సోషల్ మీడియా పోస్ట్‌పై ఎగసిపడిన ఆగ్రహ జ్వాలలు... 12 మంది పోలీసులకు గాయాలు...

ABN , First Publish Date - 2022-04-17T21:19:44+05:30 IST

మసీదుపై కాషాయ జెండా ఉన్నట్లు కనిపిస్తున్న ఫొటోను ఓ వ్యక్తి

సోషల్ మీడియా పోస్ట్‌పై ఎగసిపడిన ఆగ్రహ జ్వాలలు... 12 మంది పోలీసులకు గాయాలు...

హుబ్బళి : మసీదుపై కాషాయ జెండా ఉన్నట్లు కనిపిస్తున్న ఫొటోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఓ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత హుబ్బళి ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ సంఘటనలో 12 మంది పోలీసులు గాయపడగా, దాదాపు ఏడు వాహనాలు ధ్వంసమయ్యాయి. 40 మంది దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. 


హుబ్బళిలోని ఆనంద్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ శనివారం రాత్రి తీవ్ర అలజడిని సృష్టించింది. మసీదుపై కాషాయ జెండా ఉన్నట్లు కనిపిస్తున్న ఫొటోను ఆ వ్యక్తి పోస్ట్ చేయడంతో పాత హుబ్బళి ప్రాంతంలోని ఓ వర్గానికి చెందినవారు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాత హుబ్బళి పోలీస్ స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ఫొటోను పోస్ట్ చేసిన వ్యక్తిపై ఓ ముస్లిం సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తిని తమకు అప్పగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అనంతరం ఈ నిరసన హింసాత్మకంగా మారింది. దుండగులు పెద్ద పెద్ద రాళ్ళతో పోలీస్ స్టేషన్‌, వాహనాలు, ఆసుపత్రి, దేవాలయంపై దాడి చేశారు. 


మరోవైపు నిందితుని తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు హుబ్బళి పోలీస్ కమిషనర్ లభు రామ్ చెప్పారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని చెప్పారు. పెద్ద సంఖ్యలో రాళ్ళు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ హింసాకాండలో ధ్వంసమైన వాహనాల యజమానులు, గాయపడినవారు తమ సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. 


కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనను రాజకీయం చేయడాన్ని తాము అనుమతించబోమని చెప్పారు. 


Updated Date - 2022-04-17T21:19:44+05:30 IST