కాలనీల్లో మౌలిక వసతులు కల్పించండి

ABN , First Publish Date - 2022-05-29T04:30:28+05:30 IST

జగనన్న కాలనీల్లో అప్రోచ్‌ రోడ్లు, భూమి చదును, ఇంటర్నల్‌ రోడ్లకు సంబంధించిన పనులు ఏమైనా పెండింగ్‌ ఉంటే వెంటనే ప్రతిపాదనలు పంపాలని గృహ నిర్మాణశాఖ డీఈ, ఏఈలను కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు.

కాలనీల్లో మౌలిక వసతులు కల్పించండి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

హౌసింగ్‌ ఇంజనీర్లను ఆదేశించిన కలెక్టర్‌ 


రాయచోటి (కలెక్టరేట్‌), మే 28: జగనన్న కాలనీల్లో అప్రోచ్‌ రోడ్లు, భూమి చదును, ఇంటర్నల్‌ రోడ్లకు సంబంధించిన పనులు ఏమైనా పెండింగ్‌ ఉంటే వెంటనే ప్రతిపాదనలు పంపాలని గృహ నిర్మాణశాఖ డీఈ, ఏఈలను కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పురోగతి, జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు వంటి విషయాలపై గృహ నిర్మాణశాఖ ఇంజనీర్‌లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని, వసతులు లేని లేఅవుట్‌లు ఉండకూడదని, ఉంటే చర్యలు తప్పవని గృహ నిర్మాణశాఖ ఇంజనీర్లను హెచ్చరించారు. కొత్తగా జగనన్న కాలనీ లేఅవుట్‌లో భూమి చదును ఉంటే ఆ పనులు చేయడానికి ఐడీ క్రియేట్‌ చేసిన వాటిని వెంటనే డీఈలు ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ చేయించాలన్నారు. ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం త్వరగా చేపట్టాలన్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఇదివరకే సమావేశాలు నిర్వహించి సమీక్ష చేసినా ఇళ్ల నిర్మాణంలో చాలాచోట్ల పురోగతి కనిపించలేదని, ఇంకా వెనుకబడి ఉన్నామని, పురోగతి కనిపించకపోతే చర్యలు తప్పవని గృహ నిర్మాణశాఖ ఇంజనీర్లను హెచ్చరించారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, హౌసింగ్‌ పీడీ శివయ్య తదితరులు పాల్గొన్నారు. 


బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ 

బాలికల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ వీడియా కాన్ఫరెన్స్‌ హాల్‌లో రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని యునిసెఫ్‌ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కౌమార దశలో చేరిన సమయంలో శారీరకంగా వారిలో కలిగే మార్పుల అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు, వారికి ఆ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలోని బాలికలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఐసీడీఎస్‌ పీడీని ఆదేశించారు. పోస్టల్‌ ఆవిష్కరణలో జేసీ తమీమ్‌ అన్సారియా, ఐసీడీఎస్‌ పీడీ పద్మజ, హౌసింగ్‌ పీడీ శివయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T04:30:28+05:30 IST