- నకిలీ మంత్రగత్తె అరెస్టు
పుదుచ్చేరి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి గాలి సోకిందని మాయ మాటలు చెప్పి, తన క్షుద్రపూజలతో ఆ బాధను తొలగిస్తానని నమ్మించి 37 సవర్ల నగలు, రూ.12 లక్షలు దోచుకున్న నకిలీ మంత్రగత్తెను పోలీసులు అరెస్టు చేశారు. పుదుచ్చేరి కోరిమేడు ఇందిరానగర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ... ఇందిరానగర్‌లో మురుగన్ (45), లక్ష్మి అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. మురుగన్ ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తుండగా, లక్ష్మి కుట్టుమిషన్ నడుపుతోంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వారి ఇంటిలోని ఓ వాటాలో సత్యవతి అనే మహిళ అద్దెకు దిగింది. ఇటీవల మురుగన్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడని తెలుసుకున్న సత్యవతి.. ఆయనకు గాలి సోకిందని, తాను మాంత్రికురాలినని, క్షుద్రపూజలు చేసి ఆ గాలిని, నొప్పిని పారదోలుతానని నమ్మించింది. ఆమె మాటలను నమ్మిన లక్ష్మి పూజలకు అంగీకరించింది. ఆ మేరకు సత్యవతి పూజల సందర్భంగా లక్ష్మి ఇంటిలో ఉన్న నగలను, నగదు తాంబూలంగా పెట్టాలని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన లక్ష్మి.. అలాగే చేసింది. ఆ నగలను, నగదును చాకచక్యంగా మాయం చేసిన సత్యవతి పూజల ఫలితం వస్తుందంటూ నమ్మబలికింది. ఈ లోగా ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న మురుగన్‌కు కడుపు నొప్పి తగ్గింది. అయితే తన పూజల వల్లే అతని కడుపునొప్పి నయమైందని సత్యవతి ప్రచారం చేసుకుంది. ఆ తర్వాత కొద్దికాలానికి లక్ష్మి మామ దురైరాజన్ తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. దురైరాజన్ భార్య ఉదయకుమారి మాంత్రికురాలు సత్యవతిని కలిసి పూజలతో నయం చేయాలని అభ్యర్థించింది. సత్యవతి ఆమె దగ్గర కూడా నగలు, నగదును తీసుకుని ఇటీవల ఏవో పూజలు చేసింది. కానీ దురైరాజన్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సత్యవతి గుట్టుచప్పుడు కాకుండా ఇల్లు ఖాళీ చేసి పారిపోయింది. ఆమె గురించి ఆరా తీసిన లక్ష్మి కుటుంబం.. అసలు విషయం తెలుసుకుంది. తాము కూడా మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గురువారం ఆమెను అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి