తలపడుతున్న మహిళా క్రీడాకారులు
నేడు మహిళా టీ-20 ఫైనల్స్
తలపడనున్న రాయల్స్, డాల్ఫిన్స్ జట్లు
విజయనగరం (ఆంధ్రజ్యోతి)/ డెంకాడ, జూలై 2 : వారం రోజులుగా చింతలవలస స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో జరుగుతున్న మహిళా టీ-20 క్రి కెట్ పోటీలు ఫైనల్స్‌కు చేరాయి. తాజాగా శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో బెజవాడ బ్లేజర్స్, రాయలసీమ క్వీన్స్ ఇంటి ముఖం పట్టాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన విజయనగరం రాయల్స్, వైజాగ్ డాల్ఫిన్స్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం జరగనున్న తుదిపోరులో ఫేవరెట్ జట్టుగా హోం టీం బరిలోకి దిగనుంది. చివరి పోటీ జరిగేది ఆదివారం కావడంతో క్రికెట్ క్రీడాకారులు, అభిమానులు అధిక సంఖ్యలో స్టేడియానికి చేరుకునే అవకాశా లున్నాయి. అందుకు తగ్గట్లు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం రాజన్నదొర, మంత్రులు బొత్స, రోజాతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌ను తిలకించనున్నారు. విజేతకు ట్రోఫీ, క్రీడాకారులకు బహుమతులు, షీల్డ్ వారు అందచేయనున్నట్లు ఏసీఏ ప్రతినిధి శివారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
శనివారం ఉదయం జరిగే సెమీఫైనల్స్‌లో విజయనగరం రాయల్స్ - వైజాగ్ డాల్ఫిన్స్ జట్టు పోటీపడ్డాయి. టాస్ గెలిచిన డాల్ఫిన్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. రాయల్స్ టీం19.4 ఓవర్లలో 91 రన్స్‌కు అలౌట్ అయ్యారు. బ్యాటింగ్‌లో పి.సరయు 18 బంతుల్లో 20 రన్స్ చేశారు. వీటిలో ఒక సిక్స్, 2 ఫోర్లు ఉన్నాయి. హరికాయాదవ్ 16 బంతుల్లో 3 ఫోర్లుతో కలిపి 16 రన్ ్స చేశారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో డాల్ఫిన్స్ అదరగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డాల్ఫిన్ జట్టు 16.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 94 పరుగులు చేసి విజేతలుగా నిలిచారు.
మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో రాయలసీమ క్వీన్స్- బెజవాడ బ్లేజర్ జట్లు పాల్గొన్నాయి. టాస్ గెలుచుకుని బ్యాటింగ్‌కు దిగిన క్వీన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేశారు. క్వీన్స్ క్రీడాకారిని సి.ఝాన్సీ విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించింది. 60 బాల్స్‌లో 14 ఫోర్లతో 88 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బ్లేజర్ టీం 20 ఓవర్లలో 6 వికెట్లుకోల్పోయి 110 రన్స్‌కే అందరూ పెవిలియన్ బాట పట్టారు. ఈ మ్యాచ్‌లో ప్లేయిర్ ఆఫ్ ఉమెన్‌గా ఝాన్సీ నిలిచింది.