పునీత్ రాజ్‌కుమార్ వైద్యుడికి పోలీసు రక్షణ

ABN , First Publish Date - 2021-11-07T19:12:28+05:30 IST

కన్నడ సూపర్‌స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌‌కు వైద్యం అందించిన ఫ్యామిలీ డాక్టర్..

పునీత్ రాజ్‌కుమార్ వైద్యుడికి పోలీసు రక్షణ

బెంగళూరు: కన్నడ సూపర్‌స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌‌కు వైద్యం అందించిన ఫ్యామిలీ డాక్టర్ రమణరావుకు బెంగళూరు సిటీ పోలీసులు రక్షణ కల్పించారు. వైద్య నిర్లక్ష్యమే పునీత్ మరణానికి కారణమని పలువురు అభిమానులు ఆరోపిస్తున్న నేపథ్యంలో బెంగళూరు సిటీ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. సదాశివనగర్‌లోని ఆయన నివాసం, క్లినిక్ బయట కేఎస్ఆర్‌పీ ప్లాటూన్‌ను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరక్కుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, గస్తీని ముమ్మరం చేశామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పునీత్‌కు వైద్య చికిత్స అందించిన డాక్టర్ రమణరావు, ఇతర వైద్య నిపుణులకు రక్షణ కల్పించాలని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌ల అసోసియేషన్ (పీహెచ్ఏఎన్ఏ) కోరడంతో పోలీసులు ఈ భద్రత కల్పించారు.


పునీత్‌కు వైద్యం అందించిన వైద్యులకు రక్షణ కల్పించాలని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రసన్న ఒక లేఖలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను కోరారు. పునీత్ మెడికల్ కండిషన్‌పై ఆయన ఫ్యాన్స్ ఆరా తీశారని, ఇది వ్యక్తిగత, కుటుంబ సభ్యుల హెల్త్‌కేర్ ప్రైవసీ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన తెలిపారు. పునీత్‌కు చికిత్స అందించిన వైద్యులు ముఖ్యంగా రమణరావు ఎంతో చక్కటి వైద్యసేవలందించారని, అయితే వైద్యులను తప్పుపట్టే  ప్రయత్నాలు కొందరు చేస్తుండటం గర్హనీయమని అన్నారు. సరైన చికిత్స ఇవ్వలేదంటూ కొందరు టీవీల్లోనూ, సోషల్ మీడియా వేదికలపైన ఆరోపణలు చేస్తూ సొంత జడ్జిమెంట్‌లు ఇస్తున్నారని, మీడియా వక్రీకరణల కారణంగా వైద్య నిపుణుల ప్రాణాలకు ముప్పు ఉందని ఆ లేఖలో డాక్టర్ ప్రసన్న సీఎం దృష్టికి తెచ్చారు. వైద్యుల నైతిక స్థైర్యాన్ని పెంచేలా ఒక బహిరంగ ప్రకటన ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రిని ప్రైవేటు వైద్యుల అసోసియేషన్ కోరింది.

Updated Date - 2021-11-07T19:12:28+05:30 IST