సికింద్రాబాద్‌లో సైకో హల్‌చల్‌..

ABN , First Publish Date - 2020-03-09T10:13:26+05:30 IST

ఆ ఇద్దరికీ ఏ సంబంధం లేదు.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై ఓ సైకో దాడి చేశాడు. చితకబాదడంతో అతను రక్తపు మడుగులో పడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వచ్చిన వ్యక్తిపై సైతం దాడి చేసేందుకు సైకో ప్రయత్నించాడు..

సికింద్రాబాద్‌లో సైకో హల్‌చల్‌..

పట్టపగలు వ్యక్తిపై దాడి 

చికిత్స నిమిత్తం గాంధీకి తరలింపు 

పరికరాల్లేవని అక్కడినుంచి ఉస్మానియా.. 

పోలీసుల అదుపులో సైకో


అడ్డగుట్ట, మార్చి8(ఆంధ్రజ్యోతి): ఆ ఇద్దరికీ ఏ సంబంధం లేదు.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై ఓ సైకో దాడి చేశాడు. చితకబాదడంతో అతను రక్తపు మడుగులో పడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వచ్చిన వ్యక్తిపై సైతం దాడి చేసేందుకు సైకో ప్రయత్నించాడు.. ఈ సంఘటన సికింద్రాబాద్‌ గోపాలపురం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ఎదురుగా జరిగింది. గోపాలపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం, శ్రీహరిపురం, గుల్లపాలెం కాలనీకి చెందిన రవీందర్‌రెడ్డి (45) మద్యానికి బానిస కావడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. దీంతో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో జల్సాలకోసం, కాలక్షేపం కోసం నెలకు రెండు, మూడు రోజులు సికింద్రాబాద్‌కు వచ్చేవాడు. ఆదివారం ఉదయం 11గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి నడుచుకుంటూ సంగీత్‌వైపు వెళ్తున్నాడు. ఇదిలాఉండగా   తమిళనాడు నమకల్‌ రాజీపురం గ్రామానికి చెందిన రాజేందర్‌ (44) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ అక్కడినుంచి సరుకును అన్‌లోడ్‌ చేసేందుకు మేడ్చల్‌కు వచ్చాడు.


కాగా ఆదివారం సికింద్రాబాద్‌కు వచ్చిన అతను గోపాలపురం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వైపునుంచి దొడ్డు కర్రతో వచ్చి ఎదురుగా వస్తున్న రవీందర్‌ రెడ్డిని అకారణంగా తలపై కొట్టడంతో అతను క్షణాల్లో స్పృహ కోల్పోయాడు. నేలపై పడిపోయిన అతనిని మరో రెండుసార్లు కర్రతో చితకబాదాడు. ఆ సమయంలో రవీందర్‌ను రక్షించేందుకు ఓ పాదచారి రావడంతో అతనిని కూడా కొడతానని బెదిరించడంతో అతను ఆగిపోయాడు. కొద్ది సేపటి తర్వాత సైకో రాజేందర్‌ అక్కడినుంచి కనిపించకుండాపోయాడు. సమాచారం అందుకున్న గోపాలపురం పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా సైకో రాజేందర్‌ను ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 


గాంధీకి తీసుకెళ్తే సిటీ స్కాన్‌లేదన్నారు .. ఉస్మానియాకు తరలింపు 

సైకో చేతిలో గాయపడ్డ రవీందర్‌ను స్థానికులు హుటాహుటీన 108 అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిటీస్కాన్‌ లేకపోవడంతో తిరిగి అదే అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సిటీ స్కాన్‌, వైద్య పరీక్షలు పూర్తికాగా ఆరోగ్యం బాగానే ఉందని సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్‌ చెప్పారు. దాడి ఎందుకు చేశాడనే అంశంపై విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. 


స్థానికుడే రక్షించాడు - లేదంటే చనిపోయేవాడు 

దొడ్డు కర్రతో రవీందర్‌రెడ్డిని కొట్టడంతో అటుగా వెళుతున్న ఓ పాదచారి చూసి చలించిపోయాడు. సైకో నుంచి అతన్ని రక్షించేందుకు చాలా ప్రయత్నించాడు. చివరికి అతన్ని ఆస్పత్రిలో చేర్పించే బాధ్యతను తీసుకున్నాడు. లేదంటే రవీందర్‌రెడ్డిని అక్కడికక్కడే చంపేసేవాడేమోనని పలువురు అభిప్రాయపడ్డారు.   


పగవాడు అనుకున్నా .. 

తమిళనాడులో తనకు ఓ వ్యక్తితో పగ ఉందని, అతనిలాగే రవీందర్‌రెడ్డి మొహం కనిపించడంతో కర్రతో కొట్టానని ఒకసారి, తాను సికింద్రాబాద్‌లో ఉన్నానని మరోసారి పోలీసులకు పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. వివరాలు సేకరించిన ఎస్‌ఐ సైదు లు సైకో కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తే అతని గురించి ఎవరూ కూడా స్పందించలేదన్నారు. కొడుకుకు ఫోన్‌ చేస్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయని, అనేకసార్లు వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయిందని చెప్పినట్లు ఎస్‌ఐ తెలిపారు.


సికింద్రాబాద్‌లో భయం భయం :

పట్టపగలు సికింద్రాబాద్‌రోడ్డుపై ఓ సైకో హల్‌చల్‌ చేస్తూ వ్యక్తిపై దాడిచేసిన విధానాన్ని చూసిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రవీందర్‌ను రక్షించేందుకు స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. స్థానికంగా ఉండే వ్యాపారస్థులు సైతం భయానికి గురై సైకోను నిలువరించలేకపోయారు.  


రాజేందర్‌కు మతిస్థిమితం లేదు ... ఏసీపీ వెంకటరమణ 

రవీందర్‌ రెడ్డి భార్య పుట్టింటికి వెళ్లడంతో అప్పుడప్పుడు సికింద్రాబాద్‌కు వచ్చి వెళుతుండేవాడు. ఆదివారం గోపాలపురం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌నుంచి వెళ్తుండగా ఎదురుగా ఉన్న వ్యక్తి(రాజేందర్‌)కి మతిస్థిమితం లేకపోవడం కారణంగానే దాడి చేశాడు. ప్రస్తుతం బాధితుడు రవీందర్‌రెడ్డి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణం నష్టం లేదని వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేశాం. ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తాం.  

Updated Date - 2020-03-09T10:13:26+05:30 IST