తలు చించివేశారు. కన్నడ చిత్రాన్ని మాత్రమే ప్రదర్శించాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న నేపథ్యంలో పలు థియేటర్ల వద్ద ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి