అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాలి

ABN , First Publish Date - 2021-11-30T06:14:49+05:30 IST

అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాలి

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 

భీమిలి, నవంబరు 29: అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. సోమవారం భీమిలి నియోజకవర్గంలోని జీవీఎంసీ నాలుగు వార్డుల అభివృద్ధి పనులపై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. స్థానిక సమస్యల గురించి నాయకులతో చర్చించి పరిష్కరించాలని, నాయకులు సిబ్బందికి సహకరించాలన్నారు. ముఖ్యంగా జీవీఎంసీలో కలిసిన నాలుగో వార్డుపై ప్రత్యేకంగా దృష్టిసారించి అభివృద్ధి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. వార్డులో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌, రహదారుల సమస్యలు లేకుండా చూడాలన్నారు. కరోనాతో అన్ని రంగాలు కుదేలైనా ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఏ మేలు చేయని వ్యక్తిగా చంద్రబాబు నిలిచిపోయారని ముత్తంశెట్టి విమర్శించారు. ఈ సమీక్షా సమావేశంలో తహసీల్దార్‌ కేవీ ఈశ్వరరావు, నాలుగో  వార్డు కార్పొరేటర్‌ దౌలపల్లి ఏడుకొండలరావు,  సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు అక్కరమాని రామునాయుడు, ప్రభావతి, కరుణాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-30T06:14:49+05:30 IST