పక్కా లోకల్‌.. శబరి బూస్ట్‌

ABN , First Publish Date - 2021-01-10T17:19:51+05:30 IST

‘పిల్లలు ఏపుగా ఎదగాలంటే బూస్ట్‌, బోర్నావిటా, హార్లిక్స్‌లు తాగించాల్సిందే’ అంటారు ..

పక్కా లోకల్‌.. శబరి బూస్ట్‌

‘పిల్లలు ఏపుగా ఎదగాలంటే బూస్ట్‌, బోర్నావిటా, హార్లిక్స్‌లు తాగించాల్సిందే’ అంటారు ఆధునిక తల్లులు. వాటిలో నిజమెంతోగానీ మార్కెట్లో వాటి అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. మరి... మన్యంలో పిల్లల పరిస్థితి ఏంటీ? వారికి తినడానికి సరైన తిండే దొరకదు... అందుకని ‘బూస్ట్‌’ తాగించాలంటే... ‘శబరి బూస్ట్‌ ఉందిగా’ అంటున్నారు అక్కడి గిరిజన మహిళలు. పైగా ఇది పోషక విలువలున్న బూస్ట్‌... ప్రకృతి సహజ ఆహారం.. పక్కా లోకల్‌!


తూర్పు కనుమల్లో శబరి నదీ తీరంలో గువ్వలా ఒదిగి ఉన్న గ్రామాలు గుల్లేటివాడ, తెల్లవారిగూడెం. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని ఈ గ్రామాలు పోలవరం ముంపులో కలిశాయి. పునరావాసం, నష్టపరిహారం వంటి సమస్యల నడుమ ఆ రెండు గ్రామాల ప్రజలు జీవనోపాధి కోసం వెతుక్కునే దయనీయ పరిస్థితి. వ్యవసాయ పనులు లేనప్పుడు సమీప అడవుల్లోకి వెళ్లి అటవీ ఉత్పత్తులు సేకరిస్తుంటారు. గర్భిణులు, బాలింతలకు సరైన ఆహారం లేక బలహీనంగా ఉండేవారు. పిల్లలకు కూడా సరైన పోషకాహారం దొరక్క రక్తహీనతతో బాధపడేవారు. మరోవైపు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు బలమైన ఆహారం తినమని సూచించేవారు. 


బుర్రగుంజు... భలే రుచి...

శబరి నదీ తీరమంతా తాటి తోపులే. చింతూరు మన్యంలో సుమారు 5 వేల తాటి చెట్లున్నాయి. వానాకాలంలో తాటిపండ్లు రాలి పడుతుంటాయి. అవి భూమిలో నెల రోజులుంటే తాటి టెంకలకు మొలకలు వస్తాయి. అవి భూమిలో పెరిగితే తేగలంటారు. మొలక దశలోనే టెంకను పగలగొడితే తెల్లని గుజ్జు ఉంటుంది. దానిని ‘బుర్రగుంజు’ అంటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దానిని తీసి విలువ ఆధారిత ఉత్పత్తిగా మార్చితే ఏడాదంతా నిలువ ఉంటుందని ‘ఆశా’ సంస్థ ద్వారా తెలుసుకున్నారు ఆ గ్రామాల మహిళలు. శబరి నదీ తీరంలో ఉన్న పొలం గట్ల మీద టెంకలు సేకరించడం మొదలెట్టారు. ఆశా సంస్థ ఇచ్చిన శిక్షణతో స్వయం ఉపాధిని ఎంచుకుని, బుర్రగుంజును లోకల్‌ బూస్ట్‌గా మార్చడం మొదలెట్టారు. ‘‘తాటి టెంకల నుంచి బుర్రగుంజును తీసి, సోలార్‌ డ్రయ్యర్‌లో ఆరబెడతాం. ఆ తర్వాత మిల్లులో పొడిచేసి సీసాల్లో ప్యాక్‌ చేస్తున్నాం. పాలు లేదా కాస్త వేడి నీళ్లలో ఈ పౌడర్‌ను కలిపి పిల్లలకు ఇస్తే ఇష్టంగా తాగుతున్నారు. దీనిలో మార్కెట్లో దొరికే బూస్ట్‌, హార్లిక్స్‌ల కన్నా ఎక్కువ పోషక విలువలున్నాయని ఆహార నిపుణులన్నారు’’ అంటున్నారు కుంజ అర్జమ్మ. ఆమె పొదుపు సంఘం నాయకురాలు. ఆశా స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నారు. ఆమె తన టీమ్‌తో కలిసి మన్యం బూస్టు తయారీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సహజ ఉత్పత్తికి వారు ‘శబరి బూస్ట్‌’గా పేరు పెట్టారు. 


ఉప్మా, ఇడ్లీ, బూరెలు కూడా...

స్వయం ఉపాధిలో భాగంగా శబరి బూస్ట్‌తోనే వారి నైపుణ్యం ఆగిపోలేదు. తాటిపండ్ల నుంచి బెల్లం, తాండ్ర... తేగల నుంచి ఉప్మా రవ్వను కూడా తయారు చేస్తున్నారు. అల్పాహారంగా ఈ గ్రామవాసులు తేగల ఉప్మారవ్వనే తీసుకుంటారు. తాటిపండ్ల గుజ్జును ఏడాదిపాటు నిలవ ఉండేలా చేస్తున్నారు. దాంతో ఇడ్లీలు, బూరెలు కూడా చేస్తున్నారు. ఆ రుచులను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వస్తున్నారు.


తాటి గుజ్జుతో బిస్కెట్లు, చాక్లెట్లు...

‘‘తాటి గుజ్జును సోడియం బెంజోయెట్‌తో కలిపి అరగంట సేపు వేడి చేయాలి. దానిని సీసాల్లో నింపి నిలువ చేస్తున్నాం. గుజ్జును ఎండబెట్టి, పిండిగా చేసి, వివిధ వంటకాల్లో మైదాకు బదులుగా వాడొచ్చు. తాటి ఇడ్లీ, రొట్టెలే కాకుండా ఈ గుజ్జుతో చాక్లెట్లు, బిస్కెట్లు కూడా తయారుచేయొచ్చు. గుజ్జును నేరుగాకానీ లేదా బియ్యపు పిండి, గోధుమపిండిలో కలిపి పలు రకాల ఆహార పదార్థాల తయారీలో వాడొచ్చు. దీని గురించి రంపచోడవరంలోని ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రంలో శిక్షణ ఇచ్చాం’’.



మధుమేహులకు వరం...

గోదావరి జిల్లాల్లో తాటి చెట్లు కోకొల్లలు. అయితే వాటి పండ్లను పట్టించుకోకపోవడం వల్ల అవన్నీ నేలపాలవుతున్నాయి. ఈ పండ్లను సేకరిస్తే కోటి మెట్రిక్‌ టన్నుల గుజ్జు లభిస్తుందంటున్నారు ఉద్యానవన శాస్త్రవేత్తలు. ఈ బుర్రగుంజు పొడిని పాలల్లో కలుపుకుని తాగితే శరీరానికి శక్తితో పాటు ప్రొటీన్స్‌ కూడా అందుతాయి. మధుమేహులు కూడా ఈ పొడిని తీసుకోవచ్చు. ‘‘తాటిపండ్ల గుజ్జుతో రుచికరమైన ఉత్పత్తులను తయారుచేసి, స్వయం సమృద్ధి సాధించేలా గిరిజన యువతీ యువకులకు స్థానిక వనరుల మీద అవగాహన కల్పించి, ప్రభుత్వ సహకారంతో ఉత్పత్తి, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలోని పందిరిమామిడిలో ఉన్న డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌. ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధన కేంద్రంలో వీటిని నిర్వహిస్తున్నాం. తాటి గుజ్జు ఆహార ఉత్పత్తుల తయారీని కుటీర పరిశ్రమగా చేపడితే మహిళా స్వయం సహాయక బృందాలు మంచి ఆదాయం పొందడానికి అవకాశాలున్నాయి’’ అన్నారు ఆహార శాస్త్ర సాంకేతిక విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త పి.సి.వెంగయ్య. మరోవైపు చింతూరులో ‘ఆశా’ స్వచ్ఛంద సంస్థ కమ్యూనిటీ కేంద్రం ఏర్పాటు చేసి 30 మంది గిరిజన మహిళలకు ప్రతీనెలా కనీస ఆదాయం వచ్చేలా, వారితో అరుదైన ఆహార పదార్థాలను తయారుచేయిస్తూ జీవనోపాధి కల్పిస్తోంది. మొత్తానికి మన్యం మహిళలు వినూత్న ఆహార ఉత్పత్తుల తయారీలో అందరికీ ఆదర్శంగా మారారు.  

- శ్యాంమోహన్‌, 94405 95858

Updated Date - 2021-01-10T17:19:51+05:30 IST