Abn logo
Apr 23 2021 @ 02:39AM

సంక్షోభంలో ప్రజారోగ్యం

  • గతవారంలోనే 16 లక్షల కరోనా కేసులు..
  • దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌, బెడ్ల కొరత
  • లాక్‌డౌన్‌ల భయంతో ఊర్లకు వెళ్తున్న కూలీలు 
  • కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: మనదేశం కరోనా మహమ్మారిపై విజయఢంకా మోగించిందని నాలుగు నెలల కిందట ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికి భిన్నంగా గత 24 గంటల్లో నమోదైన కొత్తకేసుల సంఖ్య 3 లక్షలు దాటడం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. అంతేకాదు, బ్రెజిల్‌ను వెనక్కినెట్టేసి అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా తర్వాత రెండోస్థానానికి మనదేశం చేరింది. అన్ని రాష్ట్రాల్లో టెస్ట్‌లు సరిగా జరిగితే మరిన్ని కేసులు నమోదయ్యేవి. గతవారంలో సరాసరిన రోజుకు 1300 మంది కరోనాతో మృతిచెందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ స్మశానాల్లో శవాల వరుసలు చూస్తే పరిస్థితి భిన్నంగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఫస్ట్‌ వేవ్‌ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య వ్యవస్థను ఏమాత్రం మెరుగుపర్చకపోగా.. ఎన్నికల ర్యాలీలు, మతపరమైన సమావేశాలకు అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుత కొవిడ్‌ తీవ్రతకు కారణమని అనేకమంది ఆక్షేపిస్తున్నట్టు వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికీ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రజారోగ్య వ్యవస్థ మొత్తం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆసుపత్రుల్లో అంబులెన్సుల వరుసలు, మెడికల్‌ షాపుల దగ్గర ప్రజల క్యూలు, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్ల కొరతే దీనికి నిదర్శనం. కేంద్రం పీఎం కేర్స్‌ ఫండ్‌ పేరుతో సేకరించిన విరాళాల ద్వారా ఆక్సిజన్‌ సరఫరాను మెరుగుపరుస్తుందని ప్రజారోగ్య నిపుణులు మొదట్లో భావించారు. ఏడాదైనా ఇది జరక్కపోగా ఫండ్‌ వ్యవహారమే మిస్టరీగా మారింది.

 

వ్యాక్సిన్‌ ధరలు పెరిగే అవకాశం

ఏప్రిల్‌లో ఇప్పటివరకు కొవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ కలిపి సగటున రోజుకు దాదాపు 30 లక్షల వ్యాక్సిన్‌ డోసులను వేయగలిగారు. అయితే గతవారం వ్యాక్సిన్ల కొరతతో చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కేంద్రాలు మూతబడ్డాయి. దేశంలో వ్యాక్సిన్‌ కొరత ఉన్నా, 90 దేశాలకు 6.5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను కేంద్రం ఎగుమతి చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మళ్లీ కేసులు విజృంభించడం మొదలయ్యాక కొవిషీల్డ్‌ ఎగుమతులు ఆపేశారు. నిధుల కొరత వల్ల దేశానికి సరిపడా వ్యాక్సిన్‌ డోసులను తాము ఉత్పత్తి చేయలేమని సీరం ఇనిస్టిట్యూట్‌ సీఈఓ పూనావాలా ఇటీవల వ్యాఖ్యానించారు. అలాగే భారతదేశంలో వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడిపదార్థాల దిగుమతులపై ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ట్వీట్‌ చేశారు. మరోవైపు మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ అమ్మకాలను సరళీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. అవసరానికి తగ్గట్టు వ్యాక్సిన్లు కొనుక్కోవడం రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు, కంపెనీల బాధ్యత అని పరోక్షంగా చెప్పింది. ఇది కేంద్రం చేతులు దులిపేసుకోవడమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.


కొంపముంచిన కుంభమేళా, ర్యాలీలు

కేసుల పెరుగుదల విషయంలోనూ నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కుంభమేళాను నిర్వహించడం, దానికి హాజరైనవారిని గుంపులుగా రైళ్లలో సొంత ప్రదేశాలకు చేర్చడం, ఎన్నికల ర్యాలీలకు అనుమతించడంలాంటి నిర్ణయాల వల్ల ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. స్వయంగా ప్రధానే పశ్చిమ బెంగాల్లో భారీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం, భారీగా గుమికూడిన జనసందోహాన్ని అభినందించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ఇకనుంది 500 మందికంటే ఎక్కువమందిని సభలు, సమావేశాలను అనుమతించకూడదంటూ ఈవారమే నిర్ణయం తీసుకొంది.

జాతీయంమరిన్ని...

Advertisement