ఉప సమరానికి సై

ABN , First Publish Date - 2021-09-29T05:44:09+05:30 IST

బద్వేలు ఉప ఎన్నిక నగారా మోగింది. అక్టోబరు ఒకటిన నోటిఫికేషన్‌ జారీ.. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

ఉప సమరానికి సై
బద్వేలు పట్టణ ఏరియల్‌ వ్యూ

మోగిన బద్వేలు ఉన్న ఎన్నిక నగారా 

అక్టోబరు 1న నోటిఫికేషన్‌.. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ

30న పోలింగ్‌.. నవంబరు 2న ఓట్ల లెక్కింపు

షెడ్యూల్‌ జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

జిల్లాలో నవంబరు 5 వరకు ఎన్నికల కోడ్‌ అమలు

సీఎం జగన్‌ సొంత జిల్లా కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి

టీడీపీ అభ్యర్థిగా రాజశేఖర్‌ ఖరారు

వైసీపీ అభ్యర్థిగా డాక్టరు సుఽధ


(కడప-ఆంధ్రజ్యోతి): బద్వేలు ఉప ఎన్నిక నగారా మోగింది. అక్టోబరు ఒకటిన నోటిఫికేషన్‌ జారీ.. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 30న ఓటర్ల తీర్పు.. నవంబరు 2న ఓట్ల లెక్కింపు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ కూడా అమల్లోకి వచ్చింది. జగన్‌ సొంత జిల్లా కావడంతో ఈ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పక్షాలు, విశ్లేషకులు అందరు ఇటువైపు దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం గెలుపు గుర్రాలను ఎంపిక చేశారు. అస్త్రశస్త్రాలు సన్నద్ధం చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీ శిబిరాల్లో వేడి రాజుకుంది. ఇక రాజకీయ కీలక నాయకులు, మంత్రులు, మాజీ మంత్రుల ప్రచారాలతో బద్వేలు నియోజకవర్గంలోని పల్లె, పట్టణం మోత మెగనున్నాయి. 

2019లో జరిగిన ఎన్నికల్లో డాక్టరు గుంతోటి వెంకటసుబ్బయ్య ప్రధాన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి రాజశేఖర్‌పై 44,734 ఓట్ల ఆఽధిక్యతతో విజయం సాధించారు. టీడీపీకి 50,748 ఓట్లు వచ్చాయి. వెంకటసుబ్బయ్య కడప నగరంలో ఓ నర్సింగ్‌హోం నిర్వహిస్తున్నారు. ఆయన ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏడు నెలలు తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు జారీ చేసి నగారా మోగించడంతో బద్వేలులో రాజకీయ సందడికి తెర లేచింది. అటు ఎన్నికలు.. ఇటు భద్రత యంత్రాంగం కూడా అప్రమత్తం అయింది. 


రెండో ఉప ఎన్నిక ఇది

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం పరిధిలో బద్వేలు, గోపవరం, అట్లూరు, కలసపాడు, బి.కోడూరు, శ్రీఆవధూత కాశినాయన, పోరుమామిళ్ల మండలాలు వస్తాయి. 1955లో జరిగిన తొలి ఎన్నికల్లో శెట్టిబందరు రత్నసభాపతి, పుట్టంరెడ్డి రమణారెడ్డి పోటీ చేశారు. 11,523 ఓట్ల అధిక్యతతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టిన బద్వేలు తొలి ఎమ్మెల్యేగా రత్నసభాపతి రికార్డు సొంతం చేసుకున్నారు. ఉప ఎన్నికతో కలిపి 2019 వరకు 15 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1983లో టీడీపీ ఆవిర్భావంతో బద్వేలు ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి ఆరు పర్యాయాలు మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన నాలుగు పర్యాయాలు టీడీపీ అభ్యర్థిగానే గెలిచారు. 1999లో ఆరవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వీరారెడ్డి రెండేళ్లు గడవకనే అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2001లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమార్తె కొనిరెడ్డి విజయమ్మ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి వీరారెడ్డి వారసురాలిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2004లో ఆమె ఓటమి చవిచూశారు. 2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బద్వేలును ఎస్సీ నియోజకవర్గంగా రిజర్వుడ్‌ చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టరు జి.వెంకటసుబ్బయ్య రెండేళ్లు కూడా గడవకనే అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బద్వేలు నుంచి ఇది రెండవ ఉప ఎన్నిక అవుతుంది.


ఇరు పార్టీల అభ్యర్థులు డాక్టర్లే!

గత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన జి.వెంకటసుబ్బయ్య, ఓబులాపురం రాజశేఖర్‌ ఇద్దరూ వైద్యులే. తాజాగా జరగనున్న ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా డాక్టరు రాజశేఖర్‌ను ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్యయ్య సతీమణి డాక్టరు సుధా అభ్యర్థిత్వం ఖరారు అయింది. దీంతో మళ్లీ ఇద్దరూ డాక్టర్లే బరిలో ఉంటారు. రాజశేఖర్‌ బద్వేలులో ఉంటూ వైద్యసేవలు అందిస్తే, డాక్టరు సుధా కడప నగరంలో వైద్య సేవలు అందిస్తున్నారు.


అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌

ఉప ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో జిల్లా అంతటా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. మంగళవారం నుంచి నవంబరు 5వ తేది వరకు అంటే 39 రోజులు కోడ్‌ అమల్లో ఉంటుంది. ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం నిర్వహించరాదు. అలాగే.. దివంగత రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాల్సి ఉంటుంది. కోడ్‌ ఉల్లంఘిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తప్పవు.


ప్రచారానికి కొవిడ్‌-19 ఆంక్షలు

ఉప ఎన్నికల ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం కొవిడ్‌-19 ఆంక్షలు విధించింది. ఇంటింటి ప్రచారం చేసే అభ్యర్థులు ప్రతినిధులతో సహా ఐదుగురికి మించరాదు. స్టార్‌ క్యాంపెయినర్‌లు వస్తే అభ్యర్థుల ప్రచారానికి 20 వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. ప్రతి వాహనంలో 50 శాతం మందే ఉండాలి. ఇండోర్‌ ప్రచార సభలే నిర్వహించాలి. సమావేశ భవనం కెపాసిటీలో 50 శాతం లేదా 1,000 మందికి ఏది తక్కువ అయితే అదే అనుమతి ఇస్తారు. స్థానిక నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తే 30 శాతం మందికే అనుమతి ఇస్తారు. సభా ప్రాంగణం పోలీసుల రక్షణలో ఉంటుంది. ప్రతి ఒక్కరిని లెక్కించి అనుమతి ఇస్తారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్‌ క్యాంపెయినర్లుగా గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలకు 20 మంది, గుర్తింపు లేని పార్టీలకు 10 మందికి మాత్రమే అనుమతి ఇస్తారు. కొవిడ్‌-19 నిబంధనలతో ప్రచారకర్తల రోడ్‌ షోకు అనుమతి ఇచ్చినా.. మోటర్‌ బైక్‌, సైకిల్‌ ర్యాలీలకు అనుమతి ఉండదు. కొవిడ్‌-19 ఆంక్షల వల్ల ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులకు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


పకడ్బందీ తనిఖీలు

- కేకేఎన్‌ అన్బురాజన్‌, ఎస్పీ, కడప

బద్వేలు ఉప ఎన్నికలో భాగంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. జిల్లాలో 22 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాం. సరిహద్దుల్లో పక్కా నిఘా పెట్టాం. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తాం. రికార్డులు లేకుండా నగదు, ఇతర విలువైన వస్తువులు రవాణా చేస్తే సీజ్‌ చేయడమే కాకుండా కేసులు నమోదు చేస్తాం. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పక్కా నిఘా పెడుతున్నాం. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ బందోబస్తు, తనిఖీలు నిర్వహిస్తాం. ఎవరైనా మద్యం, నగదు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పక్కా సమాచారం ఉంటే నా ఫోన్‌ నంబరు 9440796900, 9121100500కి కాల్‌ చేస్తే తక్షణమే స్పందిస్తాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.



 

 





Updated Date - 2021-09-29T05:44:09+05:30 IST