సమరానికి సై..!

ABN , First Publish Date - 2021-01-27T05:38:24+05:30 IST

జిల్లాలో 807 పంచాయతీలకు గానూ 806 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.

సమరానికి సై..!
ఎన్నికల ఏర్పాట్లలో జల్లా పంచాయతీ అధికారులు, సిబ్బంది

రాజకీయ శిబిరాల్లో పంచాయతీ వేడి

రిజర్వేషన్ల వారీగా గెలుపు గుర్రాల అన్వేషణలో ప్రధాన పక్షాలు 

కీలక కార్యకర్తలతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా భేటీ

అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ వ్యూహం

నేడు తొలి విడత నోటిఫికేషన్‌ జారీ 

29 నుంచి 31 వరకు నామినేషన్ల స్వీకరణ

సన్నాహాలు చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారులు

నేడు జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌


రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ఇచ్చినా ఎన్నికలు జరుగుతాయా..? ప్రభుత్వం ఏదో రూపంలో ఎన్నికలు ఆపుతుంది... అంటూ రాజకీయ విశ్లేషకుల అంచనాలు తలకిందులయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నాయకులు మెత్తబడ్డారు. ఎన్నికల సహకారానికి సానుకూలత వ్యక్తం చేశారు. పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది. 29న ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో 221 పంచాయతీలకు తొలి విడత నోటిఫికేషన్‌ జారీ.. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. అదే క్రమంలో గెలుపు గుర్రాల వేటలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ నిమగ్నమయ్యాయి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి మంగళవారం కీలక నాయకులతో భేటీ అయ్యారు. అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేసేందుకు వైసీపీ రాష్ట్ర కీలక నేత రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ సమాచారం. కడప గడపన పంచాయతీ సమరానికి అన్ని పక్షాలు సన్నద్ధం అవుతున్నాయి. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో 807 పంచాయతీలకు గానూ 806 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 14 మండలాల పరిధిలో 206 పంచాయతీలకు నేడు తొలి విడత నోటిషికేషన్‌ జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి విడుదల చేయనున్నారు. 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లను స్వీకరిస్తారు. ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు అందాయి. ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ప్రభాకర్‌రెడ్డి మంగళవారం ఎన్నికల నిర్వహణ కసరత్తు చేపట్టారు. గ్రామ పంచాయతీల వారీగా సర్పంచి, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా, గతంలో ముద్రించిన బ్యాలెట్‌ పత్రాలు, ఎంతమంది సిబ్బంది అవసరం.. వంటి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని సమకూర్చుకుంటున్నారు. ప్రభుత్వ సీఎస్‌తో జరిగిన సమావేశంలో ఎన్నికలకు సహకరించేందుకు ఏపీ ఎన్జీవో నాయకులు సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులు కూడా మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు.  


8033 పోలింగ్‌ కేంద్రాలు

నాలుగు విడతల్లో 806 పంచాయతీలు, 7,892 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 8033 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు మేరకు తొలి విడతలో 14 మండలాల పరిధిలో 206 పంచాయతీలు, 2068 వార్డులకు 2129 పోలింగ్‌ కేంద్రాలు, రెండో విడతలో ఎన్నికలు జరిగే 12 మండలాల్లో 181 పంచాయతీలు, 1806 వార్డులకు 1826 పోలింగ్‌ కేంద్రాలు, మూడో విడత ఎన్నికలు జరిగే 11 మండలాల పరధిలో 195 పంచాయతీలు, 1966 వార్డులకు 1986 పోలింగ్‌ కేంద్రాలు, నాలుగో విడతలో ఎన్నికల జరిగే 13 మండలాల పరిధిలోని 224 పంచాయతీలు, 2052 వార్డులకు 2092 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేలా జిల్లా పంచాయతీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


సర్పంచ్‌కు పింక్‌, వార్డు సభ్యుడికి తెలుపు రంగు

బరిలో నిలబడే అభ్యర్థులకు బ్యాలెట్‌ పత్రాలు, ఏయే గుర్తులు కేటాయించాలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్‌కు పింక్‌ (గులాబి రంగు)  బ్యాలెట్‌ పత్రం, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రాలను వినియోగిస్తారు. బరిలో ఉన్న అభ్యర్థులకు మంచం, కత్తెర, ఉంగరము, బుట్ట, వంకాయ, కప్పు, సాసరు, క్యారెట్‌, తాళము, చెవి, గొలుసు, కుర్చీ గుర్తులను కేటాయించనున్నారు. పది మంది కంటే ఎక్కువ మంది బరిలో ఉంటే ఇతర గుర్తులను కేటాయిస్తామని అధికారులు తెలిపారు. 


రాజకీయ శిబిరాల్లో ఎన్నికల వేడి

సుప్రీంకోర్టు తీర్పుతో పల్లెపోరు అనివార్యం కావడంతో రాజకీయ పార్టీల శిబిరాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. 806 పంచాయతీల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు సై అంటున్నాయి. మంగళవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి కమలాపురం నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులు, కార్యకర్తలతో కడపలో సమవేశమయ్యారు. నియోజకవర్గంలో మండలాలు, పంచాయతీలు, రిజర్వేషన్ల వారీగా పోటీకి ఆసక్తి చూపే నాయకులు, వారికున్న బలాబలాపై పుత్తా సమీక్షించారు. అన్ని పంచాయతీల్లో అభ్యర్థులను బరిలో నిలిపి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఆయన ఆంధ్రజ్యోతికి వివరించారు. తొలి విడత ఎన్నికలు జరిగే మైదుకూరు నియోజకవర్గం పరిధిలోని మైదుకూరు మండల నాయకులతో ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఆదివారం సమావేశమయ్యారు. రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు. బుధవారం నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ 90 పంచాయతీల్లో అభ్యర్థులను బరిలో దింపేలా వ్యూహరచన చేస్తామని వివరించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 30 పంచాయతీలు ఉన్నాయి. అక్కడ కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరు సమన్వయనంతో అభ్యర్థులను పోటీకి దింపేలా కృషి చేస్తున్నారు. బద్వేలు నియోజకవర్గంలో 86 పంచాయతీల్లో అభ్యర్థులను బరిలో దింపేలా నాయకులు కసరత్తు చేస్తున్నారు. అదే క్రమంలో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ బలమైన అభ్యర్థులను బరిలో దింపేలా కసరత్తు చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సమయంలో 75-80 శాతం ఏకగ్రీవం అధికార పార్టీ ఏకీగ్రవం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే ఒరవడి సాగించాలనే వ్యూహం. అయితే.. ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో.. అన్ని స్థానాల్లో గెలుపు దిశగా అభ్యర్థులను బరిలో దింపేలా పార్టీ రాష్ట్రస్థాయి కీలక నేత ఒకరు జిల్లా నాయకులకు దిశానిర్ధేశం చేస్తున్నట్లు సమాచారం. వీలైనన్నీ ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపాలని బీజేపీ కీలక నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. 


తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో పంచాయతీలు, రిజర్వేషన్లు, వార్డులు, పోలింగ్‌ స్టేషన్ల వివరాలు


మండలం పంచాయతీల రిజర్వేషన్లు వార్డుల పోలింగ్‌ కేంద్రాలు

మహిళలు జనరల్‌ మొత్తం

-------------------------------------------------------------------------------------------------------------------------

ప్రొద్దుటూరు నియోజకవర్గం

ప్రొద్దుటూరు 8 7 15 182 243

రాజుపాలెం 8 7 15 146 146

--------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 16 14 30 328 389

--------------------------------------------------------------------------------------------------------------------------

మైదుకూరు నియోజకవర్గం:

మైదుకూరు 7 6 13 132 132

దువ్వూరు 12 11 23 220 220

ఖాజీపేట 11 10 21 206 206

చాపాడు 11 11 22 208 208

బి.మఠం 6 5 11 122 122

--------------------------------------------------------------------------------------------------------

మొత్తం 47 43 90 888 888

--------------------------------------------------------------------------------------------------------------------------

బద్వేలు నియోజకవర్గం:

బద్వేలు 5 5 10 98 98

గోపావరం 4 3 7 70 70

అట్లూరు 6 6 12 116 116

బి.కోడూరు 5 5 10 98 98

కలసపాడు 7 6 13 130 130

కాశినాయన 9 8 17 160 160

పోరమామిళ్ల 9 8 17 180 180

--------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 45 41 86 852 852

--------------------------------------------------------------------------------------------------------------------------

తొలి విడత మొత్తం 108 98 20 2,068 2,129

--------------------------------------------------------------------------------------------------------


Updated Date - 2021-01-27T05:38:24+05:30 IST