భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

ABN , First Publish Date - 2021-11-20T08:02:48+05:30 IST

మాజీ సీఎం చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానించడంపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు. పలు ప్రాంతాల్లో రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జగన్‌, ఎమ్మెల్యేలు కొడాలి నాని,

భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

  • రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు
  • సీఎం జగన్‌, కొడాలి, అంబటి, వంశీ దిష్టి బొమ్మలు, ఫోటోలు దగ్ధం
  • వైసీపీపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు
  • ఐదుగురి ఆత్మహత్యాయత్నం... ఇద్దరికి సీరియస్‌

నిత్యం నిబ్బరంగా, నిగ్రహంగా... సందర్భాన్ని బట్టి ఆగ్రహంగా మాత్రమే కనిపించే చంద్రబాబు తొలిసారిగా కన్నీరు పెట్టారు. మనసులోని బాధతో మాట్లాడలేకపోయారు. భావోద్వేగం భరించలేక వెక్కివెక్కి ఏడ్చారు. శుక్రవారం సభలో జరిగిన పరిణామాలపై మీడియా ముందు మాట్లాడుతూనే.. కన్నీరు పెట్టారు. సుమారు రెండు నిమిషాలపాటు ఆయన తేరుకోలేకపోయారు. అంతకుముందు పార్టీ శాసనసభ పక్షం కార్యాలయంలోనూ తీవ్ర వేదనతో కంటతడిపెట్టారు.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): మాజీ సీఎం చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానించడంపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు. పలు ప్రాంతాల్లో రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జగన్‌, ఎమ్మెల్యేలు కొడాలి నాని, అంబటి, వల్లభనేని వంశీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. భావోద్వేగానికి గురైన కార్యకర్తలు కొన్ని ప్రాంతాల్లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిరసన కార్యక్రమం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఫోటోలను చెప్పులతో కొట్టి, తగులబెట్టారు. గుంటూరులో జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యే అంబటి ఇంటి వరకు టీడీపీ శ్రేణులు బైక్‌ ర్యాలీ నిర్వహించాయి. రాంబాబు క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు... టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వాహనాల్లో నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరి అంబేద్కర్‌ సెంటర్‌లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు శుక్రవారం ధర్నా చేసి వైసీపీ ఎమ్మెల్యేల చిత్రపటాలను చెప్పులతో కొట్టారు. అదే సమయంలో అటుగా వెళుతున్న పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య వాహనాన్ని నేతలు అడ్డుకున్నారు.


నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా టీడీపీ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లాలో టీడీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘు నేతృత్వంలో మంత్రి కొడాలి నాని, అంబటి ఫొటోలను దహనం చేశారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. విజయనగరంలో జరిగిన నిరసనలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు పాల్గొని మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. జంగారెడ్డిగూడెంలో  కె.నాగేశ్వరరావు అనే కార్యకర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెంలో సీఎం జగన్‌, అంబటి రాంబాబు, కొడాలి నానిల బ్యానర్‌లను తగులబెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డున్నారు.


తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేతలు సీఎం జగన్‌ తదితరుల చిత్రపటాలు, దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్లు జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన సమయంలో టీడీపీ నగర ఎస్సీసెల్‌ అధ్యక్షుడు బంగి నాగ, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ విధ్యార్థి నాయకుడు విశ్వేశ్వరనాయుడు అక్కడికి చేరుకొని వెంటతెచ్చుకున్న పురుగుల మందును తాగేశారు. వారిని వెంటనే జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో బెంగళూరుకు తరలించారు. చిత్తూరు జిల్లాలో కుప్పం మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు వసంతమ్మ (42) విషంతాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆమె పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విశాఖలో  సీఎం జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. 


తెలంగాణలోనూ..

వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై తెలంగాణలోని టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ గేట్‌ వద్ద సీఎం జగన్‌ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు తెలుగు యువత నాయకులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు యువత అధ్యక్షుడు జయరాం ఒంటి పై కిరోసిన్‌ పోసుకు నిప్పంటించుకుంటానంటూ హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 


టీవీలో సీఎం జగన్‌ చిత్రాన్ని చెప్పుతో కొడుతున్న వృద్ధుడు


చంద్రబాబు కన్నీరు చూడలేక  పురుగు మందు తాగి  ఐసీయూలో చికిత్స పొందుతున్న కుప్పం తెలుగు మహిళ వసంతమ్మ 

Updated Date - 2021-11-20T08:02:48+05:30 IST