తప్పనిసరి వ్యాక్సీనేషన్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన, రహస్య ప్రదేశంలో దాక్కున్న ప్రధాని

ABN , First Publish Date - 2022-01-30T19:21:21+05:30 IST

కొవిడ్ వ్యాక్సీనేషన్‌ను వ్యతిరేకిస్తున్న వారిని జస్టిన్ ట్రూడో తప్పు పట్టారు. ఈ విషయమై శనివారం ఆయన మాట్లాడుతూ ‘‘కొంత మంది వ్యక్తుల అభిప్రాయాలను కెనడియన్ ప్రజల మొత్తానికి రుద్దకూడదు. వ్యాక్సినేషన్‌ను వ్యతిరేకిస్తూ..

తప్పనిసరి వ్యాక్సీనేషన్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన, రహస్య ప్రదేశంలో దాక్కున్న ప్రధాని

ఒట్టావా: కొవిడ్ వ్యాక్సినేషన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని కెనడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను ఫాసిజంతో పోలుస్తూ వేలాది మంది ట్రక్కులతో ఒట్టావాలోని పార్లమెంట్ భవన్‌కు బయలుదేరారు. దీంతో చేసేదేమీ లేక కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన కుటుంబంతో కలిసి రహస్య ప్రదేశానికి వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాని రహస్య ప్రదేశం గురించి ఎలాంటి సమాచారమైనా వెల్లడించడం కుదరదని కెనడా ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు.


కొవిడ్ వ్యాక్సీనేషన్‌ను వ్యతిరేకిస్తున్న వారిని జస్టిన్ ట్రూడో తప్పు పట్టారు. ఈ విషయమై శనివారం ఆయన మాట్లాడుతూ ‘‘కొంత మంది వ్యక్తుల అభిప్రాయాలను కెనడియన్ ప్రజల మొత్తానికి రుద్దకూడదు. వ్యాక్సినేషన్‌ను వ్యతిరేకిస్తూ ఒట్టవాకు నిరసనగా రావడం ఆమోదించదగ్గ అంశం కాదు. నిరసన చేస్తున్న వారిలో సైన్స్ గురించి ఎంత వరకు అవగాహన ఉంది? కనీసం వాళ్లలో ఒకరికొకరు అయినా ఈ విషయమై శాస్త్రీయంగా మాట్లాడుకోగలరా? స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, హక్కులు, విలువలు అంటే ఇవేనా?(ఒట్టవాకు నిరసనగా రావడంపై)’’ అని ట్రూడో అన్నారు.


అంతే, ట్రూడో వ్యాఖ్యలకు మరింత కోపోద్రిక్తులైన కెనడియన్లు వేల సంఖ్యలో ట్రక్కులను బయటికి తీసి కెనడా పార్లమెంట్‌కు ర్యాలీగా కదిలారు. ‘వ్యాక్సీనేషన్ కాదు ఫ్రీడం తప్పనిసరి’ అనే నినాదాలతో జస్టిన్ ట్రూడోకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. టొరంటో, లండన్, యార్క్, డుర్హాన్ ప్రాంతాల నుంచి సుమారు 10 వేల మంది ఒట్టావాకు ట్రక్కుల్లో బయలుదేరారని కెనడా పార్లమెంటరీ ప్రొటెక్టివ్ సర్వీస్ తెలిపింది. ఈ విషయమై ఒక నిరసనకారుడు మాట్లాడుతూ ‘‘బలవంతంగా, నిర్భందంగా ఏదైనా చేయాలని చూస్తే మనం అనుకున్న ఫలితాలను సాధించలేము. ఇది చాలా శాంతియుతమైన నిరసన. హింసాత్మక చర్యలు ఎలాంటివైనా మేము కూడా సహించబోం’’ అని అన్నారు.

Updated Date - 2022-01-30T19:21:21+05:30 IST