జనం లేని బోనం

ABN , First Publish Date - 2020-07-13T09:23:25+05:30 IST

వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా చూడుతల్లీ అని వేడుకుంటూ అమ్మవారికి సమర్పించే లష్కర్‌ బోనాల పండుగ ఆదివారం కరోనా వైరస్‌ కారణంగా నిరాడంబరంగా జరిగింది.

జనం లేని బోనం

  • సంప్రదాయబద్ధంగా లష్కర్‌ బోనాల పండుగ
  • అంటువ్యాధులు ప్రబలొద్దనే జాతర
  • ప్లేగు వ్యాధి అంతంతో పండుగ మొదలు
  • కరోనాతో భక్తులకు అనుమతి నిరాకరణ
  • నిరాడంబరంగా వేడుక.. నేడు రంగం
  • జగన్మాత కరుణ అందరిపైనా ఉండాలి: మాజీ ఎంపీ కవిత


రాంగోపాల్‌పేట్‌, హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా చూడుతల్లీ అని వేడుకుంటూ అమ్మవారికి సమర్పించే లష్కర్‌ బోనాల పండుగ ఆదివారం కరోనా వైరస్‌ కారణంగా నిరాడంబరంగా జరిగింది. 19వ శతాబ్దం ప్రారంభంలో ప్లేగువ్యాధి అంతరించడంతో ప్రారంభమైన సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరకు మామూలుగానైతే వేలల్లో జనం హాజరై బోనాలు సమర్పిస్తారు. శివసత్తుల శిగాలతో, పోతరాజుల విన్యాసాలతో, ఫలహారపు బండ్ల ఊరేగింపులతో జాతర ఉధృతంగా సాగుతుంది. ప్రస్తుతం వైరస్‌ ప్రభావంతో ఆంక్షలు విధించడంతో ఈసారి ఇవేవీ లేవు. ఆషాఢ బోనాల జాతర మహోత్సవం సందర్భంగా సింహవాహినిగా మహంకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయం 3:40 నిమిషాలకు వేద మంత్రాలతో ఆలయ ద్వారం తెరచి అమ్మవారికి మంగళ హారతులతో అలయ ప్రధానార్చకులు తొలి పూజలు నిర్వహించారు. 3:50 నిమిషాలకు ఆలయ అనువంశిక కుటుంబ సభ్యుల అధ్వర్యంలో బోనాన్ని మహాకాళి అమ్మవారికి సమర్పించారు. 4 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబసభ్యులు దేవాలయం ముందు బోనాన్ని దేవాలయ పురోహితులకు అందించగా మాతాంగేశ్వరీ ఆలయం వద్ద సమర్పించారు. అనంతరం బంగారుబోనాన్ని ఆలయ ఈవో గుత్త మనోహర్‌ రెడ్డి సమర్పిచారు. 8:15 నిమిషాలకు అమ్మవారి ఘటం అలంకారం పూర్తి చేసుకుని గర్భగుడి చుట్టూ తింపి గర్భగుడి ముందు ఉంచారు. 11:45 నిమిషాలకు ఆలయ ప్రాంగణంలోని వీరభద్ర స్వామి దేవాలయం నుంచి మేళతాళాల నడుమ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను ఆలయ ఈవో సమర్పించారు. రాత్రి 11 గంటలకు గుమ్మడి కాయలను శివాలయం నుంచి బాజా భజంత్రీలతో తెచ్చి ఆలయంలో బలిహరణ చేశారు.


..ఎంతో బాధగా ఉంది: తలసాని

కరోనా వైరస్‌మహమ్మారి కారణంగా మహంకాళి జాతరను నిర్వహించలేకపోతున్నామని, ఇందుకు ఎంతో బాధగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ అన్నారు. భక్తులనెవరినీ దర్శనాలకు అనుమతించలేదని, సహకరించిన ప్రజలందరికీ ధన్యవవాదాలు తెలుపుకొంటున్నానని చెప్పారు. కాగా బోనాల సందర్భంగా ప్రజలకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత  శుభాకాంక్షలు తెలిపారు. ఆ జగన్మాత కరుణ అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-07-13T09:23:25+05:30 IST