క్యూఆర్‌ కోడ్‌లతో పబ్లిక్‌ ట్రాకింగ్‌

ABN , First Publish Date - 2020-04-17T19:03:14+05:30 IST

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చైనా ప్రభుత్వం డిజిటల్‌ క్యూఆర్‌ హెల్త్‌ కోడ్‌లను ఉపయోగిస్తోంది.

క్యూఆర్‌ కోడ్‌లతో పబ్లిక్‌ ట్రాకింగ్‌

హాంగ్‌ కాంగ్‌: కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చైనా ప్రభుత్వం డిజిటల్‌ క్యూఆర్‌ హెల్త్‌ కోడ్‌లను ఉపయోగిస్తోంది. మొబైల్‌ టెక్నాలజీ, బిగ్‌ డేటా ఆధారంగా పని చేసే ఈ కోడ్‌ల ద్వారా బహిరంగ ప్రదేశాల్లో ప్రజల కదలికలను గమనిస్తోంది. ‘అలి పే’, ‘వి చాట్‌’ యాప్‌లను చైనాలో దాదాపుగా ప్రతి ఒక్కరు వినియోగిస్తారు. ఈ యాప్‌లలో హెల్త్‌ కోడ్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తారు. 

అయితే ఈ కోడ్‌లను యాక్సెస్‌ చేసుకోవాలంటే ప్రజలు ముందుగా తమ వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా పాస్‌పోర్ట్‌ నెంబర్‌, ట్రావెల్‌ హిస్టరీ, కరోనా రోగులతో కాంటాక్ట్‌, జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నాయో లేవో ఆన్‌లైన్‌లో పేర్కొనాలి. ఆ వివరాలను బట్టి ఎరుపు, ముదురు పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన క్యూఆర్‌ కోడ్‌లను కేటాయిస్తారు. ఎరుపు కోడ్‌ ఉన్నవారు 14 రోజుల పాటు ప్రభుత్వ లేదా సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. ముదురు పసుపు రంగు కోడ్‌ ఉన్నవారికి ఏడు రోజుల ఐసోలేషన్‌ తప్పనిసరి. గ్రీన్‌ కోడ్‌ ఉన్నవారు ేస్వచ్ఛగా తిరగొచ్చు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వారి క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేస్తారు. వీటి ద్వారా బహిరంగ ప్రదేశాల్లో ప్రజల కదలికలను అక్కడి అధికారులు ట్రాక్‌ చేసి వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారు. చైనాలోని 400 పట్టణాలు ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. చాలా పట్టణాలలో ఈ కోడ్‌లు లేకుండా ఎవరినీ బయటికి రానివ్వడం లేదు. ఉద్యోగులు, వర్కర్లు తమ మొబైల్లోని క్యూఆర్‌ కోడ్‌ను చూపితేనే ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించడానికి అనుమతి ఇస్తున్నారు. జపాన్‌, సింగపూర్‌, రష్యాలలో కూడా ఈ తరహా యాప్‌లతో కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2020-04-17T19:03:14+05:30 IST