మొక్కజొన్న సాగుకు సై

ABN , First Publish Date - 2022-05-24T05:43:35+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొక్కజొన్న నాట్లుకు ఇదే అనుకూల సమయమని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తెలిపారు.

మొక్కజొన్న సాగుకు సై
పరిశోధన స్థానంలో సాగుచేస్తున్న వేసవి మొక్కజొన్న


మే నెలాఖరు నుంచి జూన్‌ చివరి వరకు నాట్లుకు అనుకూలం

విత్తనాల కోసం పరిశోధన 

స్థానం, వ్యవసాయ అధికారులను సంప్రతించాలి

చింతపల్లి, మే 23: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొక్కజొన్న నాట్లుకు ఇదే అనుకూల సమయమని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తెలిపారు. జిల్లాలో మొక్కజొన్న పంట సాగు లాభసాటిగా వుండడంతో గిరిజన రైతులు ఖరీఫ్‌లో అధికంగా సాగు చేస్తున్నారు. మొక్కజొన్నను పాడేరు డివిజన్‌ పరిధిలో 5,500 హెక్టార్లలో రైతులు పండిస్తున్నారు. రైతులు మొక్కజొన్న సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఖరీఫ్‌లో వేసుకున్న మొక్కజొన్న పంట తరువాత రాజ్‌మా, వలిసెలు పంటలను సాగుచేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

సాగుకు అనువైన నేలలు

ఎర్ర నేలలు, లోతైన మధ్యరకపు రేగడి నేలలు, మురుగునీరు పోయే నేలలు అనుకూలం. ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 వరకూ ఉన్న నేలలు ఈ పంట సాగుకు అత్యంత అనుకూలం.

ఏజెన్సీకి అనువైన రకాలు

దీర్ఘకాలిక రకాలు (100-120 రోజులు): డీహెచ్‌ఎం-113, బయో-9681, 900ఎంగోల్డ్‌.

మధ్యకాలిక రకాలు (90-100 రోజులు): డీహెచ్‌ఎం-111, 119, కేహెచ్‌-510, 9541, బయో-9637, ఎంసీహెచ్‌-2, కోహినూర్‌, కేఎంహెచ్‌-25కె60.

స్వల్పకాలిక (90 రోజుల కన్నా తక్కువ): డీహెచ్‌ఎంఎం-1, వీఎల్‌49, ఎంఎంహెచ్‌-133, 3342.

విత్తే కాలం, పద్ధతి: ఖరీఫ్‌ ప్రారంభం మే నెలాఖరు, జూన్‌ చివరి వరకూ నాట్లు వేసుకోవచ్చు. బోదెసాళ్లలో 2 సెం.మీ లోతులో విత్తుకోవాలి. 

విత్తన మోతాదు: ఎకరానికి హైబ్రీడ్‌ 7-8 కిలోలు, తీపిజొన్న 3-4 కిలోలు, పేలాల మొక్కజొన్న 5 కిలోలు అవసరం.

గిరిజన ప్రాంత మొక్కజొన్నకు కావాల్సిన ఎరువులు

ఎకరానికి 175 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పెట్‌, 35 కిలోలు మ్యూరేట్‌ ఆప్‌పొటాస్‌ వేసుకోవాలి.

కలుపు నివారణ

పంట విత్తిన తరువాత రెండు రోజులలోపు అట్రాజెన్‌ అనే కలుపు మందును నేల రకం బట్టీ 800-1200 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 30 రోజుల తరువాత 2-4-డి సోడియం సాల్ట్‌ 0.5 కిలోలు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 30-45రోజులకు కల్లివేటర్‌తో అంతర కృషిచేస్తే కలుపు మొక్కలను నివారించవచ్చు. మొక్కజొన్న కోసిన తరువాత అదే పొలంలో రెండవ పంటగా రాజ్‌మా చిక్కుళ్లు, వలిసెల పంటలను సాగుచేయాలని ఆశించిన రైతులు మొక్కజొన్న పంటలో కలుపు నివారణకు ఆట్రజిన్‌ మందుకు బదులుగా పెండిమిథాలిన్‌ మందును ఎకరాకు ఒక లీటరు చొప్పున విత్తిన మూడు రోజులలోపు వాడుకోవాలి. 

నీటి యాజమాన్యం: మొక్కజొన్నకు పూతకు ముందు, పూత దశలో, గింజ పాలుపోసుకునే దశలో నీరు పెట్టడం అవసరం. 

చీడపీడలు, నివారణ

కాండం తొలుచు పురుగు: మోనోక్రోటోఫాస్‌ 1.6 మిల్లీలీటర్లు నీటిలో కలిపి 10-12 రోజుల తరువాత పిచికారీ చేయాలి. ఎకరానికి కార్బోప్యూరాన్‌ 3 కేజీలు ఆకు సుడులలో వేసుకోవాలి. 

విత్తనాల కోసం సంప్రతించాలి  

గిరిజన ప్రాంతంలో మొక్కజొన్న విత్తనాలు అందుబాటులో లేవు. రైతులు వ్యవసాయ అధికారులను సంప్రతించి మైదాన ప్రాంత దుకాణాలు, వివిధ కంపెనీల నుంచి విత్తనాలను కొనుగోలు చేసుకోవచ్చు. పరిశోధన స్థానాన్ని సంప్రతించినా రైతులకు అవసరమైన విత్తనం దిగుమతి చేసుకుని అందజేస్తాం.

- సందీప్‌ నాయక్‌, సేద్య విభాగం శాస్త్రవేత్త, ఆర్‌ఏఆర్‌ఎస్‌, చింతపల్లి

Updated Date - 2022-05-24T05:43:35+05:30 IST