నేడే పీఎస్‌ఎల్వీ-సీ51 ప్రయోగం

ABN , First Publish Date - 2021-02-28T07:51:22+05:30 IST

ఈ ఏడాది తొలి రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో ఉన్న ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ51ని ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు

నేడే పీఎస్‌ఎల్వీ-సీ51 ప్రయోగం

ఉదయం 10.24 గంటలకు 19 ఉపగ్రహాలతో నింగిలోకి

కౌంట్‌డౌన్‌ ప్రారంభం.. శ్రీవారి పాదాల చెంత నమూనా

తిరుమలలో పూజలు.. అంతరిక్షంలోకి మోదీ ఫొటో.. భగవద్గీత!


తిరుమల/శ్రీహరికోట, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది తొలి రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో ఉన్న ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ51ని ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రయోగం కోసం శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. 25.30 గంటల అనంతరం అంటే ఆదివారం ఉదయం 10.24కు కౌంట్‌డౌన్‌ జీరోకు చేరుకోగానే 19 ఉపగ్రహాలతో ఈ రాకెట్‌ రోదసిలోకి దూసుకుపోనుంది. ప్రయోగానంతరం పీఎ్‌సఎల్వీ-సీ51 రాకెట్‌ 1.55 గంటలపాటు రోదసిలో పయనించనుంది. బయలుదేరిన 17.23 నిమిషాలకు బ్రెజిల్‌కు చెందిన 637 కిలోల అమెజోనియ-1 ఉపగ్రహాన్ని సూర్యానువర్తన ధృవకక్ష్య(సన్‌ సింక్రనైజ్‌ పోలార్‌ ఆర్బిట్‌)లోకి చేరవేయనుంది. అనంతరం నాలుగు నిమిషాలలో మిగిలిన 18 బుల్లి ఉపగ్రహాలను కక్ష్యల్లో వదిలిపెట్టనుంది. ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆదివారం ఉదయం 9.50 నుంచి దూరదర్శన్‌, ఇస్రో వెబ్‌సైట్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇస్రో చైర్మన్‌ శివన్‌, శాస్త్రవేత్తలు శనివారం పీఎ్‌సఎల్వీ-సీ51 నమూనాతో తిరుపతి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.  


ఉపగ్రహాలు ఇవీ..

  • అమెజోనియా-1: ప్రయోగంలో ఇదే ప్రధాన ఉపగ్రహం. భూ పరిశీలన కోసం బ్రెజిల్‌కు చెందిన నేషనల్‌ ఇనిస్ట్యిటూట్‌ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ దీనిని తయారుచేసింది. అమెజాన్‌ అడవుల పరిశోధనతో పాటు బ్రెజిల్‌లో వ్యవసాయ భూముల సమాచార సేకరణకు ఉపయోగపడనుంది. నాలుగేళ్లు పనిచేస్తుంది. 
  • అమెరికాకు చెందిన 12 స్పేస్‌ బీస్‌ ఉపగ్రహాలు,  ఎస్‌ఏఐ-1 నానో కనెక్టివిటీ-2 ఉపగ్రహం. 
  • డీఆర్‌డీవో ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన సింధునేత్ర ఉపగ్రహం 
  • చెన్నైకి చెందిన స్పేస్‌ కిడ్జి ఇండియా విద్యార్థులతో రూపొందింపజేసిన సతీష్‌ ధవన్‌ శాట్‌(ఎస్‌డీ శాట్‌). ఈ నానో ఉపగ్రహాన్ని రేడియేషన్‌ తరంగాలు, వాతావరణ పరిశోధనకు రూపొందించారు. దీనిలో ప్రధాని మోదీ ఫొటో, ఎస్‌డీ కార్డులో భగవద్గీత, 25 వేల మంది పేర్లు పంపనున్నారు.
  • శ్రీపేరంబుదూర్‌లోని జెప్పియర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థులు తయారుచేసిన జేఐటీశాట్‌, కోయంబత్తూరులోని త్రిశక్తి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్థులు రూపొందించిన త్రిశక్తి శాట్‌, నాగపూర్‌లోని జీహెచ్‌ రీరైసోని కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు తయారుచేసిన జీహెచ్‌ఆర్‌సీఈలను కలిపి యూనిటీశాట్‌గా ప్రయోగిస్తున్నారు. రేడియో తరంగాల ప్రసారాలకు ఉపయోగపడేలా వీటిని రూపొందించారు. 

Updated Date - 2021-02-28T07:51:22+05:30 IST