ఆణిముత్యాలను అందించారు’

ABN , First Publish Date - 2022-04-24T05:59:06+05:30 IST

ప్రపంచ సినీ యవనికపై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోదయా సంస్థ.

ఆణిముత్యాలను అందించారు’

నేడు ఏడిద నాగేశ్వరరావు జయంతి. 


ప్రపంచ సినీ యవనికపై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోదయా సంస్థ. తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపుకాసిన ఆపద్భాందవుడు. ఉత్తమాభిరుచితో సినిమాకి సేవలు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోదయ అధినేత ఏడిద నాగేశ్వరరావు. ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘స్వయంకృషి’, ‘స్వాతిముత్యం’, ‘ఆపద్భాందవుడు’, ‘సితార’, ‘సీతాకోకచిలుక’ మొదలగు కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించారు.


ఏడిద నాగేశ్వరరావు 1934 ఏప్రిల్‌ 24న గోదావరి జిల్లా తణుకులో జన్మించారు. కాలేజీ రోజుల నుంచి నాటక అనుభవం ఉండడంతో మద్రాస్‌ రైలెక్కిన ఆయనకు నిరాశే మిగిలింది. చేసేది లేక చిన్నా చితక వేషాలు వేస్తూ నానా కష్టాలూ పడుతూ బతుకు కొనసాగించారు. 1976లో మిత్రుల ప్రోత్సాహంతో ‘సిరిసిరి మువ్వ’ చిత్రానికి నిర్వహణ బాధ్యతలు వహించి మంచి విజయం సాధించారు. ఆ ఉత్సాహంతో పూర్ణోదయా ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా ‘తాయారమ్మ బంగారయ్య’ నిర్మించారు. తదుపరి కే. విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘శంకరాభరణం’ తీశారు.

ఈ సినిమాకు వచ్చినంత పేరు, వసూళ్లు, జాతీయ, అంతర్జాతీయ   అవార్డులు మరే తెలుగు చిత్రానికి రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత వచ్చిన ‘సీతాకోకచిలుక’ అప్పట్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌.  కమల్‌హాసన్‌, కె విశ్వనాథ్‌ కలయికలో ఏడిద నిర్మించిన ‘సాగరసంగమం’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ‘సితార’కి జాతీయ అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది. 1986లో విడుదలైన ‘స్వాతిముత్యం’ అప్పటి బాక్సాఫీసు రికార్డ్స్‌ని బీట్‌ చేసింది.


ఆస్కార్‌ అవార్డులకు భారతదేశం తరపున ఎంపిక చేసిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. మెగాస్టార్‌తో ‘స్వయంకృషి’ తీసి హిట్‌ చేశారు. చిరంజీవి నట విశ్వరూపాన్ని చూపిన ‘ఆపద్బాంధవుడు’కూ ఆయనే నిర్మాత. ఇన్ని మంచి చిత్రాలు నిర్మించిన ఏడిద నాగేశ్వరరావుకు ప్రభుత్వాలు కనీసం పద్మశ్రీ పురస్కారం కూడా ఇవ్వలేదు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకు నామినేట్‌ అయినా రాలేదు. మంచి చిత్రం కోసం కోట్లాది రూపాయలను పణంగా పెట్టిన ఒక గొప్ప నిర్మాతకు ఆయన స్థాయికి తగిన గౌరవం దక్కలేదు. కళాసాగర్‌  సంస్థ ఈ దశాబ్దపు ఉత్తమ నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావుకు అవార్డునిచ్చి గౌరవించారు. సంగం అకాడమీ, సంతోషం సంస్థలు ఆయన్ను లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌తో సత్కరించాయి. 

Updated Date - 2022-04-24T05:59:06+05:30 IST