అవే ఇళ్లు.. శంకుస్థాపన మళ్లీ మళ్లీ

ABN , First Publish Date - 2021-06-03T09:15:03+05:30 IST

ఇల్లు అదే! ‘భూమిపూజ’ మాత్రం రెండుసార్ల్లు! రాష్ట్రంలోని జగనన్న కాలనీల్లో తలపెట్టిన పక్కా ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం తీరు ఇలాగే ఉంది. 2020 డిసెంబరు 25న ఈ ఇళ్లకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేసి నిర్మాణ

అవే ఇళ్లు.. శంకుస్థాపన మళ్లీ మళ్లీ

జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ల పనులను

నేడు ప్రారంభించనున్న సీఎం జగన్‌

ఈ ఇళ్లకు 6 నెలల క్రితమే శంకుస్థాపన

మూడుచోట్ల పైలాన్లు ఆవిష్కరించిన జగన్‌

కొన్నిచోట్ల కొనసాగుతున్న నిర్మాణాలు


అమరావతి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఇల్లు అదే! ‘భూమిపూజ’ మాత్రం రెండుసార్ల్లు! రాష్ట్రంలోని జగనన్న కాలనీల్లో తలపెట్టిన పక్కా ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం తీరు ఇలాగే ఉంది. 2020 డిసెంబరు 25న ఈ ఇళ్లకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. కాకినాడ, విజయనగరం,శ్రీకాళహస్తిల్లో వీటికి సంబంధించిన పైలాన్‌ కూడా ఆవిష్కరించారు. కట్‌ చేస్తే...2021 జూన్‌ మూడు! అంటే, గురువారం. జగనన్న కాలనీల్లో కొబ్బరికాయ కొట్టి అవే ఇళ్ల నిర్మాణ పనులను మరోసారి జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆదేశాలు కూడా వెళ్లాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15.6 లక్షల ఇళ్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి గురువారం వర్చువల్‌గా ప్రారంభిస్తారని గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు వెల్లడించారు. గతేడాది డిసెంబరు 25న వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల పైచిలుకు కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అదేసమయంలో ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమవుతాయని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. అందుకు అనుగుణంగానే సీఎం జగన్‌ పైలాన్లు ఆవిష్కరించారు. అనంతరం ఇళ్ల స్థలాల చదును, మ్యాపింగ్‌, జియో ట్యాగింగ్‌ ప్రక్రియ చేపట్టారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మోడల్‌హౌస్‌ నిర్మాణాలు కూడా చేపడుతున్నట్లు అప్పట్లో గృహనిర్మాణశాఖ తెలిపింది. మోడల్‌హౌ్‌సలు అన్నిచోట్ల కాకపోయినా వీలైన చోట్ల ప్రారంభించారు. ఇవి కాకుండా దాదాపు లక్షకుపైగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని గృహనిర్మాణశాఖ చెబుతూ వస్తోంది. ఇంతలో ఏమయిందోఏమోగానీ..మరోసారి ‘భూమిపూజ’కు సిద్ధమవుతున్నారు. పథకం ప్రారంభించిన ఆరు నెలల్లో కొన్నయినా నమూనా ఇళ్లు రాష్ట్రవ్యాప్తంగా పూర్తయ్యాయి. ఆ ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తే కొంతైనా అర్థవంతంగా ఉండేదని ప్రభుత్వ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. 


కట్టరు.. కట్టుకొంటామంటే వినరు..

వైసీపీ ప్రభుత్వం పక్కాఇళ్ల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న భావం లబ్ధిదారుల్లో బలంగా నాటుకుంది. అధికారంలోకి రావడంతోనే సంవత్సరానికి ఐదు లక్షల చొప్పున ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం... రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ పథకాన్ని పూర్తి స్థాయిలో పట్టాలెక్కించలేకపోయింది. ఇప్పటి వరకు జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన ఓ కొలిక్కి రాలేదు. కాలనీల్లో విద్యుత్‌ సరఫరా, నీటివసతి ఉంటేగానీ నిర్మాణాలు ప్రారంభించడం సాధ్యంకాదు. ఇంతవరకు వాటినే పూర్తి చేయలేకపోయారు. ఎంతసేపూ... జగనన్న కాలనీల్లోని ఇళ్లపైనే దృష్టిపెట్టిన వైసీపీ ప్రభుత్వం... కాలనీల్లోనూ, వాటి బయటా స్వంత స్థలాలు ఉండి కట్టుకుంటామనే వారి ప్రతిపాదనలను చెవికెక్కించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత స్థలాలు ఉండి ఇళ్లు కట్టుకుంటామనే లబ్ధిదారుల సంఖ్య అధికంగానే ఉంది. వారందరికీ ఇళ్లు మంజూరు చేసి ఉంటే ఈ పాటికి చాలా ఇళ్లు పూర్తయి ఉండేవి. కానీ జగనన్న కాలనీలకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కాలనీల రూపంలో ఇళ్ల నిర్మాణాలు జరిగితే వచ్చే ఎన్నికల నాటికి వాటిని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకోవచ్చనే ఉద్దేశంతో కాలనీలపై అధిక ప్రచారం కల్పిస్తూ వచ్చింది. వాస్తవానికి పేదలకు ఉచితంగా ఇచ్చిన స్థలాలన్నీ ఊర్లకు దూరంగా ఉండడంతో ఎక్కువమంది వాటిపై ఆసక్తి చూపడంలేదు. అయినా ప్రభుత్వం స్వంత స్థలాలకు కాకుండా కాలనీలకే ఎక్కువ మొగ్గు చూపడంతో...రాష్ట్రంలో పక్కాఇళ్ల నిర్మాణాల పథకం ఎటూకాకుండా పోయింది.


ఇళ్ల నిర్మాణానికి నేడే శంకుస్థాపన

ఆలమూరు, జూన్‌ 2: అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో గృహాల నిర్మాణానికి ప్రభుత్వం గురువారం శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో తొలి గృహనిర్మాణానికి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, గృహ నిర్మాణ శాఖ అధికారులు, తహశీల్దార్‌ లక్ష్మీపతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి లబ్ధిదారులతో వీడియో సమావేశంలో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2021-06-03T09:15:03+05:30 IST