Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజా సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలి

రెడ్డిపల్లిలో త్వరలో పీహెచ్‌సీ ఏర్పాటు

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

పద్మనాభం, డిసెంబరు 2: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీనెలా మూడో శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమై ప్రజా సమస్యలపై చర్చించాలని, ఆ తర్వాత జరగనున్న సర్వసభ్య సమావేశం 75 శాతం పనులు పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. ఎంపీపీ, జడ్పీటీసీ నిర్ణీత సమయం కేటాయించుకుని ప్రతీరోజు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సర్పంచులు కనీసం వారానికి ఒకసారైనా సచివాలయాలను సందర్శించాలన్నారు. మండలానికి అదనపు పీహెచ్‌సీ మంజూరైందని, దీనిని రెడ్డిపల్లిలో ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూశాఖపై తీవ్ర ఆరోపణలు వున్నందున ప్రజలకు పట్టాదారు పాసుపుస్తకాలు, ఇతర సేవలను సత్వరమే అందించాలన్నారు. ఇదిలా వుండగా పలువురు సభ్యులు అధికారుల దృష్టికి కొన్ని సమస్యలను తెచ్చారు. పంచాయతీలకు రావాల్సి 15వ ఆర్థిక సంఘ నిధుల్లో కోత విధించారని, సీనరేజ్‌ ఫండ్స్‌ జమ కావడం లేదని పలువురు సర్పంచులు వివరించారు. 2013 నుంచి విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయని జిల్లా పంచాయతీ అధికారి వి.కృష్ణకుమారి తెలిపారు. ఇకనుంచి సర్పంచ్‌ల పేరున యూనియన్‌ బ్యాంకులో ఖాతాలు తెరిస్తే వాటిలోకి 15వ ఆర్థిక సంఘం నిధులు జమ చేస్తారన్నారు. సీనరేజ్‌ నిధులు కూడా పంచాయతీలకే ప్రభుత్వం నేరుగా బదిలీ చేస్తుందన్నారు. ఎంపీపీ కె.రాంబాబు మాట్లాడుతూ పాసు పుస్తకాల జారీకి తీవ్ర జాప్యం జరుగుతుందని, త్వరితంగా మంజూరయ్యేలా చూడాలన్నారు. అలాగే పలు సమస్యలను అధికారుల ముందుంచారు. ఈ సమావేశంలో ఆర్డీవో కె.పెంచల కిషోర్‌, జడ్పీటీసీ సభ్యుడు ఎస్‌.గిరిబాబు, వైస్‌ ఎంపీపీ కె.మంజుల, డీఎల్‌పీవో కొండలరావు, ఎంపీడీవో చిట్టిరాజు, తహసీల్దార్‌, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement