పోలీసు కస్టడీలో ప్రజల ప్రైవసీ!

ABN , First Publish Date - 2022-05-01T06:14:32+05:30 IST

క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లు– 2022కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. దాన్ని ఆ రోజే (ఏప్రిల్ 18) చట్టం చేస్తూ (ఆక్ట్ 11 ఆఫ్ 2022) భారత ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. నేరశిక్షాస్మృతిలో తీసుకురాబోయే మార్పుల...

పోలీసు కస్టడీలో ప్రజల ప్రైవసీ!

క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లు– 2022కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. దాన్ని ఆ రోజే (ఏప్రిల్ 18) చట్టం చేస్తూ (ఆక్ట్ 11 ఆఫ్ 2022) భారత ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. నేరశిక్షాస్మృతిలో తీసుకురాబోయే మార్పుల గురించి, ప్రజలపై వాటి ప్రభావం విషయమై కూలంకష చర్చలేకుండానే మోదీ ప్రభుత్వం ఆ బిల్లును హడావిడిగా ఆమోదించింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ ఆక్ట్– 1920లో కొన్ని మార్పులు చేసి, కొత్త చట్టాన్ని తీసుకువచ్చి, పాత చట్టాన్ని వెనక్కు తీసుకున్నది. కొత్త చట్టం నేర పరిశోధనలో నేరస్థులను గుర్తించడానికి వారికి సంబంధించి వ్యక్తిగత బయోమెట్రిక్– అంటే చేతుల గుర్తులు, పాదాల గుర్తులు, ఫోటో, కంటి రెటీనా స్కాన్, కంటి ఐరిస్‍–లు సేకరించడానికి సంబంధించినది. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి నేర పరిశోధనను సులభం, సమర్థవంతం చేయడానికి ఈ బిల్లు తెచ్చామని ప్రభుత్వం చెపుతున్నది. దాదాపు ఇటువంటిదే– నేర పరిశోధనలో నేరస్థుల డి‌ఎన్‌ఏను ఉపయోగించడానికి సంబంధించిన బిల్లు 2019 నుంచి లోక్‌సభ పరిశీలన ఉంది. ఈ లోగానే కేంద్రం ఈ ‘క్రిమినల్ ప్రొసీజర్’ చట్టాన్ని చేసింది.


క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లును లోక్ సభలో కేంద్రం మార్చి 28న ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఏప్రిల్ 4న లోక్‍సభలో చర్చకు వచ్చింది. ఈ చర్చ 4గంటల 59 నిమిషాల పాటు జరిగింది. 22 మంది సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారు. ప్రతిపక్షాల వాదనలను పక్కనబెట్టి లోక్‍సభ బిల్లును పాస్ చేసింది. అదేవిధంగా ఈ బిల్లు ఏప్రిల్ 6న రాజ్యసభలో ప్రవేశపెట్టబడింది. అక్కడ 3 గంటల 45 నిముషాల చర్చ జరిగింది. 17 మంది సభ్యులు మాట్లాడారు. ఆ తర్వాత బిల్లును రాజ్యసభ ఆమోదించింది. రెండు సభలలో అధికార పక్షంలో లేని సభ్యులు దీని గురించి మరింత లోతుగా విచారించడానికి దీనిని సెలెక్ట్ కమిటీకి పంపాలని, లేదా కొన్ని సవరణలు చేయాలని ప్రతిపాదనలు చేశారు. కానీ ప్రభుత్వం ఈ వాదనలను పట్టించుకోలేదు. సాధారణంగానే ఈ బిల్లులో కొన్ని క్లాజులు ప్రజల ప్రైవసీ హక్కుకు భంగం కలిగించేలా ఉన్నాయని, దీన్ని అమలు చేసే పోలీసు వ్యవస్థ దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రతిపక్ష సభ్యులు చెప్పారు. ప్రభుత్వం మాత్రం అలాంటి భయాలేం అక్కర్లేదంటూ ప్రతిపక్షాల వాదనలను కొట్టి పారేసి బిల్లును ఉభయ సభల్లో పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. రాష్ట్రపతి దాన్ని ఆమోదించారు. అది చట్టం అయ్యింది.


ఈ చట్టంలో వివాదాస్పద అంశాలు కొన్ని ఉన్నాయి. అవి: 1) నేరస్థులుగా నిర్ధారించబడినవారి నుంచి లేదా అరెస్ట్ అయినవారి నుంచి సేకరించే డేటా. పాతచట్టంలో ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, ఫోటో మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటితో పాటు కంటి ఐరిస్, రెటీనా స్కాన్, భౌతిక జీవ నమూనాలు (బయోలాజికల్ శాంపిల్స్), చేతి రాత, సంతకాలు, ఇవిగాక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 53, 53ఏలో చెప్పిన పరీక్షలు– అంటే రక్తం, వీర్యం, జుట్టు, స్వాబ్స్, డి‌ఎన్‌ఏ ప్రొఫైలుతో సహా– తీసుకోవచ్చు. 2) నేర నిర్ధారణతో సంబంధం లేకుండా ఏ నేరం మీద అరెస్ట్ అయినా, లేదా చట్టం ద్వారా డిటెన్షన్ చేయబడిన వ్యక్తి నుంచి ఐనా, లేదా మెజిస్ట్రేట్ ఆదేశిస్తే ఏ వ్యక్తి నుంచి అయినా (అరెస్ట్ కాకపోయినా) పైన ప్రస్తావితమైన వాటిని తీసుకోవచ్చు. అరెస్టు అయిన వ్యక్తి ఇష్టానికి వ్యతిరేకంగా ఈ నమూనాలు తీసుకోకూడదు అంటూనే పిల్లలు, స్త్రీలపై నేరాలకు పాల్పడిన వారి నుంచి, ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న కేసులలో అరెస్ట్ అయినవారి నుంచి బలవంతంగా సేకరించవచ్చు అని మినహాయింపు ఇచ్చారు. 3) మూడవది ఈ డేటా సేకరించాల్సిన అవసరాన్ని నిర్ధారించే అధికారి స్థాయిని సబ్–ఇన్‌స్పెక్టరు స్థాయి నుంచి హెడ్–కానిస్టేబుల్‌ స్థాయికి తగ్గించారు. 4) ఈ సేకరించిన డేటా 75 సంవత్సరాలు (సగటు మనిషి జీవిత కాలంపాటు) పదిలపరుస్తారు. 5) ఈ డేటా ఇవ్వడానికి నిరాకరించే వ్యక్తిపై ప్రభుత్వ అధికారి విధులకు అడ్డుపడినట్లు భావించి కేసు పెట్టే అవకాశం కల్పించారు.


ఒక వ్యక్తిని నేరస్థుడిగా నిర్ధారించకుండానే అతనికి సంబంధించిన జీవ నమూనాలను బలవంతంగా సేకరించడం, నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్, బ్రెయిన్ ఎలెక్ట్రికల్ యాక్టియేషన్ వంటి పరీక్షలు చేపట్టడం... ఇవి వ్యక్తి స్వేచ్ఛను, ప్రైవసీని హరించడం కిందకే వస్తాయి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా ‘సెల్వి వర్సస్ కర్ణాటక గవర్నమెంటు’ కేసులో స్పష్టం చేసింది. దీన్నే బలపరుస్తూ ‘జస్టిస్ పుట్టుస్వామి వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఒక వ్యక్తి వ్యక్తిగత ప్రైవసీని హరించాలంటే బలమైన కారణం ఉండాలని, ఆ కారణం న్యాయ పరీక్షకు నిలబడాలని, అది ప్రభుత్వ చట్టబద్ధమైన అవసరం అయ్యుండాలని, లక్ష్యమూ దానిని సాధించడానికి ఎన్నుకొన్న పద్ధతుల్లో హేతుబద్ధతలను ప్రతిబింబించే సమతౌల్యత కలిగి ఉండాలని స్పష్టం చేసింది.


కేంద్రం ఇవన్నీ పట్టించుకోకుండా వ్యక్తుల స్వేచ్ఛను, ప్రైవసీని పోలీస్ వ్యవస్థ హరించడానికి అవకాశమున్న ఒక చట్టాన్ని సరైన చర్చ లేకుండా తేవడం గర్హనీయం. సమాజంలో పొలీస్ వ్యవస్థ వ్యక్తుల మానవ హక్కులను కాలరాయడం అతి సామాన్యం అని విమర్శలు ఉన్నాయి. పొలీస్ వ్యవస్థలో జవాబుదారీతనం తేకుండా, ఇలా సున్నితమైన డేటాను సేకరించే అధికారి స్థాయిని తగ్గించడం మరింత అధికార దుర్వినియోగానికి కారణమయ్యే అవకాశం ఉంది. కేవలం స్త్రీలు, పిల్లలపై నేరాలకు పాల్పడేవారి నుంచి బలవంతంగా అయినా నమూనాలు సేకరించే అవకాశం ఉండడం వల్ల, స్త్రీలపై చిన్న చిన్న నేరాలకు పాల్పడి అరెస్టు అయ్యేవారి నుంచి కూడా ఈ డేటా సేకరించే అవకాశం ఏర్పడుతుంది.


అన్నిటి కంటే ముఖ్యమైనది ఈ డేటా భద్రత. ఆధార్ కార్డుల పేరుతో వ్యక్తుల నుంచి సేకరించిన బయో మెట్రిక్ డేటా చాలా సేఫ్‌గా ఉందని, దాన్ని ఎవరూ దొంగిలించే అవకాశం లేదని UIDAI వారు, కేంద్ర ప్రభుత్వం వారు పదేపదే చెప్పారు. కానీ, 2019 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల ఆధార్ డేటాను ఓటర్ జాబితాలతో అనుసంధానం చేయడానికి ఒక ప్రైవేట్ కంపెనీ సంపాదించిందని ఆ యూ‌ఐ‌డి‌ఏ‌ఐ వారే సైబరాబాద్ పరిధిలో కేసు పెట్టారు. ఈ ఉదంతం ప్రభుత్వ సర్వర్లలో డాటా భద్రత నేతి బీరకాయలో నెయ్యి చందమే అని తేటతెల్లం చేసింది. అలాగే ప్రభుత్వ సర్వర్ల నుంచి లబ్ధిదారుల డేటా, బ్యాంకుల సర్వర్ల నుంచి ఖాతాదారుల డాటా వంటివి తరచూ, వారికి తెలియకుండానే ఇంటెర్నెట్‌లో లభ్యమవ్వటం చూస్తూనే ఉన్నాం. ఇక నేరస్థుల, అనుమానితుల డేటా దేశంలో అన్ని నేరపరిశోధనల సంస్థలకు మధ్య, రాష్ట్రాల పరిధిలో ఉన్న సంస్థల మధ్య షేర్ చేసుకోవడం తప్పదు. అంటే పోలీసుస్టేషన్ స్థాయిలో ఈ డేటా లభ్యత ఉంటుంది. కాబట్టి ఈ డేటా మోసగాళ్ళ చేతులలో పడదు అనుకోవడం భ్రమే అవుతుంది. ముఖ్యంగా వ్యక్తుల ఆర్థిక వ్యవహారాలు కూడా బయోమెట్రిక్‌ల ద్వారానే జరుగుతున్నందున బయోమెట్రిక్ డేటా అసాంఘిక, నేర ప్రవృత్తిగల వారి చేతుల్లో పడితే వారు ఆర్థిక అక్రమాలకు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది.


పార్లమెంటు మన అత్యున్నత స్థాయి శాసన వ్యవస్థ. ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను పరిపూర్ణంగా అనుభవంలోకి తీసుకురావడానికి రాజ్యాంగంలో, రాజ్యాంగం ప్రకారం చేసిన చట్టాలలో కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేయవలసిన బాధ్యత భారత పార్లమెంటుకు, దానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు దఖలు పడింది. అదేవిధంగా వివిధ చట్టాలను అమలు పరిచే వ్యవస్థలలోని వ్యక్తులు చట్టాలలో ఉండే లొసుగులను ఆధారంగా చేసుకొని ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను హరించకుండా ఆ లొసుగులను సవరించవలసిన బాధ్యత కూడా పార్లమెంటుదే. దీనితో పాటు చట్టాలకు వక్రభాష్యం చెప్పడానికి అవకాశం లేకుండా వాటిని రూపొందించవలసిన బాధ్యత కూడా పార్లమెంటుదే.


కానీ పార్లమెంటుకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పార్లమెంటులో వివిధ పార్టీల నాయకులు పార్లమెంటు సభ్యులుగా రాజ్యాంగం తమకు ప్రసాదించిన హక్కులను, సదుపాయాలను పూర్తిస్థాయిలో, నిజానికి ఎక్కువ స్థాయిలో అనుభవిస్తూ, రాజ్యాంగం తమకు దఖలు పరిచిన బాధ్యతలను మాత్రం పూర్తిగా విస్మరిస్తున్నారు. అధికారపక్షంలో ఉన్న పార్టీలు తమకు ఉన్న మందబలంతో తోచిన విధంగా చట్టాలు రూపొందించి, ఆ చట్టం వల్ల వచ్చే లాభ నష్టాలు సరైన రీతిలో బేరీజు వేయకుండా, పార్లమెంటులో సరైన చర్చ లేకుండా చట్టాలను ఆమోదిస్తున్నారు. పార్లమెంట్ చేసిన ఒక చట్టం రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును కాలరాస్తుంటే, ప్రజలకు న్యాయస్థానాల గడప తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కానీ ఖరీదైన న్యాయాన్ని కొనే స్తోమత లేని వారు ఈ చట్టాల దురాగతాలకు మౌనంగా బలి అవ్వాల్సిందే. ‘నీలాపనిందల’ పాలైన వారి పట్ల కూడా నిరంకుశంగా వ్యవహరించడానికి ఇలాంటి చట్టాలు అవకాశం కల్పిస్తాయి.


ముఖ్యంగా రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి అధికారాన్ని ఉపయోగించుకొనే రాజకీయ నాయకులకు, ప్రభుత్వంపై విమర్శలను సహించలేక దాన్ని రాజద్రోహంగా పరిగణించే ప్రభుత్వాధినేతలకు, అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తే ఉన్నతాధికారులకు, అధికారంలో ఉన్నవారి కళ్ళలో ఆనందం కోసం న్యాయసూత్రాలను కాలరాచివేసే పోలీసు అధికారులకు, ఇలాంటి చట్టాలు చుట్టాలు అవుతాయి.

శ్రీ వెంకట సూర్యఫణితేజ దినవహి

Updated Date - 2022-05-01T06:14:32+05:30 IST