ఢిల్లీ వాసులను చూసి గర్విస్తున్నా.. కొవిడ్-19 గణాంకాలపై కేజ్రీవాల్..

ABN , First Publish Date - 2020-08-05T03:10:43+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేల దిగువకు చేరడం పట్ల ముఖ్యమంత్రి అరవింద్...

ఢిల్లీ వాసులను చూసి గర్విస్తున్నా.. కొవిడ్-19 గణాంకాలపై కేజ్రీవాల్..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేల దిగువకు చేరడం పట్ల ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.  ‘‘ఢిల్లీ ప్రజలారా.. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను..’’ అని ఆయన ట్విటర్లో కొనియాడారు. ఈ సందర్భంగా పలు గణాంకాలను కూడా ఆయన వెల్లడించారు. కొవిడ్-19 యాక్టివ్ కేసుల విషయంలో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఢిల్లీ ఇప్పుడు 14వ స్థానంలో ఉందనీ.. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో మృతుల సంఖ్య కూడా 12 లోపే ఉందని ఆయన తెలిపారు. ‘‘ఢిల్లీ వాసులారా... మిమ్మల్ని చూసి గర్విస్తున్నా. మీ ‘‘ఢిల్లీ మోడల్’’పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అయినప్పటికీ మనం దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అన్ని జాగ్రత్తలూ పాటించండి...’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో ఇవాళ కొత్తగా 674 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం బాధితుల సంఖ్య 1.39 లక్షలకు చేరింది. ఇక్కడ ఇప్పటి వరకు మొత్తం 4,033 కరోనా మరణాలు నమోదయ్యాయి.



Updated Date - 2020-08-05T03:10:43+05:30 IST