Abn logo
Feb 20 2020 @ 04:23AM

పీపీఏలను ఉల్లంఘిస్తే.. రాష్ట్రాల నుంచే రికవరీ!

 • ప్రభుత్వ ఆస్తుల జప్తు కూడా.. చట్ట సవరణకు కేంద్రం  రెడీ
 • కోర్టుకు హామీ ఇచ్చి చెల్లించరా?
 • ముమ్మాటికీ ధిక్కరణే.. ఇలాగైతే జైలుకు పంపుతాం
 • పీపీఏల వ్యవహారంలో హైకోర్టు హెచ్చరిక
 • ఆర్థికస్థితి లేకే చెల్లించలేదు: డిస్కంల వివరణ


  అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లను ఉల్లంఘించకుండా రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ ప్రభుత్వం సౌర, పవన విద్యుదుత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏలను పునఃసమీక్షించడంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి బాసటగా నిలిచి.. వారి పెట్టుబడులను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను ఉల్లంఘిస్తే.. ఆయా రాష్ట్రప్రభుత్వాల నుంచే ప్రాజెక్టు వ్యయం తాలూకు సొమ్మును రికవరీ చేసేలా.. అవసరమైతే ప్రభుత్వ ఆస్తులు జప్తు చేసేలా ఇంధన చట్టాన్ని సవరించనుంది. రాష్ట్రప్రభుత్వాలు గానీ, విద్యుదుత్పత్తి సంస్థలు గానీ పీపీఏలను ఉల్లంఘిస్తే.. వాటిని విచారించేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

  ఈ మేరకు ముసాయిదా బిల్లు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక.. సౌర, పవన విద్యుదుత్పత్తి సంస్థల నుంచి గత ప్రభుత్వం అధిక ధరకు కరెంటు కొనుగోలు చేసిందని ఆరోపిస్తూ.. వాటితో కుదుర్చుకున్న పీపీఏలను పునఃసమీక్షించాలని నిర్ణయించారు. తమ పెట్టుబడులకు రక్షణ లేకుండా పోతుందన్న ఆందోళనతో ఆయా సంస్థలు కేంద్రాన్ని ఆశ్రయించాయి. తమ తమ దేశాల ప్రభుత్వాల ద్వారా ఒత్తిడి కూడా తెచ్చాయి. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లతో కేంద్రం ఇరకాటంలో పడింది. పీపీఏల పునఃసమీక్షకు వెళ్లొద్దని జగన్‌ ప్రభుత్వానికి సూచించింది కూడా. కేంద్ర ఇంధన మంత్రి ఆర్‌.కె.సింగ్‌ పలు సార్లు లేఖలు రాశారు. అయినప్పటికీ జగన్‌ ప్రభుత్వం వినిపించుకోలేదు.


  పెట్టుబడులకు రక్షణ కోసం..
  జాతీయ స్థాయిలో 2003 ఇంధన చట్టం అమలవుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చట్టంతో పెట్టుబడిదారులకు సంపూర్ణ రక్షణ లభించడం లేదని మోదీ ప్రభుత్వం భావించింది. సుదీర్ఘ అధ్యయనం చేశాక.. ఈ చట్టాన్ని సవరించి.. ప్రత్యేకంగా సౌర, పవన విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలకు సంపూర్ణ భద్రత కల్పించేలా ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఇంధన మంత్రి ఆర్‌.కె.సింగ్‌ కొద్దిరోజుల క్రితం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. విద్యుదుత్పత్తి సంస్థలతో రాష్ట్రప్రభుత్వాలు ఒకసారి ఒప్పందం చేసుకున్నాక వాటిని తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిందేనని.. లేదంటే ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేశారు. అప్పుడు ట్రైబ్యునల్‌ రంగప్రవేశం చేస్తుందని.. ప్రాజెక్టుకైన వ్యయం రికవరీకి రాష్ట్రాలను ఆదేశిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు జప్తు చేసే అధికారాన్ని ట్రైబ్యునల్‌కు కట్టబెడుతూ బిల్లు ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని.. త్వరలోనే పార్లమెంటు ముందుకు రానుందని కేంద్ర ఇంధన శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

  విద్యుత్‌పై శ్వేతపత్రం ఇవ్వాలి: జేఏసీ
  విద్యుత్‌ రంగంపై తక్షణమే ఇంధన శాఖ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థల పరిరక్షణకు ఈ కమిటీ బుధవారం ఏర్పడింది. చైర్మన్‌గా పి.చంద్రశేఖర్‌, కన్వీనర్‌గా ఎం.వేదవ్యాసరావు, కోచైర్మన్లుగా కేవీ శేషారెడ్డి, ఎ.శ్రీనివాసకుమార్‌, కో కన్వీనర్‌గా ఎన్‌ లక్ష్మణరావు, వైస్‌చైర్మన్లుగా ఎస్‌.ప్రసాద్‌, కె.మోహనరావు, ట్రెజరర్‌గా ఎంవీవీ ప్రసాద్‌ ఎంపికయ్యారు.

  కోర్టుకు హామీ ఇచ్చి.. చెల్లించరా?

  • ఇలాగైతే బాధ్యుల్ని జైలుకు పంపుతాం
  • పీపీఏల వ్యవహారంలో హైకోర్టు హెచ్చరిక

  పవన, సౌర విద్యుదుత్పత్తి సంస్థలకు 4 వారాల్లోగా బకాయిలు చెల్లిస్తామని కోర్టుకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం ధిక్కారం కిందకే వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు బాధ్యులైన డిస్కం అధికారుల్ని జైలుకు పంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటి వరకు ఏఏ సంస్థలకు ఎంతెంత చెల్లించారు? ఇంకెంత చెల్లించాలన్న వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్‌జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలకు నాలుగు వారాల్లోగా బకాయిలు చెల్లిస్తామన్న డిస్కంలు ఇంకా చెల్లించలేదని సంస్థలు కోర్టు దృష్టికి తెచ్చాయి. దీనిపై ఆగ్రహం చెందిన ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని డిస్కంలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం మరోమారు ధర్మాసనం ముందు విచారణ జరగ్గా.. ఏపీఈపీడీఎసీఎల్‌ తరఫున ఎస్పీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సంతోషరావు అఫిడవిట్‌ దాఖలు చేశారు. హామీ మేరకు బకాయిలు చెల్లించలేకపోయినందుకు క్షమాపణలు కోరారు. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉండటం వల్ల ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం కష్టంగా మారిందని, అందుకే బకాయిలు చెల్లించలేకపోయామని పేర్కొన్నారు.  Advertisement
  Advertisement
  Advertisement