పులివెందుల పంచాయితీ

ABN , First Publish Date - 2022-04-27T06:45:05+05:30 IST

పంచాయితీ చిన్నదైనా, పెద్దదైనా.. వివాదం ఆస్తి సంబంధమైనదైనా మరేదైనా ఏదో ఒక పార్టీకి ముక్కూముఖం తెలియని వారి నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తాయి.

పులివెందుల పంచాయితీ

బెజవాడలో సెటిల్మెంట్‌ డీల్స్‌

ఫోన్లలో బెదిరింపులు 

కూర్చుని మాట్లాడుకుందాం.. అంటూ ఆహ్వానాలు


పంచాయితీ చిన్నదైనా, పెద్దదైనా.. వివాదం ఆస్తి సంబంధమైనదైనా మరేదైనా ఏదో ఒక పార్టీకి ముక్కూముఖం తెలియని వారి నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తాయి. ఈ ఫోన్‌కాల్స్‌ వచ్చేది స్థానిక గల్లీ నేతల నుంచో, ఆ ప్రాంత ప్రముఖుల నుంచో కాదు.. ఎక్కడో రాయలసీమలో ఉన్న పులివెందుల నుంచి. విజయవాడలో కొన్ని వివాదాల్లో పులివెందుల బ్యాచ్‌ ‘పంచాయితీ’లు మళ్లీ మొదలయ్యాయి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడలో తలెత్తిన ఓ ఆస్తి వివాదంలో మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడైన భాను పేరు బలంగా వినిపించింది. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ ఆస్తి వివాదాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చి భాను సెటిల్మెంట్‌  చేశాడని తేలింది. ఒక పార్టీని తన దారికి తెచ్చుకోవడానికి అతడు ఆయుధాన్ని ఉపయోగించాడు. ఆ తర్వాత చాలా వరకు పంచాయితీలు స్థానిక నేతల సమక్షంలోనే జరిగాయి. తిరిగి మళ్లీ ఇప్పుడు పులివెందుల వ్యక్తులు పంచాయితీలు చేసేందుకు బయలుదేరినట్టు తెలుస్తోంది. అధికారపార్టీ నేతల ద్వారానే ఈ పెద్దలు పంచాయితీలు చేస్తున్నారని సమాచారం.


కూర్చుందాం.. సిద్ధంగా ఉండండి

కొంతకాలంగా విజయవాడలో ఇద్దరు వ్యాపారుల మధ్య వివాదం నడుస్తోంది. ఇద్దరూ స్వయానా మేనమామ మేనల్లుళ్లు. తాను సింగపూర్‌లో ఉన్నప్పుడు పంపిన డబ్బులతో తన మేనల్లుడు వ్యాపారం ప్రారంభించాడని, అప్పులు తీసుకుని తనను హామీగా పెట్టాడని మేనమామ ఆరోపిస్తున్నాడు. మేనమామే తనకు బకాయి ఉన్నాడని మేనల్లుడు చెబుతున్నాడు. ఈ పంచాయితీని మొగల్రాజపురంలో ఉంటున్న వైసీపీ నాయకుడు కొన్నాళ్ల క్రితం సెటిల్మెంట్‌ చేశాడు. వ్యాపారంలో ఉన్న ట్రేడ్‌ మార్క్‌లకు సంబంధించి ఇద్దరి మధ్య కోర్టుల్లో కేసులు విచారణలో ఉన్నాయి. ఇవి కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇవి సివిల్‌ వివాదాలుగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో మేనల్లుడు తన మేనమామపై కేసు నమోదు చేయించాడు. ఈ వివాదాలు జరుగుతుండగానే మేనల్లుడి వైపు నుంచి పులివెందుల బ్యాచ్‌ రంగంలోకి దిగింది. ఫ్యాక్షన్‌ హత్యలతో సంబంధం ఉన్న వ్యక్తి పేరు చెప్పి మేనమామకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ముందు సాఫ్ట్‌గా మాట్లాడిన పులివెందుల వ్యక్తి టైటిల్‌ విషయంలో ఉన్న వివాదం గురించి ప్రస్తావించాడు. ‘మనం కూర్చుని మాట్లాకుందాం సిద్ధంగా ఉండండి..’ అని హుకుం జారీ చేశాడు. పులివెందుల వ్యక్తి ఎంట్రీ ఇవ్వకముందు వివాదం పోలీసుల వద్దకు వెళ్లింది. ఓ పోలీసు ఉన్నతాధికారి సిఫార్సుతో విజయవాడ పోలీసులు రెండు పార్టీలనూ పిలిపించి మాట్లాడినట్టు సమాచారం. రెండు, మూడుసార్లు సిట్టింగ్‌లు జరిగాయి. మధ్యేమార్గం కుదరకపోవడంతో రెండు పార్టీలూ బయటకు వచ్చేశాయి. పోలీసుల సమక్షంలో కొలిక్కి రాకపోవడంతో ఒక పార్టీ పులివెందుల వ్యక్తిని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. వైసీపీకి చెందిన అధికార పార్టీ నేత కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారాలు నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2022-04-27T06:45:05+05:30 IST