ప్రొటోకాల్‌ రగడ

ABN , First Publish Date - 2022-06-26T06:36:46+05:30 IST

జిల్లాలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడంలేదని ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. తమను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. స్థానిక సమస్యలను ప్రజలు ప్రజాప్రతినిధులకే తెలియజేస్తారని, వాటి పరిష్కారానికి అధికారులను సంప్రదిస్తే పట్టించుకోవడంలేదని ఫిర్యాదులు అందుతున్నాయి.

ప్రొటోకాల్‌ రగడ
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాల్లో పేర్లపై గందరగోళం

నిబంధనలు తప్పకుండా పాటించాలి: కలెక్టర్‌ 


యాదాద్రి, జూన్‌25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడంలేదని ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. తమను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. స్థానిక సమస్యలను ప్రజలు ప్రజాప్రతినిధులకే తెలియజేస్తారని, వాటి పరిష్కారానికి అధికారులను సంప్రదిస్తే పట్టించుకోవడంలేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రొటోకాల్‌ సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకునేందుకు యంత్రాగం సిద్ధమైంది. హైదరాబాద్‌ నగరానికి జిల్లా చేరువలో ఉండటంతో పలు కార్యక్రమాల నిమిత్తం గవర్నర్‌, ముఖ్యమంత్రితో పాటు కేంద్ర, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మించిన యాదగిరిగుట్ట దేవస్థానానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు దర్శనంకోసం వస్తున్నారు. వీరికి ప్రొటోకాల్‌ ప్రకారం దర్శనంతోపాటు వసతులు కల్పించాలి. అయితే పలు సందర్భాల్లో అధికారులు ప్రొటోకాల్‌ నిబంధనలు పాటించడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. మండలాల్లో జరిగే అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లోనూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పట్టంచుకోవడంలేదని కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదులు అందాయి.


జడ్పీ సమావేశాల్లోనూ వాగ్వాదం 

జిల్లా పరిషత్‌ సమావేశం జరిగినప్పుడల్లా ప్రొటోకాల్‌ వివాదంపై వాగ్వాదం చోటుచేసుకుంటోంది. జిల్లాతోపాటు మండల స్థాయి అధికారులు స్థానిక సంస్థల ప్రజానిధులు ఫోన్లు చేస్తే స్పందించడంలేదని, కనీస ప్రొటోకాల్‌ పాటించడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్న వద్ద ఈ వివాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. గ్రామపంచాయతీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వడంలేదని కూడా ఆరోపిస్తున్నారు. శంకుస్థాపన శిలాఫలకంపై ప్రజాప్రతినిధుల పేర్లు రాయడంలో తప్పిదాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు అందుతున్నాయి. గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలని, ప్రొటోకాల్‌ ప్రకారం ఎవరి పేర్లు రాయాలన్న దానిపై యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు సర్పంచ్‌ రాములు జిల్లా అధికారులు వద్దకు వచ్చి సలహా తీసుకున్నారు. స్థానిక అధికారులు ఎవరెవరి పేర్లు ఉండాలన్నది కూడా స్పష్టంగా తెలియజేయకపోవడంతో, తానే ప్రొటోకాల్‌ సెక్షన్‌కు వచ్చానని తెలిపారు. వివాదాల దృష్ట్యా జిల్లా యంత్రాంగం నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పమేలాసత్పథి జిల్లా అధికారులను హెచ్చరించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు గ్రామాల్లో ఏ కార్యక్రమం నిర్వహించినప్పటికీ, సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రముఖుల పర్యటనల పట్ల అధికారులు అలసత్వం వహించకుండా, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


నిబంధనలు పాటించాలి: కలెక్టర్‌ 

జిల్లాలో ప్రముఖుల పర్యటనలు ఎక్కువగా ఉంటాయని, జిల్లా అధికారులు ప్రొ టోకాల్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ప్రొటోకాల్‌ నియమ, నిబంధనలపై జిల్లా అధికారులతో సమీక్ష సమవేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రముఖుల పర్యటన సందర్భంగా అధికారులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఎక్కడ పొరపాటు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు డి.శ్రీనివాస్‌రెడ్డి, దీపక్‌తివారీ, ఏవో నాగేశ్వరచారి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:36:46+05:30 IST