ఫోరం.. పెండింగ్‌

ABN , First Publish Date - 2022-01-08T05:44:24+05:30 IST

వినియోగదారుడా మేలుకో అంటూ ప్రతి రోజు పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు చుస్తూనే ఉంటాం. కానీ మేలుకున్న తరువాత ఎం చేయాలో ఎక్కడికి వెళ్లాలో మాత్రం తెలియడం లేదు.

ఫోరం.. పెండింగ్‌

వినియోగదారులకు అందని న్యాయం

బలహీనంగా మారిన హక్కుల చట్టాలు

సిబ్బంది లేక పరిష్కారం కాని ఫిర్యాదులు

2019 నుంచి వాయిదాలు తప్ప తీర్పులు లేవు

 

వినియోగదారుల హక్కుల చట్టం అందని ద్రాక్షాలా మారుతోందా.. అంటే పరిస్థితి చూస్తే అవుననాల్సిందే. రూపాయి చాక్లెట్‌ నుంచి రూ.కోట్లు పెట్టి కొనే వస్తువు, సేవలు పొందే వారందరూ వినియోగదారులే. వస్తువుల్లో నాణ్యత, సేవల్లో లోపం జరిగితే వినియోగదారుడు ఫోరంను ఆశ్రయించి తగినంత నష్టపరిహరం పొందేవాడు. వినియోగదారుల కోసం రూపొందించిన చట్టాలు.. కాగితాలకే పరిమితమవడంతో నాణ్యత, లోపం వల్ల నష్టపోయిన వారికి న్యాయం అందడంలేదు. గతంలో చట్టాలు.. ఫోరాలు పటిష్టంగా ఉండేవి. దీంతో సకాలంలో వినియోగదారులకు ఎక్కడికక్కడ న్యాయం జరిగేది. అదంతా గతానికే పరిమితమైపోయింది. ఫోరంను ఆశ్రయించిన 90 రోజుల్లో న్యాయం జరగాలి. కానీ క్షేత్రస్థాయిలో అటువంటిదేమి జరగడం లేదు. ఫోరంను ఆశ్రయించిన దాదాపు 90 శాతం కేసులు పరిష్కారం కావడం లేదు. వినియోగదారుల సంక్షేమ నిధుల ద్వారానే ఈ వ్యవస్థ నడుస్తుంది. కానీ ప్రస్తుతం సంక్షేమ నిధులు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని అందుకే ఫోరంలలో నియామకాలు చేపట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1700 కేసులు ఫోరానికి వచ్చినా అవి పరిష్కారం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 


 2018లో చివరి కేసు

జిల్లాలో వినియోగదారుల ఫోరం నుంచి తీర్పు వచ్చిన చిట్ట చివరి కేసు 2018 డిసెంబరులో నమోదైంది. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్‌ సిస్టమ్‌ నాణ్యతా లోపంపై ఫోరంలో కేసు వేశారు. ఈ కేసులో సోలార్‌ సంస్థ ఆ వ్యక్తికి పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఫోరంలో ఎటువంటి తీర్పులు వెలువడలేదు. ప్రతి ఏటా 500 కేసులను వచ్చే ఫోరాలను మాత్రమే ఉంచాలని జీవో ఉంది. అదే స్థాయిలో జిల్లా ఫోరంకు కేసులు వస్తున్నప్పటికీ తగినంత సిబ్బందిని నియమించడంలేదు.  అనేక ఒత్తిళ్లు మధ్య 2021 జనవరిలో రాత పరీక్షలు నిర్వహించినప్పటికి ఇంతవరకు నియామకాలు చేపట్టలేదు. 


వాయిదాలకే పరిమితం.. 

గుంటూరుకి చెందిన రాకేష్‌ అనే వ్యక్తి 2020లో ఆన్‌లైన్‌ ద్వారా ఫోను కోనుగోలు చేశాడు. నాణ్యత లోపాలు ఉండటంతో ఫోరంను ఆశ్రయించాడు. అప్పటి నుంచి వాయిదాలు మాత్రమే జరుగుతున్నాయి కానీ పరిహరం అందలేదు. ఫోరంలో జరుగుతున్న కేసుల్లో ఇది మచ్చుకు మాత్రమే.. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.


నిలిచిన మొబైల్‌ కోర్టు

జిల్లాలో వినియోగదారుల కేసుల త్వరితగతిని విచారణ చేయడానికి 2019లో అప్పటి జిల్లా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మొబైల్‌ కోర్టు సదుపాయం కలిగిన వ్యానును కేటాయించారు. అయితే ఈ వాహన డ్రైవర్‌కు ఎవరు జీతం ఇవ్వాలంటూ ప్రస్తుత ప్రభుత్వం దీనిని నిలిపివేసింది. ఇప్పటికి ఈ వ్యాను విజయవాడ రాష్ట్ర ఫోరంలోనే ఉంది. 


గుంటూరు(తూర్పు), జనవరి 7: వినియోగదారుడా మేలుకో అంటూ ప్రతి రోజు పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు చుస్తూనే ఉంటాం. కానీ మేలుకున్న తరువాత ఎం చేయాలో ఎక్కడికి వెళ్లాలో మాత్రం తెలియడం లేదు. దేశ రక్షణ చట్టం తరువాత పటిష్టంగా రూపొందించని చట్టాల్లో వినియోగదారుడి చట్టం ఒకటి. ఈ చట్టం అమలు తీరు క్షేత్రస్థాయిలో పూర్తిగా బలహీనంగా మారింది. దీంతో వినియోగదారునికి న్యాయం అందని ద్రాక్షలా మారింది. తగినంత సిబ్బంది, ఫిర్యాదు చేసే వారికి అవగాహన కల్పించడంలో విఫలం వంటి కారణాలతో చట్టం కనుమరుగువుతుందనే విమర్శలు వస్తున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే రానున్న రోజుల్లో ఈ చట్టం పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారుల ఫోరాల పరిధిని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం జనవరి 1న జారీ చేసిన నోటిఫికేషన్‌ ఈ చట్టాన్ని వినియోగదారుడికి హక్కులు మరింత దూరం చేసేలా ఉన్నాయని విమర్శలున్నాయి. వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్లు 34, 47, 58, 101 కింద కొత్తగా నిబంధనలు తీసుకువచ్చింది. వీటి ప్రకారం రూ.50 లక్షల వరకు విలువ ఉన్న కేసులను జిల్లా వినియోగదారుల ఫోరాల్లో విచారించాలి. ఆపై కేసులను రాష్ట్ర, జాతీయ ఫోరాలను ఆశ్రయించాలి. జిల్లా ఫోరాలపై కేసుల ఒత్తిడిని తగ్గించేందుకు సవరణలు తీసుకువచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అయితే గతంలో ఉన్న మొత్తాన్ని తగ్గించడం వల్ల వినియోగదారుడు రాష్ట్ర, జాతీయ ఫోరాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విజయవాడలో ఉన్న రాష్ట్ర ఫోరం, ఢిల్లీ జన్‌పథ్‌లో ఉన్న జాతీయ ఫోరాలను ఆశ్రయించడం అంటే అది వ్యయ, ప్రయాసలతో కూడుకున్న విషయం. అంతేగాక వస్తు నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌లు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడా లేవు. దీంతో నాణ్యత, కల్తీ లోపాలను పరీక్షించాలంటే శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించాలి. అక్కడి నుంచి నివేదిక వచ్చిన తరువాతే కేసు ముందుకు కదిలేది. కానీ ఒక్కో శాంపిల్‌ను పరీక్షించి  వాటి ఫలితాన్ని పంపాలంటే కనీసం వారం వరకు సమయం పడుతుంది. కేసుల్లో తీర్పులు రావడం ఆలస్యమవ్వడానికి ఇది మరో కారణం.


జిల్లాలో అంతంత మాత్రమే

మిగిలిన జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా వినియోగదారుల కేసుల పరిష్కారం 2019 నుంచి జిల్లాలో పూర్తిగా నిలిచిపోయింది. ఒకప్పటి ఫోరంను ప్రస్తుతం కమిషన్‌గా మార్చారు. ప్రతి జిల్లా కమిషన్‌లో ఒక విశ్రాంత న్యాయమూర్తి జడ్జిగా ఇద్దరు(ఒక మహిళ, ఒక పురుషుడు) సభ్యులుగా ఉంటారు. జిల్లాలో 2019 కు ముందు వరకు కమిషన్‌ పూర్తి స్థాయిలో పనిచేసింది. ఆ తర్వాత వారు రిటైర్‌ కావడంతో ఇంతవరకు కొత్తగా నియామకాలు జరపలేదు. దీంతో కేసులు పెండింగ్‌లో ఉండిపోయాయి. 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1700 కేసులు ఫోరానికి వచ్చినా అవి పరిష్కారం కాలేదని గణాంకాలు వివరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులు జిల్లా ఫ్యామిలీ కోర్టులో విచారణ జరుగుతున్నాయి. అవి కూడా వాయిదాలకే పరిమితం అవుతున్నాయే తప్ప ఇంతవరకు పరిష్కరించిన కేసు ఒక్కటి కూడా లేదు. ఆన్‌లైన్‌ ద్వారా అందుతున్న ఫిర్యాదులను పట్టించుకునే వారే లేరు. కమిషన్‌కు  అనుబంధంగా సాధ్యమైనంత వరకు కోర్టు బయటే కేసులను పరిష్కరించుకునేలా మీడియేటర్స్‌ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లాలో ఇంతవరకు కమిటీ ఏర్పాటు కాలేదు.  వారంలో ఒక రోజు వినియోగదారుల ఫోరం ద్వారా ఏర్పాటైన సభ్యుల బృందం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి కేసులను పరిష్కరించాలి. సరైన నిధుల్లేక 2019 తరువాత ఈ వ్యవస్థ పనిచేయడం మానేసింది.


క్రీయాశీలంగా లేని ఫోరం

వినియోగదారుల ఫోరం క్రియాశీలకంగా లేదు. దీంతో జిల్లాలో కల్తీ వస్తువులు గణనీయంగా పెరిగాయి. సరైన చర్యలు లేకపోవడంతో కొంతమంది వ్యాపారులు నాణ్యత లేని, కల్తీ వస్తువులను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. తాజా సవరణలు కూడా న్యాయాన్ని మరింత దూరం చేశాయి. ప్రభుత్వం తక్షణమే కమిషన్‌కు జడ్జీని నియమించాలి. మొబైల్‌ కోర్టులను ఏర్పాటు చేయాలి. వినియోగదారులు ప్రతి వస్తువుకు చివరకు పాల ప్యాకెట్‌కు కూడా బిల్లు తీసుకోవాలి. అప్పుడే ఫోరంలో కేసు వేయగలుగుతాం.

 - చదలవవాడ హరిబాబు,  వినియోగదారుల సంఘం అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు 



Updated Date - 2022-01-08T05:44:24+05:30 IST