అప్పనంగా రాసిచ్చారు..?

ABN , First Publish Date - 2022-06-06T05:19:04+05:30 IST

కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములన్నీ రైతుల ముసుగులో రియల్‌ దళారుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో కొత్తగా శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా అవతరించాక పుట్టపర్తి చూట్టు సెంటు ప్రభుత్వ భూమి కావాలన్నా వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అప్పనంగా రాసిచ్చారు..?

అడ్డగోలుగా అసైన్డ భూముల రిజిసే్ట్రషన

ఇప్పటికే 164 మంది నోటీసులు

జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ‘భూ’మాయ

పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి


ఎవరి భూమి ఎవరికిచ్చారు... సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ, గుట్టలను అప్పనంగా రాసిచ్చేశారు. అసైన్డ భూముల రిజిస్ట్రేషన విషయంలో అధికారులు పెద్ద తప్పిదమే చేశారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూములపై ‘బడా’ నేతల కన్ను పడగానే అప్పట్లో అధికారులు హ్యాపీగా కేటాయించేశారు. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న ఆ ‘భూమాయ’ నేడు పుట్టపర్తి జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 

కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములన్నీ రైతుల ముసుగులో రియల్‌ దళారుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో కొత్తగా శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా అవతరించాక పుట్టపర్తి చూట్టు సెంటు ప్రభుత్వ భూమి కావాలన్నా వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పుట్టపర్తి చుట్టూ సాగు భూముల కంటే కొండగుట్టలే అధికంగా ఉన్నాయి. దీంతో కొన్నేళ్లుగా రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములతో పాటు కొండలు, గుట్టలు ఇలా ఏవీ వదలకుండా అధికారులు డీపట్టా పేరుతో కేటాయించేశారు. తాజాగా పుట్టపర్తి జిల్లా కేంద్రంగా ఏర్పాటులో అసైన్డ భూములకు సైతం అమాంతంగా కోట్లలోకి విలువలు పెరిగిపోయాయి. దీంతో ఇటీవల అసైన్డ భూముల క్రయవిక్రయాలు అధికమై అనధికారికంగా లేఔట్లు వేసి విక్రయిస్తున్నారు. ఏదో ఒక రూపంలో ఎనఓసీలు తెచ్చుకోవడం, లొసుగులను తెలుసుకుని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని అసైన్డ భూములకు ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. భవిష్యతలో జిల్లా కేంద్రంలో భూముల విలువ మరింత పెరుగుతాయని భావించిన ప్రజలు అసైన్డ భూమి అయినా సరే కొనేస్తున్నారు.  దీంతో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం భూముల సేకరణ రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. 


కొండల్ని కేటాయించారు!

పుట్టపర్తి చుట్టూ అధికంగా ఉన్న కొండ గుట్టలు సాగుకు ఏమాత్రం అనుకూలంగా ఉండవు. అయినా కూడా గతంలో రెవెన్యూ అధికారులు దశలవారీగా డీపట్టాల రూపంలో కేటాయించేశారు. ఇప్పుడు అవే భూములు కోట్లు పలుకుతున్నాయి. పుట్టపర్తి రెవెన్యూ పొలంలో రాయలవారిపల్లి సర్వేనెంబర్‌ 8లో 789 ఎకరాలు, కర్ణాటక నాగేపల్లి వద్ద 796లో 17.99 ఎకరాలు, 703లో 16.11 ఎకరాలు, 512లో 48 ఎకరాలు, 171లో 36.57, 374లో 72 ఎకరాలతోపాటు పలు ప్రాంతాల్లో డీపట్టాలుగా ఇచ్చేశారు. ఈ వ్యవహారమంతా 2010లోపు జరిగిపోయినా తరువాత కూడా పరంపర కొనసాగించారు. గతంలో పుట్టపర్తిలో పనిచేసిన రిటైర్డ్‌ రెవెన్యూ అధికారులు పాత తేదీలతో కూడా డీపట్టాలు ఇచ్చారు. ఇలా అప్పటి పట్టాలతో పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తులు రావడంతో అధికారులు అవాక్కవుతున్నారు. సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, మామిళ్లకుంటతో పాటు చుట్టూ మిగిలిన కొండలను సైతం ఇంటి పట్టాలుగా మార్చి రాసిచ్చారు. కొందరైతే అసైన్డ భూముల్లో ప్లాట్లు వేసి విక్రయాలు చేస్తున్నారు. అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లతో కొన్ని భూముల వైపు వెళ్లాలంటే అధికారులు కూడా వెనుకంజ వేస్తున్నారు.


‘కప్పలబండ’లో 549.95 ఎకరాలు

పుట్టపర్తి జిల్లా కేంద్రంలో భవిష్యత అవసరాలు, భవనాల నిర్మాణానికి అనువైన స్థలాల కోసం రెవెన్యూ అధికారులు గాలిస్తున్నారు. ప్రధానంగా అసైన్డ భూములు అధికంగా ఉన్న కప్పలబండ పొలంలోపై అధికారులు దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో ఇటీవల రైతుల నుంచి వందలాది ఎకరాల అసైన్డ భూముల క్రయవిక్రయాలు జరిగాయి. మామిళ్లకుంటక్రాస్‌, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో 50 ఎకరాలకుపైగా లేఔట్లు వేసి క్రయవిక్రయాలు జరిపారు. కప్పలబండ పొలంలో 549.95 ఎకరాల అసైన్డ భూమిలో ఎలాంటి సాగు లేకపోవడంతో రెవెన్యూ అధికారులు గుర్తించారు. డీపట్టా పొందిన 164 మందికి గత నెల మే 30న నోటీసులు జారీ చేయగా 134 మంది సంజాయిషీ ఇచ్చారు. ప్రభుత్వం భూములను లాగేసుకుంటుందన్న భయంతో డీపట్టా పొందిన వారు సాగులో ఉన్నట్లు పొలాలను దుక్కులు చేయడం మొదలుపెట్టారు. ఈ భూముల్లో వంద ఎకరాలకుపైగా చేతులు మారడంతో కొనుగోళ్లు చేసిన వారిలో భయందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ అధికారులు మాత్రం భూములను స్వాధీనం చేసుకునేందుకే సిద్ధమైనట్లు సమాచారం.


ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం

కొత్త జిల్లా కేంద్రంగా పుట్టపర్తి ఏర్పాటుతో జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా అవసరాల దృష్ట్యా అసైన్డ భూములను స్వాధీనం చేసుకుంటాం. ఇప్పటికే కప్పలబండ పొలంతో పాటు పలు ప్రాంతాల్లో అవసరమైన అసైన్డ భూముల గుర్తింపు కొనసాగుతోంది. భూ పంపిణీలో భాగంగా 2010లోపే పుట్టపర్తి చుట్టూ ఉన్న కొండగుట్టకు డీపట్టాలు పొందారు. ఇటీవల డీపట్టా షరతులను తుంగలో తొక్కి క్రయవిక్రయాలు చేసిన 39.01 ఎకరాల భూములను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చాం. ఆ భూములను కచ్చితంగా స్వాఽధీనం చేసుకుంటాం. 

భాస్కరనారాయణ, తహసీల్దార్‌, పుట్టపర్తి


Updated Date - 2022-06-06T05:19:04+05:30 IST