పునీత్‌ సమాధి దర్శనానికి పోటెత్తిన అభిమానులు

ABN , First Publish Date - 2021-11-04T17:22:36+05:30 IST

చందనసీమలో అప్పుగా, పవర్‌స్టార్‌గా, యువరత్నగా ఉన్నత శిఖరాలను అధిరోహించి అర్ధంతరంగా ఇహలోకాన్ని త్యజించిన పునీత్‌రాజ్‌కుమార్‌ ఇక లేడన్న చేదు నిజాన్ని అసంఖ్యాక అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

పునీత్‌ సమాధి దర్శనానికి పోటెత్తిన అభిమానులు

బెంగళూరు(Bengaluru): చందనసీమలో అప్పుగా, పవర్‌స్టార్‌గా, యువరత్నగా ఉన్నత శిఖరాలను అధిరోహించి అర్ధంతరంగా ఇహలోకాన్ని త్యజించిన పునీత్‌రాజ్‌కుమార్‌ ఇక లేడన్న చేదు నిజాన్ని అసంఖ్యాక అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగళూరు కంఠీరవ స్టూడియోలో పునీత్‌ సమాధి ప్రాంతానికి వేలసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సమాధికి పుష్పాంజలి ఘటించారు. చాలామంది అభిమానులు సమాధిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఐదో రోజు శాస్త్రం అనంతరం పునీత్‌ సమాధిని దర్శించేందుకు అభిమానులకు అవకాశం కల్పించిన సంగతి విదితమే. స్టూడియో వద్ద పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను మొహరింపచేశారు. ప్రముఖ తెలుగు నటుడు అక్కినేని నాగార్జున మంగళవారం పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చగా ప్రముఖ తెలుగునటుడు రామ్‌చరణ్‌ తేజ్‌ బుధవారం కుటుంబాన్ని పరామర్శించారు. స్టూడియోకు వెళ్లి సమాధికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పునీత్‌ను మిస్‌ చేసుకోవడం చాలా బాధగా ఉందన్నారు. పునీత్‌ ఇక లేడన్న నిజాన్ని నమ్మలేకపోతున్నానన్నారు. పునీత్‌ ఉత్తమనటుడిగానే కాకుండా ఉత్తమ సమాజసేవకుడిగా లక్షలాదిమంది హృదయాలలో అభిమానం సంపాదించారన్నారు. నేటితరం నటులకు పునీత్‌ ఆదర్శప్రాయం అన్నారు. కాగా సమాధి ప్రాంతంలో అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు నానా ప్రయాస పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే అభిమానులకు అవకాశం కల్పిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 



Updated Date - 2021-11-04T17:22:36+05:30 IST