సీఏఏపై చెన్నైలో నిరసన గళం

ABN , First Publish Date - 2020-02-20T09:36:25+05:30 IST

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా చెన్నై చేపాక్‌ ప్రాంతంలో 22 ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

సీఏఏపై చెన్నైలో నిరసన గళం

చెన్నై, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా చెన్నై చేపాక్‌ ప్రాంతంలో 22 ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల నుంచి వచ్చిన సుమారు పదివేలమంది ఇందులో పాల్గొన్నారు. చెన్నై వాషర్‌మెన్‌పేటలో ఆందోళన ఆరో రోజుకు చేరింది. ఆ ప్రాంతంలో రాత్రింబవళ్లు ధర్నా కొనసాగిస్తున్నారు.  ఇక తిరుచ్చి, మదురై, తిరునల్వేలి తదితర జిల్లా కేంద్రాల్లోనూ సీఏఏకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో వచ్చి కలెక్టరేట్లను ముట్టడించారు. మరోవైపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి ముస్లింలకు వరాలు కురిపించారు. ఉలేమాలు ద్విచక్రవాహనాలు కొనేందుకు 50 శాతం సబ్సిడీని సీఎం ప్రకటించారు. అలాగే, వారి పింఛన్‌ను రూ.1,500 నుంచి రూ.3,000కు పెంచారు. కొత్తగా హజ్‌హౌస్‌ నిర్మించేందుకు రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.


వెనక్కి తీసుకోవాల్సిందే సుప్రీం ప్రతినిధులకు నిరసనకారులు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న షాహీన్‌బాగ్‌లో బుధవారం అరుపులు, రోదనలు మిన్నంటాయి. చర్చల కోసం సుప్రీంకోర్టు నియమించిన ప్రతినిధులు సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్డే, న్యాయవాది సాధనా రామచంద్రన్‌ బుధవారం ఆ శిబిరాన్ని సందర్శించినప్పుడు నిరసనలు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను వారు ఆందోళనకారులకు వివరించారు. నిరసనలు చేసుకునేందుకు వారికి హక్కు ఉందని,అదేసమయంలో ఇతరుల హక్కులకు భంగం కలిగించరాదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలనువిడమర్చి చెప్పారు. అయితే ఆందోళనకారులు దానికి అంగీకరించలేదు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లను కేంద్రం ఉపసంహరించేదాకా వెనక్కితగ్గేది లేదన్నారు.

Updated Date - 2020-02-20T09:36:25+05:30 IST