DIY UV-C Suraksha Kits: పూణె బాలుడి అద్భుత రికార్డ్

ABN , First Publish Date - 2021-10-03T21:30:13+05:30 IST

యంగ్ ఇన్నోవేటర్ ఆదిత్య పచ్‌పాండే (15)కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్

DIY UV-C Suraksha Kits: పూణె బాలుడి అద్భుత రికార్డ్

పూణే : యంగ్ ఇన్నోవేటర్ ఆదిత్య పచ్‌పాండే (15)కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. వైరస్‌ల నుంచి ప్రజలను కాపాడే డీఐవై యూవీ-సీ సురక్ష కిట్లను అత్యధిక సంఖ్యలో అసెంబుల్ చేసే సామూహిక కార్యక్రమాన్ని నిర్వహించి ఆదిత్య రికార్డు సృష్టించాడు. కూరగాయలను డిజిన్ఫెక్ట్ చేయడం కోసం ఈ కిట్‌ను గత ఏడాది రూపొందించి, పేటెంట్ కూడా పొందాడు.


ఆదిత్య పచ్‌పాండే నెక్స్ట్‌జెన్‌ఇన్నోవ్8 సోషల్ ఫౌండేషన్‌ను మహారాష్ట్రలోని పూణేలో ఏర్పాటు చేశాడు. కూరగాయలను యూవీ-సీ కిరణాలతో డిజిన్ఫెక్ట్ చేసే సురక్ష కిట్‌ను గత ఏడాది అభివృద్ధి చేసి, పేటెంట్ కూడా పొందాడు. కోవిడ్-19 నుంచి ప్రజలను కాపాడటమే లక్ష్యంగా దీనిని రూపొందించాడు. గాంధీ జయంతినాడు పుణేలో జరిగిన సామూహిక కార్యక్రమంలో డీఐవై యూవీ-సీ సురక్ష కిట్లను అత్యధిక సంఖ్యలో అసెంబుల్ చేయించాడు. ఈ కృషికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (ఇండియా) వైస్ ప్రెసిడెంట్ మహబూబ్ చాంద్‌భాయ్ సయ్యద్ యాడ్జుడికేషన్ ప్రొవిజినల్ సర్టిఫికేట్‌ను ఆదిత్యకు ప్రదానం చేశారు. 


సయ్యద్ మాట్లాడుతూ, ఆదిత్య పచ్‌పాండే అభివృద్ధిపరచిన ప్రొడక్ట్ తమకు చాలా నచ్చిందన్నారు. ఈ శానిటేషన్ ప్రొసీజర్ వల్ల నీరు ఆదా అవుతుందని, తద్వారా పర్యావరణం మెరుగుపడుతుందని చెప్పారు. ఈ కిట్లను పోలీస్ స్టేషన్లు, పాఠశాలలు, కళాశాలలు, కూరగాయల విక్రేతలు, చిన్న తరహా కిరాణా దుకాణాలతోపాటు ఇళ్లల్లో ఉపయోగించవచ్చునని తెలిపారు. ఒకే రోజులో అత్యధిక డీఐవై యూవీ-సీ కిట్లను అసెంబుల్ చేసినందుకు ఆదిత్యను అభినందించారు. 


ఆదిత్య పచ్‌పాండే మాట్లాడుతూ, కొత్తవాటిని సృష్టించడంపై తనకు మక్కువ ఎక్కువ అని తెలిపాడు. నెక్స్ట్‌జెన్‌ఇన్నోవ్8 ద్వారా భారత దేశంతోపాటు విదేశాల్లోని ప్రతి యువ ఇన్నోవేటర్‌కు చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపాడు. అవసరంలో ఉన్నవారికి విరాళంగా ఇవ్వడం కోసం డీఐవై యూవీ-సీ సురక్ష కిట్స్‌ను అసెంబుల్ చేసేందుకు కోవిడ్ హీరోలు ఒకే వేదికపైకి వచ్చారన్నారు. వీరందరినీ ఈ వరల్డ్ రికార్డ్ ఈవెంట్ గౌరవిస్తోందని చెప్పారు. 


ఈ కిట్లను అసెంబుల్ చేసే కార్యక్రమంలో దాదాపు 1,000 మంది పాల్గొన్నారు. వీరిలో ఆరో తరగతి నుంచి కళాశాల స్థాయి వరకు విద్యార్థులు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. ముంబై, పుణేలలో వీరు వీటిని అసెంబుల్ చేశారు. వీటిని అసెంబుల్ చేయడానికి నమోదు చేయించుకున్నవారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్లను ఇచ్చింది. 


Updated Date - 2021-10-03T21:30:13+05:30 IST