పుదువై సీఎం - విజయ్‌ ఫొటోలతో బ్యానర్లు

ABN , First Publish Date - 2022-04-09T16:56:00+05:30 IST

స్టార్‌ హీరో విజయ్‌ నటించిన ‘బీస్ట్‌’ చిత్రం ఈ నెల 13వ తేదీ రిలీజ్‌కానుంది. దీంతో విజయ్‌ అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోభాగంగా బ్యానర్లు, కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు.

పుదువై సీఎం - విజయ్‌ ఫొటోలతో బ్యానర్లు

పుదుచ్చేరి: స్టార్‌ హీరో విజయ్‌ నటించిన ‘బీస్ట్‌’ చిత్రం ఈ నెల 13వ తేదీ రిలీజ్‌కానుంది. దీంతో విజయ్‌ అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోభాగంగా బ్యానర్లు, కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, పుదుచ్చేరి రాష్ట్రంలోని పలు చోట్ల కనిపిస్తున్న బ్యానర్లు ఇపుడు చర్చకు దారితీశాయి. ఈ పోస్టర్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామితో పాటు విజయ్‌ ఫొటోలు కనిపిస్తున్నాయి. ‘బీస్ట్‌’ చిత్రం విడుదలకు ముందుకు ఈ తరహా పోస్టర్లు కనిపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇటీవల చెన్నై నగర శివారు ప్రాంతమైన పనైయూరులోని విజయ్‌ నివాసానికి సీఎం.రంగస్వామి వచ్చి ఆయనతో సమావేశమైన విషయం తెల్సిందే. ఇదిలావుంటే, తనకు అవకాశం వచ్చినపుడల్లా కాషాయం పార్టీపై విజయ్‌ పంచ్‌ డైలాగులు వేస్తున్న విషయం తెల్సిందే. ‘బీస్ట్‌’ చిత్రంలో కూడా ఆ పార్టీని ఉద్దేశించి కొన్ని డైలాగులున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి సీఎం రంగస్వామి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి వ్యాప్తంగా హీరో విజయ్‌ - సీఎం రంగస్వామి ఫొటోలతో బ్యానర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2022-04-09T16:56:00+05:30 IST