Abn logo
Jun 16 2021 @ 12:31PM

వామ్మో.. ఈ భార్యాభర్తలిద్దరూ మామూలోళ్లు కాదు.. మాటల్తోనే మాయ చేసేస్తారు..!

పుణె(ఆంధ్రజ్యోతి): చూడచక్కని జంట, అన్యోన్య దాంపత్యం, ముచ్చటైన జంట.. వంటి పదాలను మీరు వినే ఉంటారు. ఎవరైనా భార్యాభర్తలు కలహాలు లేకుండా కాపురం చేస్తున్నా, ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా జీవిస్తున్నా ఈ పదాలతోనే వాళ్లను సత్కరిస్తుంటారు. అయితే ఇలా కనిపిచే కొన్ని జంటలు మాయ చేస్తాయి. మోసాలకు పాల్పడుతుంటాయి. అస్సలు అనుమానం రాకుండా లక్షలకు లక్షల రూపాయలను స్వాహా చేస్తాయి. మహారాష్ట్రలోని పుణె నగరానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు ఇందుకు తాజా ఉదాహరణ. మంచివాళ్లుగా నటించి, నమ్మించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 లక్షల రూపాయలను కాజేశారు. బాధితుడు గుర్తించేలోపే ఆ భార్యాభర్తలిద్దరూ మకాం మార్చేశారు. జరిగిన ఘోరం తెలిసి ఆ బాధితుడు ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


పరమేశ్వర్ కుంచేకర్ అనే 33 ఏళ్ల వ్యక్తి పుణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం కూడా నడుపుతుంటుంటాడు. రెండేళ్ల క్రితం కుంచేకర్ స్నేహితుడు ఒకరు శుభం గౌర్‌ను పరిచయం చేశాడు. ఢిల్లీలో ఇన్‌కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని చెప్పాడు. కొంత డబ్బు అవసరం ఉందనీ, త్వరలోనే ఇస్తానంటూ అడిగాడు. సరేనన్న కుంచేకర్ ఓ ఐదు లక్షల రూపాయలను అప్పుగా ఇచ్చాడు. కొద్ది నెలల్లోనే ఆ డబ్బును శుభమ్ తిరిగి ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే తన భార్య రంజనా కౌర్‌ను కూడా పరిచయం చేశాడు. ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా జరిగాయి. మంచి స్నేహితులుగా కూడా మారారు. 


ఈ క్రమంలోనే కుంచేకర్‌కు ఓ లిక్కర్ షాపునకు అనుమతులు ఇప్పిస్తానని శుభమ్ చెప్పాడు. ఇది నిజమేనని నమ్మిన కుంచేకర్ దానికి సంబంధించిన వ్యవహారాల నిమిత్తం అడిగినంత డబ్బులను ఇస్తూ పోయాడు. అనుమతుల కోసమనీ, అధికారులను మేనేజ్ చేయడానికంటూ పలుదఫాలుగా పలు కారణాలు చెప్పి ఏకంగా 40 లక్షల రూపాయలను కాజేశారు. రంజన కూడా ఇది నిజమేనని నమ్మించేలా కుంచేకర్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడేది.  ఇటీవల లాక్‌డౌన్ వల్ల కుంచేకర్ తన స్వగ్రామానికి వెళ్లాడు. కొద్ది రోజుల క్రితం పుణె నగరానికి వచ్చిన కుంచేకర్ లిక్కర్ షాపు అనుమతుల గురించి మాట్లాడదామని శుభమ్ గౌర్ ఫ్లాట్‌కు వెళ్లాడు. అయితే అప్పటికే వాళ్లు ఫ్లాట్‌ను ఖాళీ చేశారనీ, వారి గురించిన ఇతర వివరాలు తనకు తెలియదని ఫ్లాట్ యజమానులు చెప్పారు. ఫోన్లు చేసినా ఫలితం లేకపోవడంతో కుంచేకర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న భార్యాభర్తల కోసం వెతుకుతున్నారు. 


క్రైమ్ మరిన్ని...