Abn logo
Apr 10 2020 @ 05:16AM

రాజకీయ రచ్చ...

నర్సీపట్నం డాక్టర్‌పై సస్పెన్షన్‌పై ఆరోపణలు, ప్రత్యారోపణలు

అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం

అయ్యన్న, గణేశ్‌...సవాళ్లు ప్రతిసవాళ్లు

ప్రభుత్వ చర్యపై సర్వత్రా విమర్శలు

ప్రభుత్వ తీరును ఖండించిన ఏపీ పౌరహక్కుల సంఘం, మాజీ మంత్రి శ్రావణ్‌

సుధాకర్‌ చెప్పిన అంశాలపై నిష్పక్షపాతంగా

విచారణ జరపాలని ప్రజల డిమాండ్‌


నర్సీపట్నం, ఏప్రిల్‌ 9: ‘కరోనా వైరస్‌ బారినపడిన వారికి, అనుమానిత లక్షణాలు వున్న వారికి రేయింబవళ్లు సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బంది ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్‌-95 మాస్కులు అడుగుతుంటే ఇవ్వడం లేదు. మా ప్రాణాలకు విలువ లేదా?’’ అని ప్రశ్నించిన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ఎనస్థీషియన్‌ డాక్టర్‌ కె.సుధాకర్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం రాజకీయ వివాదంగా మారింది. 


సర్వీసు రూల్స్‌ ప్రకారం బహిరంగంగా ఆరోపణలు చేసిన డాక్టర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు వున్న వారికి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.  ఆయన చేసిన వ్యాఖ్యల్లో రాజకీయపరమైన అంశాలు కూడా వుండడం ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి కారణమని తెలిసింది. డాక్టర్‌ సుధాకర్‌ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ కావడంతో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. అన్ని ఆస్పత్రులకు తగిన రక్షణ సామగ్రిని సరఫరా చేయాలని ఆదేశించింది. అయితే ప్రస్తుత విపత్తు సమయంలో వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వుండాలన్న ఉద్దేశంతోనే డాక్టర్‌ సుధాకర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు.


విచారణ జరిపిస్తే వాస్తవాలు తెలుస్తాయి

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వైద్యుడు సుధాకర్‌ వ్యాఖ్యలు, ఆయనను ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం నర్సీపట్నం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రస్థాయిలో కూడా అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శలకు దారితీసింది. సస్పెన్షన్‌కు గురైన తరువాత కొన్ని వార్తా ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా డాక్టర్‌ సుధాకర్‌ వెల్లడించిన అంశాలు ప్రజల్లో చర్చనీయంశంగా మారాయి. వైద్య ఆరోగ్య శాఖలో లోపభూయిష్ట విధానాలు, అవకతవకల గురించి ఆయన మాట్లాడినందునకు సస్పెండ్‌ చేయడమే కాకుండా పలు సెక్షన్ల కింద పోలీసు కేసులు నమోదుచేయడం గమనార్హం. అయితే డాక్టర్‌ సుధాకర్‌ వెల్లడించిన అంశాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, వాస్తవాలను వెల్లడించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


రాజకీయ చిచ్చు

డాక్టర్‌ సుధాకర్‌ చేసిన వ్యాఖ్యలు, అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యలు వైసీపీ, టీడీపీ మధ్య చిచ్చురేపాయి. నర్సీపట్నం నియోజకవర్గంలో ఇరు పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.ఇదే సమయంలో మాజీ మంత్రి అయ్యన్న, అతని సోదరుడు సన్యాసిపాత్రుడు కుటుంబాల మధ్య కొనసాగుతున్న వివాదం....మత్తు డాక్టర్‌ వ్యవహారంతో మరింత ముదిరింది. 


డాక్టర్‌ను సస్పెండ్‌ చేయడం సరికాదు

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి అనస్థీషియన్‌ సుధాకర్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం సరికాదని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు, ఆధునిక పరికరాలు లేకపోయినా వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగాపెట్టి సేవలు అందిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో వాస్తవ పరిస్థితులను వెల్లడించిన వైద్యుడిని సస్పెండ్‌ చేయడం కక్షపూరిత చర్యగా పేర్కొన్నారు. సస్పెన్షన్‌ను ఎత్తివేసి, వైద్య సిబ్బందికి తగు రక్షణ కల్పించడంపై దృష్టి సారించాలని కోరారు.


చాలా అన్యాయం: శ్రావణ్‌

కరోనా వైరస్‌ నేపథ్యంలో వైద్యులకు, సిబ్బందికి ఎన్‌-95 మాస్కులు ఇవ్వడంలేదన్న నర్సీపట్నం ఆస్పత్రి ఎనస్థీషియన్‌ డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేయడం అన్యాయమని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు రేయింబవళ్లు సేవలు అందిస్తున్నారని, ఇటువంటి తరుణంలో డాక్టర్‌పై చర్యలు చేపట్టడం దారుణమన్నారు. 


Advertisement
Advertisement
Advertisement