పునరపి

ABN , First Publish Date - 2021-10-04T05:38:38+05:30 IST

చిరిగిన దేహ వస్త్రాన్ని వదిలిపెట్టేది ఒకసారే మాసిన మనసుని మాత్రం మళ్ళీమళ్ళీ ఉతుక్కోవాలి...

పునరపి

చిరిగిన దేహ వస్త్రాన్ని వదిలిపెట్టేది ఒకసారే 

మాసిన మనసుని మాత్రం మళ్ళీమళ్ళీ ఉతుక్కోవాలి.


ఆకాశం దుప్పటి మీద రాత్రంతా 

చిందర వందరగా పడిన నక్షత్రాల్ని ఒక్కసారిగా దులిపి 

సూర్యుడు తన సరంజామా పరుచుకున్నట్టు 


రాత్రి కలలో కురిసిన 

పురాస్మృతులు, కోరికలు, భయాలు 

తాత్కాలికంగానో, శాశ్వతంగానో దూరమైన వ్యక్తుల కదిలే నీడలు 

- అన్నిటినీ తెర మీద నుంచి తొలగించి 

మరొక కొత్త రోజుకి సమాయత్తం కావాలి. 


రోడ్డు మీద నడుస్తున్నప్పుడు 

ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకసారి వాన పడక తప్పదు 

చిందిన బురదనీటి బిందువుల్ని 

తప్పించుకోవటమూ సాధ్యం కాదు. 


కొన్ని మరకలు పోవు 

కొన్ని కన్నీటి చారికలు ఎప్పటికీ చెరగవు 

ఎన్ని సార్లు పరిశుభ్రం చేసినా 

వ్యసనాల వాసనలు ఒకపట్టాన వదలవు. 


కలలు, వాస్తవాలు,

కలతలు, కాసిని సంతోషాలు 

అతినేర్పుగా కలిపి చేసిన ఈ కలనేత వస్త్రాన్ని 

ఎప్పటికీ ప్రేమించకా తప్పదు. 

విన్నకోట రవిశంకర్‌

rvinnako@yahoo.com


Updated Date - 2021-10-04T05:38:38+05:30 IST