భార్య ఫోన్లో రెండు మిస్డ్ కాల్స్.. రహస్యంగా ఆరాతీస్తే ఆ నెంబర్ ఎవరిదో తెలిసి నివ్వెరపోయిన భర్త.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2021-11-07T15:47:53+05:30 IST

జీవితంలో అప్పుడప్పుడూ చాలా క్లిష్టమైన సమస్యలకు అతి సులువుగా సమాధానం దొరకడం మనం చూస్తూ ఉంటాం. మహారాష్ట్రలోని పుణె నగర పోలీసులకు కూడా అచ్చం ఇలాగే జరిగింది...

భార్య ఫోన్లో రెండు మిస్డ్ కాల్స్.. రహస్యంగా ఆరాతీస్తే ఆ నెంబర్ ఎవరిదో తెలిసి నివ్వెరపోయిన భర్త.. ఆ తర్వాత..

జీవితంలో అప్పుడప్పుడూ చాలా క్లిష్టమైన సమస్యలకు అతి సులువుగా సమాధానం దొరకడం మనం చూస్తూ ఉంటాం. మహారాష్ట్రలోని పుణె నగర పోలీసులకు కూడా అచ్చం ఇలాగే జరిగింది. చాలా రోజులుగా వెతుకుతున్న ఒక వ్యక్తి మిస్సింగ్ కేసుని కేవలం అతను వేసుకునే చెప్పులతో పోలీసులు పరిష్కరించారు.


పుణెలో నివసించే రాజేష్(27) అనే వ్యక్తి కనబడడం లేదంటూ అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేష్ కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. అతని స్నేహితులు, అతను పని చేసే చోట.. ఇలా అన్ని ప్రదేశాలలో వెతకడం ప్రారంభించారు. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ ఉంది. 


రాజేష్ మొబైల్‌లోని కాల్ డేటా వివరాల ఆధారంగా అతడు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడో వారందరినీ పోలీసులు విచారణ చేశారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి సమీర(30, పేరు మార్చబడినది) అనే మహిళకు రాజేష్ ఫోన్ చేసినట్లు తెలిసింది. సమీరను పిలిచి పోలీసులు విచారణ చేశారు. ఆమె రాజేష్ తనకు ఫోన్ చేసిన వాస్తవమే కానీ ఆ రోజు అతను రాలేదని చెప్పింది. పోలీసులు రాజేష్ ఫోన్ లొకేషన్‌ వివరాలు చూస్తే అతను ఆ రోజు సమీర ఇంటికి వెళ్లినట్లు చూపిస్తోంది.


సమీర చెప్పింది అబద్ధం అని పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు సమీర ఇంటికి తనిఖీ చేయడానికి వెళ్లారు. అక్కడ పోలీసులు ఇల్లంతా సోదా చేసినా ఏమీ దొరకలేదు. ఫలితం లేక తిరిగి వెళుతున్న పోలీసులకు సమీర ఇంటి పెరటి భాగంలో ఒక చెప్పు కనిపించింది. ఆ చెప్పు ఎవరిదని పోలీసులు ప్రశ్నించగా.. తనకు తెలీదని సమీర చెప్పింది. ఆ ఇంట్లో సమీర భర్త ఇంద్రనీల్(35, పేరు మార్చబడినది) కూడా ఉంటాడు. అది తన భర్త చెప్పు కూడా కాదు అని సమీర చెప్పింది.


పోలీసులు ఆ చెప్పుని తీసుకొని రాజేష్ తల్లికి చూపించగా.. అది తన కొడుకు ఆ రోజు వేసుకున్న చెప్పులలో ఒకటి అని ఆమె గుర్తించింది. దీంతో పోలీసులు సమీర, ఆమె భర్త ఇంద్రనీల్‌ని అరెస్టు చేశారు. పోలీసులు ఆ ఇద్దరినీ తమ పద్ధతిలో ప్రశ్నించగా.. ఇంద్రనీల్ జరిగిన విషయం చెప్పాడు.


సమీర, రాజేష్‌ మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ఇంద్రనీల్‌కు తెలియదు. ఇంద్రనీల్ పనిమీద ఊరికి వెళ్లినప్పుడు రాజేష్ ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు ఇంద్రనీల్ ఇంట్లో ఉండగా.. సమీర ఫోన్ మోగుతూ ఉంది. సమీర అప్పుడు స్నానం చేస్తోంది. ఇంద్రనిల్ ఆ ఫోన్ ఎత్తలేదు. కానీ మళ్లీ ఆ ఫోన్ మోగింది. ఈ సారి కూడా ఇంద్రనీల్ ఫోన్ ఎత్తలేదు. మరోసారి ఫోన్ అలాగే మోగితే ఇంద్రనీల్ ఫోన్ ఎత్తాడు. అవతల ఒక పురుషుడు మాట్లాడుతున్నాడు. సమీరతో చాలా చనువుగా మాట్లాడుతున్నట్లు పలకరించాడు. దీంతో ఇంద్రనీల్ మౌనంగా ఉన్నాడు. రాజేష్ మాటలకు సమాధానం ఇవ్వలేదు. రాజేష్ సమీరనే అలా మౌనంగా ఉన్నట్లు అనుకొని ఫోన్లో తమ ప్రేమ వ్యవహారం చెప్పుకొచ్చాడు. 


ఇంద్రనీల్‌కు తన భార్య సమీరపై అనుమానం వచ్చింది. రాజేష్ గురించి తన స్నేహితులతో చెప్పి సమాచారం సేకరించాడు. ఒకరోజు ఇంద్రనీల్ పనిమీద ఢిల్లీ వెళుతున్నట్లు సమీరకు చెప్పి బయలుదేరాడు. ఆ రోజు మధ్యాహ్నం రాజేష్ సమీర ఇంటి వద్దకు వచ్చాడు. సమీర ఇంటి డోర్ బెల్ నొక్కబోయిన రాజేష్‌కు హఠాత్తుగా వెనుకనుంచి ఇంద్రనీల్ కొట్టాడు. ఇంద్రనీల్‌తోపాటు అతని ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు.  ఆ ముగ్గురూ కలిసి రాజేష్ తలపై బలంగా కొట్టి ఈడ్చుకొని వెళ్లారు. ఆ సమయంలో రాజేష్ వేసుకున్న ఒక చెప్పు ఇంటి పెరటిలో జారిపడిపోయింది. 


రాజేష్‌ని తీసుకొని ఒక కారు డిక్కీలో వేసుకొని ఊరి బయట ఒక నిర్మానుషమైన ప్రదేశంలో అతడి శవాన్ని కాల్చేశారు. అతడి చితా భస్తాన్ని కూడా వేర్వేరు ప్రదేశాలలో పడేశారు. రాజేష్ హత్య కేసులో పోలీసులు ఇంద్రనీల్‌ని అరెస్టు చేశారు. రాజేష్ చితా భస్మాన్ని కూడా కొంత వరకు సేకరించారు. హత్య కేసులో ఇంద్రనీల్‌కు సహకరించిన అతడి ఇద్దరి స్నేహితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.


Updated Date - 2021-11-07T15:47:53+05:30 IST