పునీత్‌ సమాధికి పాలు, నెయ్యితో కుటుంబీకుల పూజలు

ABN , First Publish Date - 2021-11-03T15:57:43+05:30 IST

బెంగళూరు కంఠీరవ స్టుడియోలో మంగళవారం పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద ఐదో రోజు నిర్వహించాల్సిన విధివిధానాలను కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఉదయమే కుమార్తెలు ధృతి,

పునీత్‌ సమాధికి పాలు, నెయ్యితో కుటుంబీకుల పూజలు

              - నేటి నుంచి అభిమానుల సందర్శనకు అవకాశం 


బెంగళూరు(Karnataka): బెంగళూరు కంఠీరవ స్టుడియోలో మంగళవారం పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద ఐదో రోజు నిర్వహించాల్సిన విధివిధానాలను కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఉదయమే కుమార్తెలు ధృతి, వందనతో కలిసి పునీత్‌ సతీమణి అశ్విని స్టుడియోకు చేరుకున్నారు. నటులు శివరాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌తో పాటు బంధువులు చెన్నేగౌడ, ఎస్‌వీ గోవిందరాజ్‌ తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు. పునీత్‌ సమాధి వద్ద కుటుంబీకులు దాదాపు రెండు గంటలకు పైగా గడిపారు. శుక్రవారం ఉదయం పవర్‌స్టార్‌ పునీత్‌ కుమార్‌ గుండెపోటుకు గురై మృతిచెందిన సంగతి తెలిసిందే. కంఠీరవ స్టుడియోలో తండ్రి రాజ్‌కుమార్‌, తల్లి పార్వతమ్మ రాజ్‌కుమార్‌ సమాధుల పక్కనే పునీత్‌ను సమాధి చేశారు. కాగా పునీత్‌ సమాధిని సందర్శించేందుకు అభిమానులను బుధవారం సాయంత్రం నుంచి అనుమతించనున్నారు. కుటుంబ సభ్యుల సమ్మతి మేరకు పోలీసు భద్రత నడుమ ఇందుకు అవకాశం కల్పిస్తున్నామని హోం శాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర వెల్లడించారు. ఐదో రోజు పాలు, నెయ్యి శాస్త్రం సమయంలో కుటుంబీకులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి సమాధి వద్ద కుమార్తెలు కంటతడి పెట్టారు. 


పునీత్‌పై అవహేళన పోస్టింగ్‌.. ఒకరి అరెస్ట్‌

సోషల్‌ మీడియాలో పునీత్‌ రాజ్‌కుమార్‌ను అవహేళన చేస్తూ పోస్టింగ్‌ చేసిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ ప్రకటించారు. ఇలాంటి పోస్టింగ్‌లు ఎవరు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పునీత్‌ను కోల్పోయి విషాదవదనంలో ఉన్న కుటుంబీకులను ఇబ్బంది పెట్టే ఎలాంటి ప్రయత్నాలైనా సహించేది లేదని హెచ్చరించారు. పునీత్‌ను అవహేళన చేస్తూ సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టింగ్‌పై అభిమానుల్లో తీవ్ర ఆక్రోశం వ్యక్తమైంది. ఈ పోస్టింగ్‌ చేసిన వ్యక్తి మానసిక పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 


పునీత్‌కు ‘పద్మశ్రీ’ సిఫారసుకు సీఎం సమ్మతి 

పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ పద్మశ్రీతో పాటు ఎలాంటి అత్యున్నత పురస్కారం పొందేందుకైనా అర్హుడని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. మైసూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మక కర్ణాటక రత్న పురస్కారాన్ని పునీత్‌కు ప్రకటించాలని తనకు పలు విజ్ఞప్తులు వచ్చాయన్నారు. పద్మశ్రీ పురస్కారం కోసం పునీత్‌ పేరును సిఫారసు చేయాలన్న సూచనలు వచ్చాయన్నారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య కూడా ఈ మేరకు ట్వీట్‌ చేశారన్నారు. కేవలం నటనారంగంలోనే కాకుండా సామాజిక సేవా రంగంలోనూ అద్భుత సేవలతో లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న పునీత్‌కు రానున్న రోజుల్లో అత్యున్నత పురస్కారాలు దక్కాలని ఆ కాంక్షించారు. 

Updated Date - 2021-11-03T15:57:43+05:30 IST