ఆరునెలల్లోపే ‘స్థానిక’ ఎన్నికలు

ABN , First Publish Date - 2021-04-11T14:05:47+05:30 IST

శాసనసభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో, పుదుచ్చేరిలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఆరు నెలల్లోపు నిర్వహిం

ఆరునెలల్లోపే ‘స్థానిక’ ఎన్నికలు


- 1968 తర్వాత మూడవసారి జరుగుతున్న వైనం


పెరంబూర్‌(పుదుచ్చేరి): శాసనసభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో, పుదుచ్చేరిలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఆరు నెలల్లోపు నిర్వహించాలనే సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. కేంద్రప్రభుత్వ ఆధీనంలో ఉన్న పుదుచ్చేరిలో, పుదుచ్చేరి, కారైకాల్‌, మాహే, యానాం తదితర నాలుగు ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో పుదుచ్చేరిలో 23 స్థానాలు, కారైకాల్‌లో 5, మాహే, యానాంలలో తలా ఒక శాసనసభ స్థానం.. మొత్తం 30 నియోజకవర్గాలున్నాయి. అలాగే, ఈ రాష్ట్రంలో పుదుచ్చేరి, ఉళవర్‌కరై, యానాం, మాహే, కారైకాల్‌ అనే ఐదు నగరాలు, విల్లియనూర్‌, అరియాంకుప్పం, బాగూర్‌, నొట్టంపాక్కం, మన్నాడిపట్టు, తిరునల్లారు, తిరుమలైరాజన్‌పట్టణం నిరవి, నెడుంగాడు, కొట్టుచేరి అని 10 కమ్యూనిటీ పంచాయతీల్లో 98 గ్రామ పంచాయతీలున్నాయి. 1968లో పుదుచ్చేరి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా స్థానిక ఎన్నికలు జరిగాయి. అనంతరం 38 ఏళ్ల తర్వాత పలు న్యాయపోరాటాలతో 2006లో రెండవసారి స్థానిక ఎన్నికలు నిర్వహించారు. అప్పటి పదవీకాలం 2011 జూలై 13వ తేదీంతో ముగియగా పలు అవాంతరాల కారణంగా ఇప్పటివరకు స్థానిక ఎన్నికలు జరుగలేదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ వర్గాలు మాట్లాడుతూ, 2018లో సుప్రీంకోర్టు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసినా, కొన్ని కారణాల వద్ద ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నా, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఆరు నెలల్లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమాయాత్తమవుతున్నారు. ఎన్నికలకు కావలసిన ఈవీఎంలు, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు తదితరాల జాబితా తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు.

Updated Date - 2021-04-11T14:05:47+05:30 IST