ఎందుకింత కాలయాపన!

ABN , First Publish Date - 2020-10-24T11:27:04+05:30 IST

ఆంధ్ర, తమిళనాడు పరిధిలో విస్తరించి ఉన్న పులికాట్‌ సరస్సు వేలాది మత్స్యకార కుటుంబాలకు జీవనాధారం.

ఎందుకింత  కాలయాపన!

 ‘పులికాట్‌’లో పూడికతీత ఎప్పటికో!?

రూ.26.85 కోట్లు కేటాయించిన తమిళ ప్రభుత్వం

మరో 11 పనులకు రూ.133.58 కోట్లు

ఏపీలో ఇప్పటికీ నెరవేరని హామీలు

సర్వేలతోనే సరిపుచ్చుకుంటున్నారు!


తడ, అక్టోబరు 23 : ఆంధ్ర, తమిళనాడు పరిధిలో విస్తరించి ఉన్న పులికాట్‌ సరస్సు వేలాది మత్స్యకార కుటుంబాలకు జీవనాధారం. అలాంటి సరస్సుపై మన పాలకులు నిర్లక్ష్యం ధోరణి అవలంభిస్తున్నాయి. తమిళనాడు వైపు ముఖద్వారం పూడిక తీతకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే మన ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చొరవ చూపడం లేదు. ప్రస్తుతం తమిళ ప్రభుత్వం పూడికతీత కోసం రూ.26.85 కోట్లు కేటాయించింది. ఏపీలో మాత్రం ఇప్పటివరకే సర్వేకే పరిమితమైంది. 2014లో అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి కొన్ని ప్రయత్నాలు చేశారు. ఆ మేరకు అప్పట్లో షార్‌ నిధులతో ఓ దఫా సర్వే సైతం చేయించారు. ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరగడంతో ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి.


ఆ తరువాత 2018, జనవరిలో నెల్లూరు పర్యటనకు వచ్చిన అప్పటి సీఎం చంద్రబాబు సరస్సులో పూడికతీతకు రూ.48 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతోపాటు మరోసారి సర్వే నిర్వహించేందుకు రూ.35 లక్షలు కేటాయించి ఆ మేరకు ఆ ఏడాదే సర్వే చేయించారు. ఆ సర్వే ప్రకారం కేంద్ర పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడం,  వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ పూడికతీత విషయం మరోసారి ప్రశ్నార్ధకంగా మారింది. 


26.85 కోట్ల కేటాయింపు

పూడికతీత విషయంలో ఏపీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంటే తమిళ ప్రభుత్వం సరస్సులో శాశ్వత పూడికతీత వైపు అడుగులు వేస్తోంది. యేటా తాత్కాలిక పూడికతీతతో పాటు శాశ్వత పూడికతీత కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు రూ.26.85 కోట్ల నాబార్డు నిధులను కేటాయించింది.


ఈ పూడికతీతపై చెన్నై హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌పై ఇటీవల అక్కడి ప్రభుత్వ న్యాయవాది కోర్టుకి వివరణ ఇచ్చినట్లు ఆ వివరణ ప్రకారం తమిళ ప్రభుత్వం పులికాట్‌ పూడికతీతతోపాటు మరో 11 పనుల కోసం 133.58 కోట్ల నాబార్డు నిధులను గత ఆగస్టులో కేటాయించిందని కోర్టు దృష్టికి తెచ్చినట్లుగా ఓ ఆంగ్ల ప్రతిక ప్రచురించింది. ఈ శాశ్విత పూడికతీత కోసం ఇప్పటికే కేంద్ర అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆ వ్యాసంలో పేర్కొన్నారు. దీనిప్రకారం త్వరలోనే పనులను ప్రారంభిస్తారని తెలిసింది. ఇలా పులికాట్‌ పునరుజ్జీవం కోసం తమిళ ప్రభుత్వం కృషి చేస్తుంటే ఏపీలో మాత్రం దీనిని ఎన్నికల హామీగానే మిగిలిపోతోంది. 

Updated Date - 2020-10-24T11:27:04+05:30 IST