ఆర్బీకేల ద్వారా రైతులకు సేవలు అందించండి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-02-25T04:58:35+05:30 IST

గ్రామాల్లో వ్యవసాయ అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ద్వారా రైతులకు ప్రభుత్వం నిర్ధేశించిన సేవలు అందించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆర్బీకేల ద్వారా రైతులకు సేవలు అందించండి : కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సి.హరికిరణ్‌

కడప(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 24: గ్రామాల్లో వ్యవసాయ అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ద్వారా రైతులకు ప్రభుత్వం నిర్ధేశించిన సేవలు అందించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో జిల్లాస్థాయి రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి జేసీలు ఎం.గౌతమి (రెవెన్యూ), సీఎం సాయికాంత్‌ వర్మ (అభివృద్ధి)లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లో పంటల సాగు పట్ల రైతులకు వంద శాతం భరోసా కల్పిస్తోందన్నారు. వ్యవసాయ అధికారులు వారి పరిధిలోని రైతు భరోసా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతుల అవసరాలను గుర్తించాలన్నారు. ప్రతి ఆర్బీకే పరిధిలోని రైతులకు సీజన్ల వారీగా భూసార పరీక్షలు నిర్వహించి, అనుకూలమైన పంటలు సాగు చేసేందుకు సూచనలు ఇవ్వాలన్నారు.    సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు మురళీకృష్ణ, ఏపీ ఎంఐపీ పీడీ మధుసూదన్‌రెడ్డి, ఉద్యాన శాఖ డీడీ వజ్రశ్రీ, పంచాయ తీరాజ్‌ ఎస్‌ఈ సుబ్బారెడ్డి, సివిల్‌ సప్లైస్‌ మేనేజరు పద్మజ, ఎల్‌డీఎం చంద్రశేఖర్‌, డీసీసీ మార్కెటింగ్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 


లింగ నిర్ధారణకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు

జిల్లాలో బ్రూణ హత్యలు అరికట్టాలని, ఆడపిల్లల పుట్టుక విషయంలో లింగ నిర్దారణకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు తప్పవని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గర్భస్థ లింగ నిర్ధారణ, మాతా శిశు మరణాలు అంశాలపై జిల్లాస్థాయి అడ్వజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం జిల్లాలో ప్రతి వెయ్యి మంది  మగ వారికి 920 మంది ఆడవారి శాతం ఉందన్నారు. ఆడపిల్లను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని కలెక్టర్‌ పిలుపు నిచ్చారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి వెంకట రాజేష్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో గర్భస్థ లింగ నిర్థారణ చట్టం అమలులో అధికారులు, సిబ్బంది మరింత కృషి చేయాలన్నారు.  జాయింట్‌ కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ అనిల్‌ కుమారర్‌, ఐసీడీఎస్‌ పీడీ పద్మజ, రిమ్స్‌ సూపరింటెండెంట్‌, డీసీహెచ్‌ఎస్‌, డీఈఓ, డీపీఓలతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు 

వైద్యులు అంకితభావం, బాధ్యతాయుతంగా పని చేసినపుడే ప్రసూతి సమయంలో మాతృ మరణాలు అరికట్టగలమని, మాతాశిశు మరణాలు లేని జిల్లాగా పేరు తేవాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబరులో ప్రసూతి మరణాల విచారణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రసూతి మరణాల రేటును జీరో శాతానికి తెచ్చేందుకు వైద్యాధికారులు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. మాతృమరణాల విషయంలో  వివరాలు, కారణాలు తెలుసుకున్న కలెక్టర్‌  వైద్యసిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  విధి నిర్వహణలో బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.

Updated Date - 2021-02-25T04:58:35+05:30 IST