Abn logo
Sep 4 2020 @ 23:18PM

పబ్‌జి బ్యాన్‌... పరేషాన్‌!

‘‘స్నైపర్‌ గన్‌, ఎక్స్‌ స్కోప్‌ దొరికితే చాలు! ఒకే ఒక హెడ్‌ షాట్‌తో శత్రువు ప్రాణాలు తీయవచ్చు! సోలో కన్నా స్క్వాడ్‌గా ఆడితే శత్రువుల్ని పిట్టల్లా కాల్చేసి... ఎక్కువ కిల్స్‌ కొట్టేయవచ్చు, అంతిమంగా విన్నర్‌ విన్నర్‌... చికెన్‌ డిన్నర్లు తినేయవచ్చు!’’ పబ్‌జి లవర్స్‌ మాట్లాడుకునే ప్రియమైన భాష ఇది! ఇంతలా ఈ ఆటకు దాసోహమైన పిల్లలకు ప్రభుత్వం విధించిన తాజా నిషేధం ఆశనిపాతమే! ఈ అడిక్షన్‌ తాలూకు విత్‌డ్రాయల్‌ దశ నుంచి పిల్లలను బయటకు తీసుకువచ్చి... ప్రత్యామ్నాయ మార్గాలు చూపించే బాధ్యత ఇక పెద్దలదే! అని అంటున్నారు సైకాలజిస్ట్‌ డాక్టర్‌ గీతా చల్లా!


ఆన్‌లైన్‌ ఆటలు బోలెడున్నా పబ్‌జి ఆటకు దాసోహం కావడానికి కారణం ఈ ఆటతో పొందే అంతులేని ఎక్సయిట్‌మెంట్‌. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల మంది ఈ ఆట ఆడుతున్నారు. ఒక్క మన దేశంలోనే ఈ ఆట డౌన్‌లోడ్లు 175 మిలియన్లకు చేరుకున్నాయి. ఇది ప్రపంచవ్యాప్త యాప్‌ డౌన్‌లోడ్స్‌ మొత్తంలో 24 శాతం. దీన్ని బట్టి పబ్‌జి (ప్లేయర్‌ ఆన్‌ అన్‌నోన్స్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌)కు మన దేశంలో ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.


ఇంతలా గేమర్ల మనసు దోచిన ఈ ఆటపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. సెల్‌ఫోన్లలో గంటల తరబడి ఈ ఆటను ఆడే పిల్లల మీద నిషేధం ప్రభావం కచ్చితంగా పడుతుంది. ఈ పరిస్థితినీ, పర్యవసానాలనూ ఎదుర్కోవడానికి పిల్లలూ, అంతకన్నా ముఖ్యంగా పెద్దలూ సిద్ధపడాలి. వ్యసనం ఎందుకంటే?

క్యాండీక్రష్‌, లూడో... ఇలా ఆన్‌లైన్‌లో బోలెడన్ని ఆటలున్నా, పబ్‌జికే పిల్లలు ఎక్కువ ఆకర్షితులవు తున్నారనేది నిజం. ఈ ఆటలో భాగంగా సంభాషించుకునే వీలు ఉండడం, స్టేజ్‌లు దాటుకుంటూ, ర్యాంకులు పెంచుకునే వెసులుబాటు ఉండడం, అంతిమంగా విజయం సాధిస్తే... మిగతా ప్లేయర్ల కన్నా తామే అధికులమనే ఆనందం సొంతం కావడం... ఈ ఆటకు పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవడానికి ప్రధాన కారణాలు.


అన్నిటికన్నా ముఖ్యంగా గన్స్‌తో తోటి ప్లేయర్లను చంపే వీలు ఉండడంతో... ఏదైనా సాధించినప్పుడు మెదడులో న్యూరోట్రాన్స్‌మీటర్లు ప్రేరేపితమై డొపమైన్‌ హార్మోన్‌ విడుదల అయినట్టే పబ్‌ జిలోనూ జరుగుతుంది. ఇలా ఆట ఆడే సమయంలో హ్యాపీ హార్మోన్‌ విడుదల అవుతూ ఉంటుంది కాబట్టి ఈ ఆట ఆడే అలవాటు కాస్తా, క్రమేపీ వ్యసనంగా మారుతుంది. 


ఎగిరి గంతేయడం సరికాదు!

పబ్‌ జిని ప్రభుత్వం నిషేధించిందని తెలియగానే ఆనందంతో ఎగిరి గంతేసే పెద్దలే ఎక్కువ. తమకు ప్రాణప్రదమైన ఆటను ఇకముందు ఆడే వీలు లేదనే బాధలో పిల్లలు కుంగిపోయినప్పుడు, పెద్దలు ఇలా సంతోషాన్ని వ్యక్తం చేయడం సరి కాదు. ‘పబ్‌జి ఆడకుండా బతికేదెలా?’ అనేంతగా మానసికంగా కుంగిపోయిన పిల్లల్లో విత్‌డ్రాయల్‌ లక్షణాలు తలెత్తకుండా ఉండాలంటే వారికి అనుగుణంగా మాట్లాడాలి.


వారి బాధ చూసి ఎద్దేవా చేయకుండా,  వ్యంగ్యంగా మాట్లాడకుండా, వారు అనుభవిస్తున్న బాధకు సానుకూలంగా స్పందించాలి. మాటల్లో బాధను వెళ్లగక్కే వీలు కల్పించాలి. వారి భావనతో ఏకీభవించాలి. ‘నిజమే! నిషేధించకుండా ఉండవలసింది. కానీ ఏం చేస్తాం! సర్దుకుపోక తప్పదు కదా? ఇతరత్రా కాలక్షేపాలు వెతుకుదాం!’ అంటూ అనునయించాలి. 


స్పష్టమైన లక్షణాలు!

ఈ ఆట వ్యసనంగా మారిన పిల్లల్లో విత్‌డ్రాయల్‌ సింప్టమ్స్‌ తలెత్తుతాయి. మానసిక కుంగుబాటు లేదా ఉన్మాదం.... ఇలా రెండు భిన్నమైన లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి.

కొందరు జీవితంలో అన్నీ కోల్పోయినట్టు దిగాలుగా ఉండడం, ఏ పని పట్లా ఆసక్తి లేకపోవడం, ఆహారం తీసుకోకపోవడం లాంటి  లక్షణాలను కనబరిస్తే, మరికొందరు పెద్దలపై భౌతిక దాడులకు దిగడం, వస్తువులు పగలగొట్టడం, తల గోడకు బాదుకోవడం, చేతులు కోసుకోవడం లాంటి పనులతో ఉన్మాదులుగా ప్రవర్తిస్తారు. పిల్లల్లో ఇలాంటి ఏ లక్షణం కనిపించినా పెద్దలు మానసిక నిపుణుల దగ్గరకు తీసుకువెళ్లాలి. 


ప్రత్యామ్నాయాలు వెతకాలి!

ఒక వ్యసనాన్ని మాన్పించాలంటే అంతే ఆనందాన్ని అందించే మరో ప్రత్యామ్నాయాన్ని సూచించాలి. పిల్లల విషయంలో పెద్దలు ఈ విధానాన్నే ఎంచుకోవాలి. పిల్లలకు సాధ్యమైనంత తొందరగా పజిల్స్‌, ఇండోర్‌ గేమ్స్‌ ఇలా ఏదో ఒక కాలక్షేపాన్ని అలవాటు చేయాలి.


తోటి పిల్లలతో ఆటల్లో పాల్గొనేలా చేయాలి. సంగీతం, డ్రాయింగ్‌ లాంటివి నేర్చుకునేలా ప్రోత్సహించాలి. టీవీలో సినిమాలు, యూట్యూబ్‌లో ఇష్టమైన కార్యక్రమాలు చూసేలా చేయాలి. కుటుంబసభ్యులందరూ కలిసి ఆడే ఆటల్లో వారిని భాగస్వాములను చేయాలి.


ఒక వ్యసనాన్ని మాన్పించాలంటే అంతే ఆనందాన్ని అందించే మరో ప్రత్యామ్నాయాన్ని సూచించాలి. 

పిల్లల విషయంలో పెద్దలు ఈ విధానాన్నే ఎంచుకోవాలి. అతి అనర్థమే!

‘‘ఆటలు పరిమిత సమయం పాటు ఆడితే ప్రయోజనాలు, అతిగా ఆడితే అనర్థాలూ తప్పవు. మరీ ముఖ్యంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడే సమయంలో కళ్లు, చేతులు, చెవులు... ఇలా ఒకటి కన్నా ఎక్కువ అవయవాలు ఇన్వాల్వ్‌ అవుతాయి. కాబట్టి మల్టీ సెన్సరీ స్టిమ్యులేషన్‌ జరుగుతుంది. ఏకాగ్రత, అప్రమత్తత, మెదడు చురుకుదనం పెరుగుతాయి. అలాగే జ్ఞాపకశక్తి, సృజనాత్మకతలు కూడా పెరుగుతాయి.


అయితే వీటికీ పరిమితి ఉంది. ఈ ప్రయోజనాలను ఆశించి ఆన్‌లైన్‌ ఆటలను పదే పదే ఆడితే వాటికి వ్యసనపరులుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఏ ఆటకైనా కాలపరిమితి విధించుకోవాలి. ఎలాంటి ఆన్‌లైన్‌ గేమ్‌ అయినా రోజులో గంటకు మించి ఆడకూడదు’’.

- డాక్టర్‌ గీతా చల్లా