డ్యామ్‌లో పూడిక తీయరట..!

ABN , First Publish Date - 2022-05-09T05:21:06+05:30 IST

జిల్లాలోని దిగువ సగిలేరు ప్రాజెక్టు 0.25 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించారు.

డ్యామ్‌లో పూడిక తీయరట..!
పూడిక తీయని ఎల్‌ఎస్వీ డ్యామ్‌

రూ.79 కోట్లతో కాలువల విస్తరణ 

ఏ రైతు భూమి ఎంత పోతుందో తెలియదు 

అయినా కాలువల విస్తరణ

అన్నదాతల ఆందోళన

ఇదీ దిగువ సగిలేరు ఆధునికీకరణ వ్యవహారం


సాధారణంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా... కాలువల విస్తీర్ణం పెంచినా అందుకు అవసరమైన భూమని గుర్తిస్తారు. సర్వే చేసి ప్రభుత్వ భూమి ఎంత, ప్రైవేటు భూమి ఎంతో నిర్ణయిస్తారు. ప్రైవేటు భూములకు అయితే పరిహారం నిర్ణయించుకొని అవార్డు ప్రకటిస్తారు. అనంతరం పనులు చేపడతారు. ఏ ప్రాజెక్టు అయినా, జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణాలు అయినా జరిగే తీరు ఇదే... అయితే దిగువ సగిలేరు ఆధునికీకరణ మాత్రం అంతా రివర్స్‌గా జరుగుతోంది. కాలువల విస్తరణకు సంబంధించి ఏ రైతు భూమి ఎంత పోతుందో తెలియకుండానే పనులకు శ్రీకారం చుట్టారు. అంతే కాదండోయ్‌ డ్యామ్‌లో నీటి సామర్థ్యం పెంచుకునేందుకు ఎలాంటి పూడికతీత పనులు చేపట్టకుండానే కాలువ విస్తరణ మాత్రం పెంచుతున్నారు. అధికారుల నిర్వాకంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలోని దిగువ సగిలేరు ప్రాజెక్టు 0.25 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించారు. ఈ డ్యామ్‌ నుంచి బి.కోడూరు, బద్వేలు మండలాల పరిధిలోని 36 చెరువులకు నీరు అందుతుంది. బి.కోడూరు మండలంలో మునిళ్లిచెరువు, రాజుపాళెం, బి.కోడూరు, అమ్మవారిపేట, గుంతపల్లి, ఆనంవారిపల్లె, మేకవారిపల్లె, సీతారామరెడ్డికుంట, నల్లాయపల్లె, రామసముద్రం, కొత్తకుంట, మేకవారిపల్లె పెద్దచెరువు, చిన్నచెరువు, బుడ్డవరంకుంట, అంకనకోడూరు, కొండంపల్లి, అంకనగొడుగూరు, నరసింహాపురం, జార్లకుంట, పెదుళ్లపల్లి, మూలంవారిపల్లె, ప్రభలవీడు, తంగేడుపల్లి, లింగాలకుంట చెరువు లకు నీరు అందుతుంది. అలాగే బద్వేలు పరిధిలో ఈ డ్యాం ద్వారా నీరు అందాల్సినవి బద్వేలు పెద్దచెరువు, నాగుల చెరువు, చెన్నంపల్లె, గొర్లకుంట, నల్లకుంట, ఎర్రకుంట, బస్సకుంట, అబుసాబ్‌పేట, గొడుగునూరు, పుట్టాయపల్లి, చింతలచెరువు, బోయనపల్లి, బాకరాపేట, బయనపల్లి చెరువులు ఉన్నాయి. వీటి కింద సుమారు 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. బి.మఠం మండలంలో చౌదరివారిపల్లి, ఎద్దులాయపల్లె, జౌకువారిపల్లి, బాకరాపేట, పలుగురాళ్లపల్లె, మల్లిగుడిపాడు, దిగువనేలటూరు, గుండాపురం పరిధిలో 2500 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. 


కాలువ విస్తరణ

ఎల్‌ఎస్వీ డ్యామ్‌ నుంచి 200 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉన్న తూము, కాలువను 500 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరిస్తున్నారు. బి.కోడూరు, బద్వేలు మండలాల పరిధిలో 21.5 కిలోమీటర్ల పొడవున్న కాలువలు మాత్రమే విస్తరణ చేపట్టారు. రూ.79.6 కోట్ల నిధులు కేటాయించగా కాంట్రాక్టర్‌ 4.5 శాతం ఎక్సె్‌సతో పనులు దక్కించుకున్నారు. అంచనా వేయడం కన్నా సుమారు మూడున్నర కోటి అదనంగా చెల్లించాల్సి ఉంది. అయితే బి.మఠం మండలం పరిఽధిలోకి వెళ్లే కాలువల విస్తర ణ పనులను చేపట్టడం లేదు.


డ్యామ్‌ నీటి సామర్థ్యం పెంచరా.. 

కాలువ విస్తరణ మంచిదే అయినప్పటికీ అదే సమయంలో డ్యాంలో పూడిక తీత ఇతర పనులు చేపట్టి ఉంటే బాగుంటుందని రైతులు అంటున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు నల్లమల అడవుల నుంచి గిద్దలూరు, కలసపాడు, కాశినాయన మండలాల్లోని సగిలేరు వాగు నుంచి నీరు ఎల్‌ఎస్వీ డ్యామ్‌లోకి చేరుతుంటుంది. వరదలకు రాళ్లు, రప్పలు, చెట్టుకొమ్మలు, ఇసుక తదితరాలు డ్యామ్‌లోకి చేరతాయి. దీంతో సాధారణంగా డ్యాంలో పూడిక చేరుతుంది. నీటి సామర ్థ్యం తగ్గుతుంది. కాలువల విస్తరణకు తగ్గట్లు డ్యాంలో కూడా పూడికతీత పనులు చేపట్టాలని రైతులు చెబుతున్నారు.

 

ఎవరి భూములు పోతాయో... రైతుల ఆందోళన 

ప్రధాన కాలువను 200 క్యూసెక్కుల నుంచి 500 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరిస్తున్నారు. అంటే ఇప్పుడున్న కాలువ పెరుగుతుంది. దీంతో రైతుల భూములు ఎంతో కొంత కాలువ నిర్మాణానికి పోతాయి. అయితే ఎవరి భూమి ఎంతపోతుందనేది ఇంత వరకు తెలీదు. పలానా రైతు భూమి పోతుందని తెలియని పరిస్థితి. వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేయాలని ఉన్నారు. అయితే పనులు పూర్తి చేసి వెళ్లిపోతే రైతులకు పరిహారం ఎవ రిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అమరావతి రాజధాని విషయంలో ల్యాండ్‌  పూలింగ్‌లో రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అయితే రాజధాని విషయంలో జగన్‌ నాలుక మడతేసి మూడు రాజధానులు అంటున్నారు. చట్టబద్ధంగా జరిగిన ఒప్పందానికే దిక్కులేదు. ఇప్పుడు ఎవరి భూమి ఎంత పోతుందో తెలియకుండా పనులు చేస్తుండడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. 


పూడిక తీత అవసరం లేదు

- శ్రీనివాసులు, ఎస్‌ఈ, ఇరిగేషన్‌ 

ఎల్‌ఎస్వీ డ్యామ్‌ అది డైవర్షన్‌ చానల్‌. అక్కడ డ్యామ్‌లో పూడిక తీయాల్సిన అవసరం లేదు. కాలువల విస్తరణతో పాటు తూముల ఆధునికీకరణ స్ట్రక్చర్‌ నిర్మిస్తున్నాం. 

 


 

Read more