పట్టాభి.. బయటకు రారా

ABN , First Publish Date - 2021-10-20T08:15:54+05:30 IST

అది.. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న గురునానక్‌ కాలనీ. పట్టపగలే ఆటోల్లో దాదాపు వందమంది యువకులు, మహిళలు ఆయుధాలతో వచ్చారు. అక్కడి నుంచి ఆటోలను పంపేసి, కాస్త దూరం నడుచుకుంటూ వెళ్లి ఓ ఇంట్లోకి ప్రవేశించారు.

పట్టాభి.. బయటకు రారా

  • నిన్ను నడిరోడ్డు మీద నరికేస్తాం
  • బెజవాడలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు..
  • టీడీపీ నేత ఇంటిపై వందమంది దాడి 
  • 5 నిమిషాల్లోనే విధ్వంసం.. డ్రైవర్‌ మెడపై కత్తి పెట్టి బెదిరింపులు 
  • తిరిగి వెళ్తూ కళా వెంకటరావు ఇంటిపై రాళ్లు 
  • దాడి సమయంలో ఇంట్లోలేని పట్టాభి, ఆయన భార్య 
  • కుమార్తెను బాత్‌రూమ్‌లో దాచి కాపాడిన పనిమనిషి 


విజయవాడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): అది.. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న గురునానక్‌ కాలనీ. పట్టపగలే ఆటోల్లో దాదాపు వందమంది యువకులు, మహిళలు ఆయుధాలతో వచ్చారు. అక్కడి నుంచి ఆటోలను పంపేసి, కాస్త దూరం నడుచుకుంటూ వెళ్లి ఓ ఇంట్లోకి ప్రవేశించారు. బయట వరండాలో ఉన్న డ్రైవర్‌ పీకపై కత్తి పెట్టి చంపేస్తామని బెదిరించారు. ‘ఓరేయ్‌.. పట్టాభి బయటకు రారా.. ఈ రోజు నిన్ను చంపడం ఖాయం.. నడిరోడ్డు మీద నరికేస్తాం‘ అంటూ కేకలు వేశారు. ఇంట్లో ఫ్రిజ్‌లను నేలకేసి పగలగొట్టారు. టీవీలను ధ్వంసం చేశారు. కంప్యూటర్లను ముక్కలు చెక్కలు చేశారు. సీసీ కెమెరాలు పగులగొట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను రికార్డు చేసిన కంప్యూటర్‌ హార్డ్‌డి్‌స్కను ముక్కలు ముక్కలు చేసేశారు. హాలు, వంటగదిలో ఉన్న సామగ్రిని మొత్తం ధ్వంసం చేశారు. కార్యాలయంలో ఉన్న కంప్యూటర్‌, ప్రింటర్‌ను నామరూపాలు లేకుండా చేశారు. బయట ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేశారు. పూలకుండీలు నేలకేసి కొట్టారు. కొన్ని కుండీలను కారుపై పగలగొట్టారు.


బైక్‌పై పెట్రోలు పోసి వదిలేశారు. ఇలా సినిమాల్లో దాడి సన్నివేశాలను తలపించేలా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. ఇంట్లో ఉన్నవారిని, చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురిచేసే ఈ సంఘటన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది. పట్టాభిని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. ఆ సమయంలో పట్టాభి, ఆయన భార్య చందన ఇంట్లో లేరు. ఇంట్లో పట్టాభి కుమార్తె అన్నపూర్ణ, పనిమనిషి గోవిందమ్మ ఉన్నారు. డ్రైవర్‌ శివారెడ్డి బయట కూర్చుని ఉన్నాడు. మొదట ముగ్గురు, నలుగురు యువకులు వెళ్లి పట్టాభి ఉన్నాడా అంటూ  డ్రైవర్‌ను అడిగారు. లేరని చెప్పడంతో అంతా దాడికి పాల్పడ్డారు. వందమంది ఒక్కసారిగా లోపలకు రావడంతో పనిమనిషి గోవిందమ్మ భయంతో చిన్నారి అన్నపూర్ణను తీసుకుని బాత్‌రూంలోకి దాక్కుంది. దుండగులు ఇల్లు మొత్తాన్ని చెల్లాచెదురు చేశారు. మహిళలు తొడగొట్టుకుంటూ పట్టాభిపై బూతుపురాణం విప్పారు. 4.10- 4.15 గంటల మధ్య విధ్వంసం జరిగిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. కొడవళ్లతో పట్టాభి పీక కోస్తామంటూ మహిళలు నినాదాలు చేశారు. పట్టాభి ఇంటిపై దాడి చేసిన తర్వాత దుండగులు భారతీనగర్‌కు వెళ్లారు.


అక్కడ కళా వెంకటరావు ఇంటిపై రాళ్లు రువ్వి వచ్చిన ఆటోల్లోనే పరారయ్యారు. బయటకు వెళ్లిన చందన 4.40 గంటలకు ఇంటికి తిరిగొచ్చారు. సమాచారం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌, క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొన్ని వేలిముద్రలను క్లూస్‌టీం సేకరించింది. పట్టాభిని టార్గెట్‌ చేసుకుని దాడులు జరగడం ఇది మూడోసారి. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో పట్టాభి విలేకరుల సమావేశంలో ప్రభుత్వం, అధినేతపై విమర్శలు గుప్పించారు. ఇది వైసీపీ నేతలకు మింగుడు పడలేదు. మధ్యాహ్నానికల్లా స్కెచ్‌ వేసి దాడులకు దిగారు. పట్టాభి మీడియా సమావేశంలో మాట్లాడిన తీరును బట్టి పోలీసులు పరిస్థితిని గ్రహించారు. పటమట పోలీసులు కొంతమంది సిబ్బందిని మఫ్టీలో ఆయన ఇంటి వద్ద పెట్టారు. మధ్యాహ్నం 2.30గంటల సమయంలో పట్టాభి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో పట్టాభి బయటకు వెళ్లారని డ్రైవర్‌ చెప్పడంతో వెళ్లిపోయారు. ఆ తర్వాత వైసీపీ శ్రేణులు వచ్చి దాడులకు తెగబడ్డారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ యువ నేత అనుచరులే ఈ దాడుల్లో పాల్గొన్నారని ప్రచారం జరుగుతోంది. డ్రైవర్‌ శివారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-10-20T08:15:54+05:30 IST