పక్కా భవనాలేవి?

ABN , First Publish Date - 2022-06-23T05:23:35+05:30 IST

పక్కా భవనాలేవి?

పక్కా భవనాలేవి?
అంగన్‌వాడీకేంద్రంలో కొనసాగుతున్న చింతలపల్లి గ్రామపంచాయతీ


  • పంచాయతీలుగా ఏర్పడి నాలుగేళ్లయినా సొంత భవనాల్లేవ్‌
  • అసౌకర్యాల అద్దె భవనాల్లో పంచాయతీ కార్యాలయాలు
  • సమావేశాల నిర్వహణకు పాలకవర్గాల ఇబ్బందులు
  • నూతన భవన నిర్మాణాల గురించి ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి 
  • ఆమనగల్లు, కడ్తాల్‌, మాడ్గుల్‌, తలకొండపల్లి మండలాల్లో 49 కొత్త పంచాయతీల ఏర్పాటు
  • రాంనుంతల, ముద్విన్‌, చెన్నంపల్లిలో శిథిలావస్థలో భవనాలు 

ఆమనగల్లు, జూన్‌ 22: పాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం తగిన జనాభా కలిగిన తండాలు, గ్రామాలను నాలుగేళ్ల క్రితం ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆయా పంచాయతీలకు నేటికీ సొంత భవనాలు లేవు. ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. 2018 ఆగస్టు 2వ తేదీన ప్రభుత్వం నూతన పంచాయతీలను ఆర్భాటంగా ఏర్పాటుచేసి అద్దె భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలలో పంచాయతీ కార్యాలయాలను తాత్కాలికంగా ప్రారంభించింది. 2019 జనవరి 25న పంచాయతీలకు ప్రభుత్వం ఎన్నికలకు నిర్వహించింది. గెలుపొందిన పాలక వర్గాలు ఫిబ్రవరి 2న బాధ్యతలు స్వీకరించాయి. భవనాలు లేని కారణంగా పంచాయతీ సమావేశాల నిర్వహణ, గ్రామసభల ఏర్పాటు పాలక వర్గాలకు ఇబ్బందిగా మారింది.

భవనాలు లేని పంచాయతీలు : 52 

ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పరిధిలో 53 పాత గ్రామపంచాయతీలు ఉండేవి. అప్పటికే సుమారు 8 పంచాయతీలకు సరైన భవనాలు లేవు. ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకోగా సొంత భవనాల నిర్మాణానికి అప్పటి పాలక వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు పంపినా నేటికీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు కాలేదు. ఇదిలాఉండగా నాలుగు మండలాల పరిధిలో ప్రభుత్వం కొత్తగా 49 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఆమనగల్లు మండలంలో నాలుగు, కడ్తాల మండలంలో 13, మాడ్గుల మండలంలో 17, తలకొండపల్లి మండలంలో 15 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. పాత, కొత్త పంచాయతీలు కలిపి 102 ఉండగా.. వాటిలో 52 పంచాయతీలకు పక్కా భవనాలు లేవు. దీంతో అద్దె, ఇతర ప్రభుత్వ భవనాలలో తాత్కాలికంగా కార్యాలయాలను కొనసాగిస్తున్నారు.  

ఇబ్బందుల్లో పాలకవర్గం

సొంత భవనాలు లేని కారణంగా గ్రామపంచాయతీ పాలక వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న భవనాల్లో నలుగురొస్తే కదలలేని పరిస్థితి. పాలకవర్గ సమావేశాలకు, గ్రామసభల ఏర్పాటుకు కూడా ప్రస్తుత అద్దెభవనాలు అనువుగా లేవు. దీంతో చాలాచోట్ల కొత్త పంచాయతీలలో చెట్లకింద, గ్రామాల కూడళ్లలో సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్‌లకు కార్యాలయంలో కూర్చోవడానికి గదులు, వసతులు లేవు.పంచాయతీ కార్యాలయాలకు సరైన భవనాలు లేని కారణంగా వివిధ పనులమీద వెళ్తున్న ప్రజలు కూడ ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆర్బాటంగా నూతన పంచాయతీలను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించినా అందుకనుగుణంగా భవనాల నిర్మాణానికి, వసతుల కల్పనకు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తుంది. 

పంచాయతీ భవనాలు నిర్మించాలి

ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అన్ని పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించాలి. అందుకు అవసరమైన నిధుల మంజూరు చేయాలి. భవనాలు సరిగ్గా లేక సమావేశాల నిర్వాహణ కు ఇబ్బందిగా మారింది. కొత్తకుంట తండాలో  చిన్న ఓప్రైవేట్‌ భవనంలో పంచాయతీ కార్యాలయం కొనసాగిస్తున్నాం. భవన నిర్మాణం గురించి మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోగా అన్ని పంచాయతీలకు ప్రభుత్వం భవనాలు నిర్మిస్తుందని తెలిపారు. 

                                                  - శోభచందునాయక్‌, కొత్తకుంట తండా సర్పంచ్‌

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం..

ఆమనగల్లు మండలంలోని కొత్త, పాత పంచాయతీలు 13 ఉన్నాయి.వాటిలో రాం నుంతల, చెన్నంపల్లి భవనాలు శిథిలావస్థకు చేరాయి. వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణంతో పాటు కొత్తగా ఏర్పాటైన శంకర్‌కొండ తండా, చింతలపల్లి, కొత్తకుంట తండాలకు పంచాయతీలకు భవనాల నిర్మాణం గురించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఈజీఎస్‌ లో నిధుల మంజూరు కు అధికారులకు నివేదించాం. నిధులు మంజూరైన వెంటనే ఆయా చోట్ల కొత్త భవనాల నిర్మాణం చేపడుతాం.

                                                         - వెంకట్రాములు, ఎంపీడీవో, ఆమనగల్లు 

అధికారులకు నివేదించాం

రాంనుంతలలో దశాబ్దాల క్రితం నిర్మించిన పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకుంది. కొత్త పంచాయతీ భవన నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాది హామి పథకం కింద రూ.50 లక్షలు మంజూరుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ కు కూడ విన్నవించగా సానుకూలంగా స్పందించారు. కార్యాలయం , సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా నూతన భవన నిర్మాణం చేపట్టాలి. 

                                                             - నేనావత్‌ సోన, సర్పంచ్‌, రాంనుంతల

Updated Date - 2022-06-23T05:23:35+05:30 IST