నారాయణ.. నారాయణ!

ABN , First Publish Date - 2021-02-23T14:13:35+05:30 IST

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఎమ్మెల్యేల రాజీనామాలతో నారాయణస్వామి ప్రభుత్వం పతనమైపోయింది. మెజారిటీ లేదని తేలిపోవడంతో అసెంబ్లీ సమావేశం బయటికొచ్చేసిన ముఖ్యమంత్రి...

నారాయణ.. నారాయణ!

కూలిన పుదుచ్చేరి సర్కారు 

అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన రెండుగంటల్లోనే ప్రక్రియ సమాప్తం

నారాయణస్వామికి భద్రత తగ్గింపు


చెన్నై(ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఎమ్మెల్యేల రాజీనామాలతో నారాయణస్వామి ప్రభుత్వం పతనమైపోయింది. మెజారిటీ లేదని తేలిపోవడంతో అసెంబ్లీ సమావేశం బయటికొచ్చేసిన ముఖ్యమంత్రి నారాయణస్వామి.. నేరుగా రాజ్‌నివాస్‌కు వెళ్లి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) డాక్టర్‌ తమిళిసైకి రాజీనామా అందజేశారు. ఆ కొద్దిసేపటికే ఆమె దానిని ఆమోదించినట్టు రాజ్‌నివాస్‌ ప్రకటించింది. ఈ ప్రక్రియ మొత్తం రెండుగంటల వ్యవధిలోనే ముగిసిపోయింది. 19 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌, డీఎంకే కూటమిలో ఏడుగురు తగ్గిపోయినప్పటికీ బలపరీక్షలో తాము గట్టెక్కుతామంటూ కాంగ్రెస్‌ నేతలు ఆదివారం ప్రకటించంతో ఏదైనా అద్భుతం జరుగుతుందే మోనని రాజకీయవర్గాలన్నీ ఉత్కంఠతో ఎదురుచూశాయి. కానీ అసెంబ్లీ సమావేశాలకు ముందే కాంగ్రెస్‌ నేతలు పరోక్షంగా తమ ఓటమిని అంగీకరించడంతో ఆ ఉత్కంఠకు తెరపడింది. 


ఎవరి బలమెంత?

మొత్తం 33 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌-డీఎంకే కూటమికి కేవలం 12 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. ఒక ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడడం, ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మొత్తం 19 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌-డీఎంకేలకు అసెంబ్లీ స్పీకర్‌తో కలిపి కేవలం 11 మంది మాత్రమే మిగిలారు. మాహే స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఇదే కూటమిలో వుండడంతో ఈ సంఖ్య 12గా మిగిలింది. మరోవైపు ఏడుగురు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, నలుగురు అన్నాడీఎంకే, ముగ్గురు బీజేపీ నామినేటెడ్‌ ఎమ్మెల్యేలతో కలిపి ప్రతిపక్ష కూటమికి 14 మంది ఎమ్మెల్యేలున్నారు. 


రెండుగంటల్లోనే ప్రక్రియ పూర్తి

ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభించాలని ఎల్‌జీ ఆదేశించినప్పటికీ కాస్త ఆలస్యంగానే సభ ఆలస్యమైంది. అంతకు ముందు 9.45 గంటలకే అసెంబ్లీ వద్దకు చేరుకున్న నారాయణస్వామి.. స్పీకర్‌ శివకొళుందు చాంబర్‌లోకి వెళ్లారు. అక్కడ ఆయనతో భేటీ అయిన అనంతరం సభలోకి అడుగు పెట్టారు. సుమారు గంటపాటు ఆయన ప్రసంగించారు. అనంతరం నేరుగా వెళ్లి రాజ్‌నివాస్‌లో రాజీనామా సమర్పించారు. ఈ ప్రక్రియ మొత్తం రెండు గంటల్లోనే ముగిసిపోయింది. బలపరీక్ష సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశముండడంతో అసెంబ్లీలోనూ, బయటా మార్షల్స్‌, పోలీసుల బలగాలు మోహరించాయి. అయితే కాస్తవాదోపవాదాలు మినహా సమావేశం ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 


నిప్పులు చెరిగిన నారాయణస్వామి: సోనియాగాంధీ, కరుణానిధిల ఆశీస్సులతో కాంగ్రెస్‌-డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైందంటూ ప్రసంగం ప్రారంభించిన నారాయణస్వామి.. కేంద్రప్రభుత్వాన్ని దునుమాడారు. మాజీ ఎల్‌జీ కిరణ్‌బేదీపై దుమ్మెత్తిపోశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు... కేంద్రప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందన్నారు. తగిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందన్నారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది ప్రజల కోసం అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టినప్పటికీ అవి అమలుకాకుండా మాజీ ఎల్‌జీ కిరణ్‌బేదీ మోకాలడ్డారన్నారు. రాష్ట్రాలను బలహీనపరచడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పని అని, ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. సుదీర్ఘంగా సాగిన ముఖ్యమంత్రి ప్రసంగాన్ని మధ్యమధ్యలో ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్‌ అనంతరామన్‌ మాట్లాడుతూ... ఈ బలపరీక్షకు ముగ్గురు బీజేపీ నామినేటెడ్‌ సభ్యులను అనుమతించరాదని, వారికి ఓటేసే హక్కు లేదని వివరించారు. రాష్ట్రపతి ఎన్నికలకు, రాజ్యసభ ఎన్నికల్లో కూడా వారికి ఓటు హక్కు లేదని, ఇక్కడ కూడా వారికి ఓటు హక్కు కల్పించరాదని పేర్కొన్నారు. అయితే ఆయన అభ్యర్థనను స్పీకర్‌ పట్టించుకోలేదు. 


ఆయన పుదుచ్చేరికి చేసిందేమీ లేదు: ఎన్‌.రంగస్వామి

ప్రధాన ప్రతిపక్షనేత, ఎన్నార్‌ కాంగ్రెస్‌ అధినేత రంగస్వామి మాట్లాడుతూ... గత ఐదేళ్లుగా నారాయణస్వామి పుదుచ్చేరికి చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలను ఇచ్చిన ఆయన ఒక్కదానిని కూడా పూర్తి చేయలేకపోయారని, తన వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నించారన్నారు. ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల బలనిరూపణలు చేసుకోవాలని అడగడం ప్రతిపక్షంగా తమ కనీసధర్మమని వ్యాఖ్యానించారు. ఆ మేరకు తాము చేసిన విజ్ఞప్తిని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆమోదించారన్నారు. బలపరీక్షలో నారాయణస్వామి ప్రభుత్వం విఫలమైందని వివరించారు. బీజేపీ నేత నమశ్శివాయం మాట్లాడుతూ.. నామినేటెడ్‌ ఎమ్మెల్యేలకు ఓటు హక్కు వుందని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. 


రాజీనామా ఆమోదం

నామినేటెడ్‌ సభ్యులకు ఓటు హక్కు వుండడం ఖాయమని తేలిపోవడంతో బలపరీక్షలో నెగ్గడం అసాధ్యమని రూఢీ చేసుకున్న నారాయణస్వామి.. సభ నుంచి నిష్క్రమించారు. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన్ని అనుసరించారు. దీంతో ప్రభుత్వం బలపరీక్షలో విఫలమైందంటూ ప్రకటించిన స్పీకర్‌ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అసెంబ్లీ నుంచి నేరుగా రాజ్‌నివాస్‌కు వెళ్లిన నారాయణస్వామి రాజీనామా పత్రాన్ని ఎల్‌జీకి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీ నామినేటెడ్‌ సభ్యులకు ఓటు హక్కు లేదన్న తమ అభ్యర్థనను స్పీకర్‌ తోసిపుచ్చడంతో తాము సభ నుంచి బయటకు వచ్చేశామని వివరించారు. స్పీకర్‌ సభానిబంధనలను పాటించలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ, అన్నాడీఎంకే, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కలిసి కుట్రపూరితంగా తమ ప్రభుత్వాన్ని కూల్చాయని వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామా ఇచ్చిన కొద్దిసేపటికే దానిని ఆమోదించినట్టు రాజ్‌నివాస్‌ ప్రకటించింది. ఇదిలా వుండగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్టు లేఖను ఎల్‌జీకి అందించిన నారాయణస్వామి తన వాహనానికి వున్న అధికారిక జాతీయ పతాకాన్ని కూడా తొలగించి వెళ్లిపోయారు. ఆ కొద్దిసేపటికే ఆయనకు భద్రతను తగ్గిస్తూ ఎల్‌జీ ఉత్తర్వులు జారీ చేశారు. 


దక్షిణాదిలో పాగా వేయడం ఖాయం: బీజేపీ

దక్షిణాదిలో తమ పార్టీ పాగా వేయడం ఖాయమని బీజేపీ ప్రకటించింది. బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేక, తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నారాయణ స్వామి పుదుచ్చేరికి చేసిందేమీ లేదని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అసెంబ్లీలో తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా వుందన్నారు. దక్షిణభారతదేశంలో తమ పార్టీ పాగా వేస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు పుదుచ్చేరి బీజేపీ నేత నమశ్శివాయం మాట్లాడుతూ... పుదుచ్చేరి ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమని పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-23T14:13:35+05:30 IST