గాడితప్పుతున్న రెవెన్యూ పాలన?

ABN , First Publish Date - 2020-06-07T10:36:02+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెవెన్యూ పాలన గాడీతప్పుతున్నట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. కలెక్టర్‌ కార్యాలయం నుంచే

గాడితప్పుతున్న రెవెన్యూ పాలన?

 ప్రభుత్వం అడ్డుకున్న భూముల్లో అక్రమ నిర్మాణాలు 

 బై నెంబర్లలో భారీగా స్థిరాస్తి వ్యాపారాలు 

 భద్రాద్రి జిల్లా అధికారుల తీరుపై ప్రజల అసహనం


కొత్తగూడెం కలెక్టరేట్‌, జూన్‌ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెవెన్యూ పాలన గాడీతప్పుతున్నట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. కలెక్టర్‌ కార్యాలయం నుంచే రెవెన్యూ వ్యవస్థపై పట్టు కోల్పోయిందని, ఎవరికి వారే ఎమునాతీరే అన్నట్లు రెవెన్యూ అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన ప్రజలకు అనుమతి ఇవ్వకుండా కలెక్టరేట్‌ సిబ్బంది కుంటి సాకులు చెప్పి వారిని వెనక్కు పంపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత గురువారం కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ఆత్మహత్యాయత్నం ఘటన కలెక్టరేట్‌ సిబ్బంది నిర్వాకం వల్ల జరిగినట్లు తెలుస్తోంది. చంద్రుగొండ మండలానికిచెందిన మరకాల రవీందర్‌రెడ్డి తనకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్‌కు వివరించేందుకు కలెక్టరేట్‌కు గత గురువారం ఉదయం 11గంటలకు రాగా సాయంత్రం 4గంటల వరకు కలెక్టర్‌ను కలవనీయకుండా అనేక సాకులు చెప్పి తిప్పి పంపించేందుకు ప్రయత్నించగా విధిలేని పరిస్థితిలో తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడాల్సి వచ్చిందని బాధితుడు గోడు వెల్లబుచ్చడం గమనార్హం.


దీనికితోడు ఇటీవల ఏవో నాగేశ్వరరావు పని తీరుపై కలెక్టరేట్‌ సిబ్బంది పెన్‌డౌన్‌ ప్రకటించడం, వీఆర్వో సంక్షేమ సంఘం ఏకంగా పలు ఆరోపణలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం రెవెన్యూ వ్యవస్థ గాడీ తప్పిందనే ఆరోపణలను బలపరుస్తున్నాయి. ఏవో నాగేశ్వరరావు రెవెన్యూ అధికారులు, వీఆర్వోపై కక్ష్య సాధింపునకు పాల్పడుతున్నారని సాక్ష్యాధారాలతో పలుమార్లు వీఆర్వోల సంఘం ఫిర్యాదు చేసినా కలెక్టర్‌ ఈ వ్యవహారంపై ఒక్క మాట మాట్లడకపోవడం, ఏకంగా కలెక్టరేట్‌ సిబ్బంది అదే ఆరోపణపై విధులను బహిష్కరించి పెన్‌డౌన్‌ ప్రకటించినా ఏమీ మార్పు రాకపోవడం రెవెన్యూ పాలనపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఇదిలా ఉండగా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ పట్టణంలో గత ఏడాదిగా పర్మినెంట్‌ తహసీల్దార్‌ నియామకం జరపకపోవడం ఇన్‌ఛార్జ్‌ల పాలనతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


చంద్రుగొండ, దుమ్ముగూడెం మండలాలకు రెగ్యులర్‌ తహసీల్దార్లు లేకపోవడం, మణుగూరు తహసీల్దార్‌పై ఏకంగా ఎమ్మెల్యే ఆరోపణలు చేసినా మార్చకపోవడం రెవెన్యూ వ్యవస్థ పని తీరుకు అద్దం పడుతోంది. భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ పోస్టు భర్తీ చేయకుండా కొత్తగూడెం ఆర్డీవోకు అదనపు బాధ్యత ఇవ్వడంతో పని భారం పెరిగి ప్రజలకు న్యాయం జరగడంలేదని, కరోనా సందర్భంగా కొన్ని మండలాల్లో రెవెన్యూ సిబ్బంది చాలినంత లేకపోవడం, పాల్వంచ లాంటి మండలాల్లో ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ పట్టణానికే పరిమితం కావడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు రెవెన్యూ సేవలు అందడంలేదని తెలుస్తోంది. దీనికి తోడు పాల్వంచ పట్టణంలో పలు సర్వే నెంబర్లను అప్పటి కలెక్టర్‌ రిజిస్ట్రేషన్లు నిలిపి వేసి ఎలాంటి కట్టడాలు జరపకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పాల్వంచలో భూ దందా కొనసాగుతోంది. పలుచోట్ల ఆక్రమణ తగాదాలు చోటుచేసుకుంటున్నాయి. లేఅవుట్‌, కన్వర్షన్‌ లేకుండా స్థిరాస్తి వ్యాపారం జరగడం, ప్రభుత్వ నెంబర్లు, బై నెంబర్లలో ఎలాంటి రిజిస్ట్రేషన్‌లు చేయరాదని నిబంధన ఉన్నా కోట్లాది రూపాయల వ్యాపారాలు బేషరతుగా జరగడం, ఏజెన్సీ పరిధిలోని సర్వే నెంబర్లలో రిజిస్ట్రేషన్‌లు చేయడం రెవెన్యూ పాలనపై అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి.


కలెక్టరేట్‌లో సెక్షన్‌ ఇన్‌ఛార్జ్‌ల నియామకం విషయంలోనూ అనేక ఆరోపణలు వెలువడుతున్నాయి. కొందరు కలెక్టరేట్‌ సిబ్బంది ఖమ్మం నుంచి కొనసాగుతూ ఏళ్ల తరబడి అదే సీట్లలో కూర్చోవడం పలు అనుమనాలకు తావిస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ ఎంవీ.రెడ్డి జిల్లాలోని రెవెన్యూ పాలన, ప్రభుత్వ, ఏజెన్సీ భూముల పరిరక్షణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.  


Updated Date - 2020-06-07T10:36:02+05:30 IST