Defence recruitment : అగ్నిపథ్ స్కీమ్‌పై నిరసనల వెల్లువ

ABN , First Publish Date - 2022-06-15T19:32:24+05:30 IST

రక్షణ దళాల్లో ఉద్యోగ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన

Defence recruitment :  అగ్నిపథ్ స్కీమ్‌పై నిరసనల వెల్లువ

న్యూఢిల్లీ : రక్షణ దళాల్లో ఉద్యోగ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు పెల్లుబుకుతున్నాయి. భారత సైన్యం, ఇతర రక్షణ దళాల్లో ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతూ, సిద్ధమవుతున్నవారు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ప్రారంభమవడం కోసం రెండేళ్ళ నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వీరంతా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


అగ్నిపథ్ అంటే?

కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని మంగళవారం ప్రకటించింది. త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసుగలవారిని అగ్నివీరులుగా ఎంపిక చేస్తారు. వీరిని నాలుగేళ్ళ తర్వాత విడుదల చేస్తారు. ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తారు. ఈ నాలుగేళ్ళ కాలంలో నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు వేతనం చెల్లిస్తారు. జీవిత బీమా వంటి సదుపాయాలను కూడా కల్పిస్తారు. అగ్నివీరులుగా చేరేందుకు మహిళలు కూడా అర్హులే. సైన్యం, నావికా దళం, వాయు సేనలలో దాదాపు 45,000 మందిని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రిక్రూట్‌మెంట్లు 90 రోజుల్లో ప్రారంభమవుతాయని, మొదటి బ్యాచ్ 2023 జూలైనాటికి సిద్ధమవుతుందని తెలిపింది. 


ఎందుకు నిరసన?

ఈ విధంగా స్వల్ప కాలంపాటు కాంట్రాక్టు ప్రాతిపదికపై సైనికులను నియమించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని యువత తప్పుబడుతున్నారు. సైన్యంలో చేరడం కోసం రెండేళ్ళ నుంచి శ్రమించి, చదువుకుంటున్నవారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నూతన పథకం వల్ల తమ దీర్ఘకాలిక అవకాశాలు దెబ్బతింటాయని ఆరోపిస్తున్నారు. అగ్నివీరులుగా నియమితులైనవారిలో కేవలం 25 శాతం మంది మాత్రమే తిరిగి రెగ్యులర్ కేడర్‌లో చేరే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఉద్యోగాలివ్వండి, లేదా మమ్మల్ని చంపేయండి’’ వంటి నినాదాలతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. 


బిహార్‌లో...

బిహార్‌లోని బక్సర్, ముజఫర్‌పూర్‌లలో ఉద్యోగార్థులు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బిహార్‌లోని బరౌనీ, ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలను కలిపే జాతీయ రహదారి 28పై ఆందోళన చేశారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరిగే చక్కర్ మైదానానికి సమీపంలో ఉన్న ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి. 


వయో పరిమితిని సడలించాలి

నిరసనకారులు మీడియాతో మాట్లాడుతూ, రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం తాము రెండేళ్ళ నుంచి ఎదురుచూస్తున్నామన్నారు. ఇటువంటి సమయంలో ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. కోవిడ్ కారణంగా నియామక ప్రక్రియను రెండేళ్ళపాటు వాయిదా వేసినందువల్ల వయోపరిమితిని రెండేళ్ళు సడలించాలని కోరారు. ఇంత కాలం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వాయిదా వేసినప్పటికీ బీజేపీ నేతలు ఎవరూ మాట్లాడలేదన్నారు. తమకు అనుకూలంగా భారీ నిర్ణయం తీసుకునే వరకు తాము నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. అగ్నిపథ్ స్కీమును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 


ఇదిలావుండగా, రక్షణ దళాల్లో ఉద్యోగాలను ఆశిస్తున్న వందలాది మంది మంగళవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. పెండింగ్‌లో ఉన్న ఎయిర్‌మెన్ పరీక్షల ఫలితాలను ప్రకటించాలని, మిలిటరీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-06-15T19:32:24+05:30 IST